Medak: వర్షాకాలం ప్రారంభం లోపు రోడ్డు పనులు పూర్తి చేయాలి: మంత్రి హరీశ్‌రావు

అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్ రావు.. అధికారులతో సమీక్షా సమావేశం.. పాల్గొన్న కలెక్టర్, అధికారులు విధాత, మెదక్ బ్యూరో: వర్షాకాలం ప్రారంభానికి ముందే రోడ్ల ప్రగతి, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం కెసిఆర్ ఆదేశించారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం పంచాయతీ రాజ్ కమిషనర్ హన్మంతరావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అడిషనల్ […]

Medak: వర్షాకాలం ప్రారంభం లోపు రోడ్డు పనులు పూర్తి చేయాలి: మంత్రి హరీశ్‌రావు
  • అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్ రావు..
  • అధికారులతో సమీక్షా సమావేశం..
  • పాల్గొన్న కలెక్టర్, అధికారులు

విధాత, మెదక్ బ్యూరో: వర్షాకాలం ప్రారంభానికి ముందే రోడ్ల ప్రగతి, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం కెసిఆర్ ఆదేశించారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం పంచాయతీ రాజ్ కమిషనర్ హన్మంతరావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, పంచాయతీ రాజ్ ఈఈ, ఆర్అండ్ బీ ఈఈ సుదర్శన్, ఆయా శాఖ అధికార యంత్రాంగంతో జిల్లాలో పీఆర్-బీటీ రెన్యూవల్ ప్రగతి- పనులు పురోగతి పై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

అధికారుల‌ తీరుపై మంత్రి ఆగ్ర‌హం..

జిల్లాలో పంచాయతీ రాజ్ ద్వారా 274 పనులు, ఆర్అండ్ బీ ద్వారా 26 పనులను జిల్లాలో ఏప్రిల్ నెలాఖరులోగా అన్నీ బీటీ రెన్యువల్స్ క్వాలిటీతో పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి మంత్రి ఆదేశించారు. ఆర్అండ్ బీలో 26 పనులకు గానూ పనులేమీ ప్రారంభం కాకపోవడంపై ఆర్అండ్ బీ అధికారుల తీరుపై మంత్రి అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటీ రోడ్ల రెన్యువల్స్ పై నిర్లక్ష్యం వహిస్తే అధికార ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.

రోడ్డు ప్ర‌మాదాల‌పై దృష్టి పెట్టాలి..

రాజీవ్ రహదారిని కలుపుకుని లింకు రోడ్లు, ఇతర రహదారులు కలిసే చోట ఎక్కువగా వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు వేయడమే పనికాదు. ప్రమాదాలు నివారించడం కూడా మన బాధ్యతగా పంచాయతీ రాజ్, ఆర్అండ్ బీ ఇంజినీర్ అధికారులు పని చేయాలని మంత్రి హితవు పలికారు. 2022 సంవత్సరంలో 299 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో జరిగిన ప్రమాదాలు అన్నీ ఎక్కువగా రాజీవ్ రహదారి కలిసే ప్రాంతాల్లో జరిగాయి. రోడ్ల ప్రమాదాల నివారణకు పంచాయతీ రాజ్, ఆర్అండ్ బీ ఇంజినీర్లు దృష్టి పెట్టాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

సిద్ధిపేట రింగురోడ్డు త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని ఆదేశం..

రాజీవ్‌ర‌హదారిపై, లింకు రోడ్లు కలిసే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, స్మూత్ జాయినింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గజ్వేల్ రింగురోడ్డు మార్చినెలలోపు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. 55 కిలోమీటర్ల మేర నిడివి కలిగిన సిద్ధిపేట రింగురోడ్డు నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి అయ్యేలా చొరవ చూపాలని ఆర్అండ్‌బీ డీఈ బాలప్రసాద్‌ను మంత్రి ఆదేశించారు.