నేవీలో కీల‌క ప‌ద‌వికి లింక్డిన్‌లో ప్ర‌క‌ట‌న‌.. సిబ్బంది కొర‌త‌తో బ్రిట‌న్ అసాధార‌ణ చ‌ర్య‌

ఏ దేశ సైన్య‌మైనా సొంతంగా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకుని నియామ‌కాలు చేసుకుంటాయి. వివిధ వ‌డ‌పోత‌ల అనంత‌రం.. ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా బాగుంటేనే సైన్యంలో చేర్చుకుంటాయి

  • Publish Date - January 6, 2024 / 08:52 AM IST

విధాత: ఏ దేశ సైన్య‌మైనా సొంతంగా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకుని నియామ‌కాలు చేసుకుంటాయి. వివిధ వ‌డ‌పోత‌ల అనంత‌రం.. ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా బాగుంటేనే సైన్యంలో చేర్చుకుంటాయి. అలాంటిది నేరుగా ప్రైవేట్ కంపెనీలు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే లింక్డిన్‌లో ఒక దేశా నౌకా ద‌ళం.. ఉన్న‌త స్థాయి ప‌ద‌వికి నియామ‌క ప్ర‌క‌ట‌న‌ను ఇవ్వ‌డం విస్తుగొలుపుతోంది. అదీ కూడా చిన్నా చిత‌కా దేశం కాదు. ర‌వి అస్త‌మించని రాజ్యంగా పేరొందిన బ్రిట‌న్ (Britain) ఈ యాడ్‌ను ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ దేశానికి చెందిన నావికాదళాన్ని రాయ‌ల్ నేవీ (Royal Navy) అని పిలుస్తారు.


ఈ అకౌంట్ పేరుతో లింక్డిన్ (LinkedIn) లో ఒక ప్ర‌క‌ట‌న క‌నిపిస్తోంది. త‌మ ద‌ళానికి చెందిన స‌బ్‌మెరైన్స్‌కు డైరెక్ట‌ర్ పోస్టు కోసం అన్వేషిస్తున్నామ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో ఉంది. ‘స‌ముద్రం అట్టడుగున నిశ్శ‌బ్దంగా ఉండే శ‌క్తి.. స‌బ్‌మెరైన్స్‌. డైరెక్ట‌ర్ ఆఫ్ స‌బ్‌మెరైన్స్ కోసం రాయ‌ల్ నేవీ అన్వేషిస్తోంది. అత్యంత ర‌హ‌స్య‌మైన, ప్ర‌త్యేక‌మైన ఆప‌రేష‌న్స్‌కు మీరు నేతృత్వం వ‌హించాల్సి ఉంటుంది. అలాగే న్యూక్లియ‌ర్ క్షిప‌ణుల ప్ర‌యోగానికి నిర్ణ‌యాలు తీసుకోవాలి’ అని ఆ నియామ‌క ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.


ఈ పోస్టుకు అప్లై చేసేవారు రిజ‌ర్వ్ ద‌ళాల్లో ప‌ని చేస్తున్న వారైనా అయిఉండాల‌ని.. లేదా రెగ్యుల‌ర్ సైన్యంలో ఒక‌ప్పుడు సేవ‌లందించైనా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. సైన్యాన్ని ఖాళీల కొర‌త వేధిస్తోంద‌ని అందుకే ఈ అసాధార‌ణ చ‌ర్య‌కు రాయ‌ల్ నేవీ దిగింద‌ని తెలుస్తోంది. డైరెక్ట‌ర్ ఆఫ్ స‌బ్‌మెరైన్‌ పోస్టుకు అర్హులైన వారు అంత‌ర్గ‌తంగా లేక‌పోవ‌డంతో ఔట్ సోర్సింగ్ చేద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఒక అధికారి వెల్ల‌డించారు. ఉండాల్సిన స్థాయిలో శిక్ష‌ణ పొందిన సిబ్బంది లేక ఏకంగా రెండు యుద్ధ‌నౌక‌లను రాయ‌ల్ నేవీ విధుల నుంచి త‌ప్పించింద‌ని ఇటీవ‌లే వార్త‌లు రావ‌డం దాని ప్ర‌తిష్ఠ‌ను మ‌రింత మ‌స‌కబార్చింది.


ఇక ప‌రిస్థితి చేయిదాటిపోకుండా దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో ఈ ప్ర‌క‌ట‌న ఇచ్చిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం.. బ్రిట‌న్ త్రివిధ ద‌ళాల‌ను పోల్చి చూస్తే నూత‌న నియామ‌కాల సంఖ్య‌లో రాయ‌ల్ నేవీ దారుణ‌మైన రికార్డును క‌లిగి ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు రాయ‌ల్‌నేవీ ఇచ్చిన ఈ బ‌హిరంగ‌ ఉద్యోగ‌ ప్ర‌క‌ట‌న‌పై బ్రిట‌న్ భ‌ద్ర‌తా నిపుణులు, మాజీ సైనికాధికారులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.

Latest News