విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో సంచలనం సృష్టించి మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్య కేసు (Medico Preethi Case) లో నిందితుడు సీనియర్ మెడికో డాక్టర్ సైఫ్ కు బెయిల్ వచ్చింది. ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం సహా వరంగల్ జిల్లా రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు సైఫ్ దాఖలు చేసుకున్న మూడు బెయిల్ దరఖాస్తులను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తాజాగా రూ.10 వేల సొంత పూచీ కత్తుతో పాటు అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల పూచీ కత్తును కోర్టుకు సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల మధ్య, 16 వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని ఆదేశించారు.
సాక్షులను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయవద్దని, ప్రీతి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయవద్దని న్యాయమూర్తి నిబంధనలు విధించారు. న్యాయస్థానం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే తక్షణమే బెయిల్ రద్దుకు పోలీసులు కోరవచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సైఫ్ ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.