డిసెంబ‌ర్ 9 నుంచి రేవంత్ పాద‌యాత్ర‌!

డిసెంబ‌ర్ 9 నుంచి రేవంత్ పాద‌యాత్ర‌! రాహుల్ జోడో యాత్ర స్ఫూర్తితో.. పార్టీ బ‌లోపేతం.. అధికార సాధ‌నే ల‌క్ష్యం! విధాత: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావ‌డ‌మే ల‌క్ష్యంగా పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి పాద‌యాత్ర చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన జోడో యాత్ర రాష్ట్రంలో విజ‌య‌వంతంగా ముగిసింది. జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటికి తెలియ‌జేయాల‌న్న సంక‌ల్పంతో రేవంత్ త‌న పాద‌యాత్ర‌ను […]

  • Publish Date - November 14, 2022 / 05:46 PM IST
  • డిసెంబ‌ర్ 9 నుంచి రేవంత్ పాద‌యాత్ర‌!
  • రాహుల్ జోడో యాత్ర స్ఫూర్తితో..
  • పార్టీ బ‌లోపేతం.. అధికార సాధ‌నే ల‌క్ష్యం!

విధాత: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావ‌డ‌మే ల‌క్ష్యంగా పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి పాద‌యాత్ర చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన జోడో యాత్ర రాష్ట్రంలో విజ‌య‌వంతంగా ముగిసింది. జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటికి తెలియ‌జేయాల‌న్న సంక‌ల్పంతో రేవంత్ త‌న పాద‌యాత్ర‌ను సోనియాగాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మొద‌లుపెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలలో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంద‌ని.. అయితే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుట్ర పూరితంగా బ‌ల‌హీన ప‌రుస్తున్నాయ‌ని మొద‌టి నుంచి పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా.. త‌మ పార్టీ నాయ‌కుల‌ను కొనుగోలు చేసినా.. క్షేత్ర స్థాయిలో పార్టీ బ‌లంగా ఉంద‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ది.

రాహుల్ చేప‌ట్టిన జోడో యాత్ర‌లో స్వ‌చ్ఛందంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున క‌ద‌లి వ‌చ్చాయ‌ని నేత‌లు చెపుతున్నారు. 12 రోజుల పాటు రాష్ట్రంలో జ‌రిగిన రాహుల్ జోడో యాత్ర సంద‌ర్భంగా జ‌రిగిన ప్ర‌తి స‌భ‌లో దాదాపు 50 వేల మంది వ‌ర‌కు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా పాల్గొన్న‌ట్లు ఒక అంచ‌నా..

పార్టీకి ఆద‌ర‌ణ లేక‌పోతే జోడో యాత్ర‌లో ప్ర‌జ‌లు భారీ స్థాయిలో ఎలా పాల్గొంటార‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. జోడో యాత్ర ద్వారా రాష్ట్ర క్యాడ‌ర్‌లో ఒక జోష్ ఏర్ప‌డింద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేప‌ట్టి నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని రేవంత్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఒక వైపు రాహుల్‌జోడో యాత్ర జోష్‌.. మ‌రో వైపు వ‌రుస‌గా ఉప ఎన్నిక‌ల్లో డిపాజిట్ కోల్పోయిన ప‌రిస్థ‌తి… మ‌రో వైపు వ‌రుస‌గా నేత‌లు పార్టీని వీడుతున్న వైనం.. ఈ స‌మ‌యంలో పాద‌యాత్ర చేయ‌డం ద్వారా నిత్యం జ‌నంలో ఉంటూ ప్ర‌త్యామ్నాయ‌ ఎజెండాను ప్ర‌జ‌ల ముందుకు తీసుకు వెళ్లాల‌ని రేవంత్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ ద్వారా రేవంత్ ప్ర‌త్యేక ఎజెండాను ప్ర‌జ‌ల ముందు పెట్టారు. ఇదే విష‌యాన్ని జోడో యాత్ర‌లో రాహుల్ చేత చెప్పించారు.

సోనియా గాంధీ జ‌న్మ‌దినం రోజున పాద‌యాత్ర చేప‌డితే విజ‌యం ల‌భిస్తుంద‌న్న భావ‌న‌లో రేవంత్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. సోనియా త‌న జ‌న్మ‌దిన కానుక‌గా ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్ర‌క‌టించింద‌ని, ఆ త‌రువాత ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా.. తెలంగాణ ఏర్పాటు ఆగ‌లేద‌ని పార్టీ వ‌ర్గం భావిస్తోంది.

అందుకే సోనియా పుట్టిన రోజు డిసెంబ‌ర్ 9 నుంచి పాద‌యాత్ర చేప‌ట్టేందుకు సిద్ధమ‌వుతున్నారు. పాద‌యాత్ర‌తో పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను అధికారంలో తీసుకురావల‌ని రేవంత్ భావిస్తున్న‌ట్లు గాంధీ భ‌వ‌న్‌లోని కాంగ్రెస్ వ‌ర్గాల‌లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.