నికార్సైన కాంగ్రెసోడా మునుగోడుకు రా..! రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ విధాత, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మూడు రంగుల జెండాను భుజాన మోస్తూ సూర్యోదయాని కంటే ముందే వేలాదిగా తరలి వచ్చి.. మన నాయకుడు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు అద్భుతమైన ఆహ్వానం పలికిన తెలంగాణ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో […]

- రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
విధాత, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మూడు రంగుల జెండాను భుజాన మోస్తూ సూర్యోదయాని కంటే ముందే వేలాదిగా తరలి వచ్చి.. మన నాయకుడు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు అద్భుతమైన ఆహ్వానం పలికిన తెలంగాణ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నా కుటుంబ సభ్యులైన రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేం. అక్కడ కాంగ్రెస్ పై కుట్ర జరుగుతోంది.
మనల్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్ ను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పథక రచన చేస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలనుకుంటున్నాయి. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. అధికార, ఆర్థిక బలాలతో కాంగ్రెస్ ను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి తీయాలని కక్ష కట్టారు.
కాంగ్రెస్ బిక్షతో ఎదిగివాళ్లే వెన్నుపోటు పొడిచారు. శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే పైసాకి పనికి రాని వాళ్లు రాజ్యాలేలుతూ మనల్ని అంతం చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారు. సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలను బీజేపీ.. రాష్ట్ర పోలీసులు, స్థానిక అధికార గణాన్ని టీఆర్ఎస్ విచ్చల విడిగా దుర్వినియోగం చేస్తున్నాయి.
గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ పై గుర్తుల స్థానంతో పాటు.. అడుగడుగున ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పవిత్రమైన యాదగిరిగుట్ట నర్సింహస్వామి దేవస్థానాన్ని సైతం రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడం దీనికి పరాకాష్ఠ. ఆడబిడ్డ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా పాల్వాయి స్రవంతి పై రాళ్ల దాడులకు తెగ పడుతున్నారు.
బీజేపీ అభ్యర్థే స్వయంగా దాడికి దిగడం పరిస్థితికి అద్దం పడుతోంది. మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేష్ఠులుగా ఉందామా!? తెలంగాణ అస్థిత్వానికి ప్రాణం పోసిన తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా? కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు!?
60 ఏండ్ల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా!? ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికి ఒక్కటే విజ్ఞప్తి. ఘనమైన పోరాటాల చరిత్రకు వారసులమైన మనం బాంఛన్ దొరా అని బానిసలవుదామా… నిప్పుకణికలై నిటారుగా నిలబడి కొట్లాడుదామా తేల్చుకోవాల్సిన సమయం ఇది.
కులం లేదు మతం లేదు.. ఊరు లేదు వాడ లేదు.. పల్లె లేదు పట్నం లేదు.. తెలంగాణ నలు మూలల నుండి తండాలు, గూడెలు, పల్లెల నుండి ఉన్నపళంగా కదలి రండి. మునుగోడులో కలిసి కదం తొక్కుదాం. ప్రాణమో.. ప్రజాస్వామ్యమో తాడోపేడో తేల్చుకుందాం.
మీరే నా బలం.. నా ధైర్యం. లాఠీ ఐనా, తూఠా ఐనా మీ ముందు నేనుంటా. మనల్ని ఏకాకుల్ని చేసే కుట్రలు తిప్పి కొడదాం. సత్తా చాటి మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం. ఈ క్షణమే కదలండి.. మీ కోసం మునుగోడులో ఎదురు చూస్తుంటా అని లేఖ రాశారు.