Sai Dharam Tej
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) 2021 సెప్టెంబర్ 10న భారీ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన మృత్యువు అంచుల వరకు వెళ్లివచ్చారు. ఇప్పుడు సాయిధరమ్‌ది పునర్జన్మ అనే చెప్పుకోవాలి. ఆ రోజు దుర్గం చెరువు వద్ద జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోవాల్సిన సాయిధరమ్ తేజ్.. దేవుడి దయ, మేనమామల, అభిమానుల ఆశీస్సులతో కోలుకుని నార్మల్ అయ్యాడు.
అయితే యాక్సిడెంట్ జరిగిన సమయంలో తనని గుర్తించి హాస్పిటల్‌కి తీసుకెళ్లిన వ్యక్తిని సాయిధరమ్ తేజ్ ఇటీవల కలిశాడట. ఈ విషయం తన తాజా ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ తెలిపారు. అయితే అతనికి మనీ ఏమీ ఇవ్వలేదని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. యాక్సిడెంట్ రోజు సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి సాయిధరమ్‌ని గుర్తించి అంబులెన్స్‌కి కాల్ చేశాడనే విషయం ఇంతకు ముందు మెగా బ్రదర్స్ చెప్పారు. సకాలంలో అన్ని జరగడంతో సాయిధరమ్ తేజ్ ఈ రోజు మళ్లీ మాములుగా మనుషులలోకి వచ్చాడు.
దీనికి కారణం కచ్చితంగా మొదట అంబులెన్స్‌కి కాల్ చేసిన సయ్యద్ అనే చెప్పుకోవాలి. అందుకే సయ్యద్‌ని కలిసి సాయిధరమ్ కృతజ్ఞతలు చెప్పాడట. ‘అతనికి డబ్బు రూపంగా మాత్రం నేను ఏమీ ఇవ్వలేదు. డబ్బులిచ్చి ఇంతటితో అయిపోయిందనుకునే బంధం కాదది.
నా ప్రాణం కాపాడి.. మళ్లీ ఈ రోజు నేను ఇలా ఉండటానికి కారణమైన వ్యక్తిని డబ్బుతో కొలవలేను. అందుకే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. నీ కుటుంబ సభ్యుడిలా భావించి ఫోన్ చేయమని చెప్పాను’ అని సాయిధరమ్ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు, బాగా తాగి యాక్సిడెంట్ చేశాడనే ఆరోపణలను కూడా సాయిధరమ్ తేజ్ ఖండించాడు. ‘నాకసలు మద్యం సేవించే అలవాటే లేదు. దేవా కట్టాగారిని కలిసి వస్తున్నాను. అప్పుడే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నా మాటపోయింది. చాలా రోజుల వరకు మాట రాలేదు. మళ్లీ అమ్మ నాకు మాట వచ్చేలా చేసింది.
ఇటీవల ఈవెంట్స్‌లో కూడా నేను మాట్లాడుతుంటే తాగి వచ్చానని అంతా అనుకున్నారు. కానీ అది ప్రమాదం కారణంగా సంభవించినదే. ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో గొంతు సరి అవుతుంది.
గొంతు కోసం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను’ అని తేజ్ అనేక అనుమానాలకు క్లారిటీ ఇచ్చాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉన్న విషయం తెలిసిందే.