Rinku Singh । స్వీపర్‌ జాబ్ వద్దనుకుని.. సిక్సర్లు బాదేశాడు!

పేదరికం నుంచి ఎగిసిన ప్రతిభాశిఖరం సిక్సర్ల రింకూ జీవితం ఇలా మొదలైంది.. మట్టిలో మాణిక్యాలు అనే మాట ఊరికే రాలేదు. ఈ సువిశాల భారతదేశంలో ప్రతిభ ఉండీ అవకాశాలు లభించని మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. వారందరికీ పేదరికమే అడ్డు. ఆ అడ్డంకిని దాటడమే వారికి సవాలు. ఆ సవాళ్లను అధిగమించి.. యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని కేవలం నాలుగు బంతులను ఆడిన తీరుతో తనవైపు దృష్టిమళ్లించుకునేలా చేసిన యువ కెరటం! దటీజ్‌ రింకుసింగ్‌! ఒక దశలో ఒక కోచింగ్‌ […]

  • By: Somu    latest    Apr 10, 2023 11:42 AM IST
Rinku Singh । స్వీపర్‌ జాబ్ వద్దనుకుని.. సిక్సర్లు బాదేశాడు!
  • పేదరికం నుంచి ఎగిసిన ప్రతిభాశిఖరం
  • సిక్సర్ల రింకూ జీవితం ఇలా మొదలైంది..

మట్టిలో మాణిక్యాలు అనే మాట ఊరికే రాలేదు. ఈ సువిశాల భారతదేశంలో ప్రతిభ ఉండీ అవకాశాలు లభించని మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. వారందరికీ పేదరికమే అడ్డు. ఆ అడ్డంకిని దాటడమే వారికి సవాలు. ఆ సవాళ్లను అధిగమించి.. యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని కేవలం నాలుగు బంతులను ఆడిన తీరుతో తనవైపు దృష్టిమళ్లించుకునేలా చేసిన యువ కెరటం! దటీజ్‌ రింకుసింగ్‌! ఒక దశలో ఒక కోచింగ్‌ సెంటర్‌లో స్వీపర్‌ పని చేయాల్సి వచ్చినా.. తాను సాధించాల్సింది ఏదో ఉన్నదని నమ్మి.. సాధన చేసి.. నిరూపించుకున్న ఉత్తరప్రదేశ్‌ పేదోడు!

విధాత : ఆరు బంతులు.. 29 పరుగులు! స్టేడియంలో ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆ మ్యాచ్‌ను లైవ్‌లో చూస్తున్న కోట్ల మంది నరాలు తెగిపోతున్న వేళ! తోటి బ్యాటర్‌ సింగిల్‌ తీసి ఇచ్చిన అవకాశం! మిగిలినవి ఐదు బంతులు.. చావో రేవో అనుకోలేదతడు! ఎట్టిపరిస్థితుల్లో రేవుకు చేరాలనే సంకల్పం ధరించాడు! ఆ క్షణం నుంచే మెరుపులు మొదలు! ఐదు బంతుల్లో ఐదూ సిక్సర్లే! ఐదే ఐదు బంతుల్లో ఫలితాన్ని మార్చేసిన ఆ కుర్రాడే రింకూసింగ్‌! (Rinku Singh)

పేదరికం నుంచి ఎదిగి..

మెరికలాంటి ఈ కుర్రాడు ఏదో పెద్ద అకాడమీలో క్రికెట్‌ నేర్చుకోలేదు! ఓ ఖరీదైన కారెక్కి గ్రౌండ్‌కు వచ్చి ప్రాక్టీస్‌ చేసిన పాష్‌ బ్యాచ్‌ కాదు. డైట్‌లు మెయింటన్‌ చేసుకుంటూ ఖరీదైన, ఎంపిక చేసిన కంపెనీల మంచినీళ్ల బాటిళ్లు తాగిన శరీరం కాదు! అతడు క్రికెట్‌ నేర్చుకోవడం వెనుక ఒక తపన ఉన్నది. అతడు చేసిన ప్రాక్టీస్‌ వెనుక ఒక లక్ష్యం ఉన్నది. ఒకవైపు కడు పేదరికం అనుభవిస్తున్నా.. లక్ష్యంపై దృష్టిమరల్చకుండా.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనే ‘ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది’ అని ప్రశంసలు పొందాడు. దటీజ్‌ రింకూసింగ్‌!

స్వీపర్‌ జాబ్‌ వద్దనుకుని..

పేద కుటుంబం! పేదలు ఉండే మురికివాడలో రెండు గదుల నివాసం! ఇప్పటికే అదే. అక్కడ తప్ప మరో చోట మంచిగా నివసించేంత ఆదాయం లేని తండ్రి కిషన్‌చంద్‌సింగ్‌. ఆ తండ్రి చేసేపని ఇంటింటికీ తన సైకిల్‌పై గ్యాస్‌ సిలిండర్లు మోయడం! ఆ పనిలో తన కొడుకులూ ఆసరాగా నిలిచారు. సిలిండర్ల గొడౌన్‌ సమీపంలో ఉండే ఆ ‘ఇంటి బరువు’ మోయడానికి ఇంకో భుజం అవసరమైనప్పుడు రింకూసింగ్‌కు వచ్చిన ఆఫర్‌.. ఓ కోచింగ్‌ సెంటర్‌లో గదులు శుభ్రం చేసి.. తడిగుడ్డ వేసి తుడవడం!

క్రికెట్‌ను నమ్మి.. ప్రేమించి..

కడు పేదరికం కమ్మేస్తున్నా.. చెదరని దృఢ సంకల్పం అతడికి భరోసానిచ్చింది. అంతటి కష్టాల్లోనూ అతడి పెదవులపై చిరునవ్వు సడలిపోలేదు. తాను చేయాల్సింది స్వీపర్‌ పనికాదని, బరిలో నిలబడి.. సిక్లర్లు బాదడమని నిశ్చయించుకున్న రింకూసింగ్‌.. ఆ ఆఫర్‌ను వదులుకున్నాడు. పేదరికం నుంచి తమను బయటపడేసేది తాను నమ్ముకున్న, తాను ప్రేమిస్తున్న క్రికెట్‌ ఒక్కటే అని నిర్ణయానికి వచ్చాడు.

నేను అప్పుడప్పుడే క్రికెట్‌ ఆడుతున్న రోజుల్లో.. ఇంకా సరైన ఆటలో కుదురుకోని సమయంలో నా అన్నతో కలిసి చేసేందుకు ఒక పని ఇస్తామన్నారు. అది ఒక కోచింగ్‌ సెంటర్‌లో స్వీపింగ్‌, మాపింగ్‌ చేసే పని. ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు. అందుకు వద్దనుకున్నాను’ అని రింకూసింగ్‌ ఒక వీడియోలో చెప్పాడు.