Temple to Samantha
విధాత: కోలీవుడ్‌లో హీరోయిన్లకి గుడి కట్టడం అనేది మాములే. అది ఇప్పటిది కాదు.. ఎప్పటి నుండో ఉంది. మహానటి సావిత్రి, ఖుష్భూ, నమిత, హన్సిక వంటి వారికి తమిళ తంబీలు గుడి కట్టినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్య అంత అభిమానం అయితే తంబీలు కూడా చూపించడం లేదు.
మరి వారికి బొద్దు గుమ్మలు తగలడం లేదో? లేదా వారు గుడి కట్టించే రేంజ్ ఇప్పుడున్న వారికి లేదో తెలియదు కానీ.. కొన్నాళ్లుగా ఈ గుడి వార్తలు అయితే రాలేదు. ఇప్పుడు టాలీవుడ్‌లో సమంతకు గుడి అంటూ ఒక్కసారిగా ఓ వార్త వైరల్ అయింది.
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చుండూరు మండలంలోని ఆలపాడు గ్రామంలో తెనాలి సందీప్ అనే సమంత (Samantha) అభిమాని.. ఆమెకు గుడి కట్టిస్తున్నాడు. అయితే ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి.. ఈ సందీప్ అనే వాడిని అంతా వెర్రోడిలా చూస్తున్నారు.
సమంత ఏమైనా మాంచి ఫిగరా? ఆల్రెడీ విడాకులు తీసుకుని పరువు పోగొట్టుకుంది. ఒకవైపు వ్యాధి అంటూనే మరోవైపు విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్ చేస్తుంది. బోల్డ్ సీన్స్‌లో చేస్తుంది. మరి అలాంటి హీరోయిన్ దగ్గర ఏముందని ఆమెకు గుడి కట్టిస్తున్నావ్? అంటూ సందీప్‌పై డైరెక్ట్‌గానే పంచ్‌లు విసురుతున్నారు.
అయితే సందీప్ ఏం చెబుతున్నాడంటే.. సమంత అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమెకు వీరాభిమానిని. హీరోయిన్‌గానే కాకుండా.. ఎంతో మంది చిన్నారులకు ఆమె తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు చేయించింది. ఇంకా ఎందరో వృద్ధులకు ఆశ్రమం కల్పిస్తోంది. ఇంతకంటే ఏం కావాలి.. తనని అభిమానించడానికి, ఇష్టపడడానికి. అందుకే ఆమె కోసం గుడి కట్టిస్తున్నానని చెబుతున్నాడు.
ప్రస్తుతం సమంతకు సందీప్ నిర్మిస్తోన్న గుడి చివరిదశలో ఉంది. ఈ నెల 28న ఈ గుడిని ప్రారంభించాలని సందీప్ ప్రయత్నాలు చేస్తున్నారు. సమంత(Samantha) గుడికి సంబంధించిన వార్త ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఆమెకు గుడి ఏంటని సందీప్‌ని కొందరు పిచ్చోడిలా చూస్తుంటే.. మరికొందరు మాత్రం మేమూ ఈ గుడి నిర్మాణంలో భాగమవుతామంటూ, మాకు కూడా సమంత అంటే ఇష్టమంటూ సందీప్ అడ్రస్ కనుక్కునే పనిలో ఉన్నారట. అది విషయం.