ఆర్టీసీ పందెంకోడి.. వేలంపాట నేడే

కరీంనగర్(2) ఆర్టీసీ డిపోలో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగులో లభించిన పందెం కోడిని బహిరంగ వేలం వేయాలని డిపో మేనేజర్ నిర్ణయించారు.

  • Publish Date - January 11, 2024 / 10:39 AM IST
  • భలే ఐడియా వేసిన డిపో అధికారులు !!


విధాత, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: కరీంనగర్(2) ఆర్టీసీ డిపోలో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగులో లభించిన పందెం కోడిని బహిరంగ వేలం వేయాలని డిపో మేనేజర్ నిర్ణయించారు. ఈ మేరకు వేలం ప్రకటన విడుదల చేశారు. ఈనెల తొమ్మిదవ తేదీన తమ డిపో బస్సులో ప్రయాణికులు ఎవరో పందెం కోడిని మరిచిపోయారని..దానిని తీసుకుపోవడానికి గత మూడు రోజులుగా ఎవరూ రాలేదన్నారు. దీంతో ఈ పందెం కోడికి సంబంధించి కరీంనగర్‌(2)డిపో పరిధిలోని అంబేద్కర్ బస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం 12వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నామని తెలిపారు.


ఆసక్తి గల వారి బహిరంగ వేలంలో పాల్గొనాలని కోరారు. గత మూడు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సంరక్షణలో ఉన్న పందెం కోడిని మేపడం ఆర్టీసీ సిబ్బందికి అదనపు భారంగా మారింది. కోడి కోసం ఎవరు రాకపోవడంతో దాన్ని ఎలా వదిలించుకోవాలన్నదానిపై డిపో అధికారులు తీవ్ర మథనం చేశారు. పందెం కోడిని వదిలించుకోవడంతో పాటు సంస్థకు ఆదాయం దక్కుతుందన్న ఆలోచనతో బహిరంగ వేలం ఐడియాకు ఓకే చేశారు.



ఈనెల 9న వరంగల్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళుతున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకు వెళుతున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మరిచి వెళ్లిపోయాడు. బస్సులో బ్యాగ్ గమనించిన సహచర ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు. అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దానిని తెరిచి చూడగా, భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెంకోడి కనపడింది.


దీంతో దాన్ని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీనంగర్‌(2) డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెపుకోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో శుక్రవారం వేలానికి ముహూర్తం నిర్ణయించారు.