PM Modi | 20 లక్షల కోట్ల స్కాంకు వాళ్లు గ్యారెంటీ: మోదీ

PM Modi అవినీతిపరుల సమ్మేళనం అది బెంగళూరు భేటీపై దుమ్మెత్తిన మోదీ పోర్ట్‌బ్లెయిర్‌లో విమానాశ్రయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ: సొంత రాజకీయ ప్రయోజనాల కోసం దేశ సంక్షేమాన్ని పణంగా పెడుతున్నాయంటూ ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం పోర్ట్‌బ్లెయిర్‌లో వీర సావార్కర్‌ ఎయిర్‌పోర్టను ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబం ముందు.. తర్వాతే దేశం అనే అంశంపైనే ప్రతిపక్షాల దృష్టి కేంద్రీకృతమై ఉన్నదని మోదీ అన్నారు. […]

  • Publish Date - July 18, 2023 / 11:24 AM IST

PM Modi

  • అవినీతిపరుల సమ్మేళనం అది
  • బెంగళూరు భేటీపై దుమ్మెత్తిన మోదీ
  • పోర్ట్‌బ్లెయిర్‌లో విమానాశ్రయాన్ని
  • వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ: సొంత రాజకీయ ప్రయోజనాల కోసం దేశ సంక్షేమాన్ని పణంగా పెడుతున్నాయంటూ ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం పోర్ట్‌బ్లెయిర్‌లో వీర సావార్కర్‌ ఎయిర్‌పోర్టను ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబం ముందు.. తర్వాతే దేశం అనే అంశంపైనే ప్రతిపక్షాల దృష్టి కేంద్రీకృతమై ఉన్నదని మోదీ అన్నారు.

బెంగళూరులో సమావేశమైన ప్రతిపక్షాల నుద్దేశించి మాట్లాడుతూ.. వారి సమావేశం అవినీతిని ప్రోత్సహించుకునేందుకే అని ప్రజలు అంటున్నారని చెప్పారు. 20 లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ పార్టీలు గ్యారెంటీ ఇవ్వగలవని అన్నారు. ‘తమిళనాడులో అవినీతి కేసులు ఉన్నా.. డీఎంకేకు ప్రతిపక్షాలు క్లీన్‌ చిట్‌ ఇచ్చాయి. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో తమ సొంత క్యాడర్‌పై దాడులు జరిగినా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు మౌనం వహించారు.

దేశంలో పేద ప్రజల పిల్లల అభివృద్ధి వారికి పట్టదు. వారి కనీస ఉమ్మడి కార్యక్రమం తమ కుటుంబాల అవినీతిని పెంచుకోవడమే’ అని మోదీ విమర్శించారు. ప్రజల కోసం ప్రజలెన్నుకుని ప్రజలే పరిపాలించుకునేదే ప్రజాస్వామ్యం అన్న మోదీ.. కుటుంబాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలకు మాత్రం కుటుంబాల కోసం కుటుంబాలు ఎన్నుకుని, కుటుంబాలే పరిపాలించుకునేది అన్నట్టు తయారైందని అన్నారు. ముందు కుటుంబం.. ఆ తర్వాతే దేశం అన్నదే వారి ఉద్దేశమని చెప్పారు.

కుటుంబ రాజకీయాలకు దేశం బాధితురాలిగా మారిందని అన్నారు. ప్రజలు ఇప్పటికే మరోసారి బీజేపీని అధికారంలో తేవాలని నిర్ణయించుకున్నారన్న మోదీ.. ప్రజల బాధలకు కారణమైన పార్టీలు దుకాణాలు తెరిచాయని మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీల స్వార్థ రాజకీయాల కారణంగానే దీర్ఘకాలంగా అభివృద్ధి అనేది కొన్ని పెద్ద నగరాలకే పరిమితమై పోయిందని అన్నారు. ఫలితంగా గిరిజనులు,ద్వీప ప్రాంతాలను అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు.