సిబ్బంది.. అధికారుల కృషితోనే పురోగమనం : సజ్జనార్
టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏ ఛాలెంజ్ ను తీసుకువచ్చిన అధికారులు, సిబ్బంది విజయవంతం చేస్తున్నారని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కొనియాడారు

వేగంగా అందుబాటులోకి కొత్త బస్సులు
“పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే 1325 డీజిల్, మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెస్తోందన్నారు. ఈ 2375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని, వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోందని తెలిపారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్ మెంట్ ను చేపడుతామన్నారు.
కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్‌ళో వారికి అపాయిట్మెంట్ లెటర్లను అందజేస్తారని వెల్లడించారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోందని, ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ సిబ్బంది పెండింగ్ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.
బస్ భవన్‌లో ప్రతి రోజూ జాతీయ గీతాలాపన
ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ప్రతి పౌరుడు దేశ పురోభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శుభదినాన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహానీయుడిని స్మరించుకోవాలన్నారు. దేశానికే గర్వకారణమైన జనగణమన జాతీయ గీత ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు వివరించడంతో పాటు నేటి తరంలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు బస్ భవన్ లో జాతీయ గీతాలాపన చేస్తున్నామని చెప్పారు.
దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ మహోత్తర కార్యక్రమాన్ని జోన్, ఆర్ఎం కార్యాలయాలతో పాటు డిపోలకు విస్తరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. అనంతరం ఈ గణంతంత్ర వేడుకల్లో విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగ అధికారులకు మెడల్స్‌తో సజ్జనార్ సత్కరించారు. సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాల్లో అత్యధిక యూనిట్లు సేకరించిన హకీంపేట, చెంగిచర్ల, కంటోన్మెంట్ డిపో మేనేజర్లను ప్రశంసా పత్రాలతో సన్మానించారు.