Sanjay Raut
విధాత: ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 15-20 రోజుల్లో కుప్పకూలడం ఖాయమని శివసేన (ఉద్ధవ్ ఠాక్రె వర్గం) నేత సంజయ్ రౌత్(Sanjay Raut) చెప్పారు. కోర్టు తీర్పు కోసం తాము ఎదురు చూస్తున్నామని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉన్నదని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉన్నది. ‘ఇప్పడున్న ముఖ్యమంత్రి, ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15-20 రోజుల్లో కుప్పకూలడం ఖాయం. మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారెంట్ రాబోతున్నది. దానిపై ఎవరు సంతకం సంతకం చేస్తారన్నదే నిర్ణయం కావాల్సి ఉన్నది’ అని రౌత్ (Sanjay Raut) చెప్పారు.
గత ఏడాది జూన్‌లో షిండే, 39మంది ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేయడంతో ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఈ కూటమిలో ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా ఉన్నాయి.
అనంతరం బీజేపీతో చేతులు కలిపిన షిండే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. గత ఏడాది జూన్ 30న ఆయన సీఎంగా, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 16 మంది అనర్హత కేసులో తీర్పును సుప్రీం కోర్టు గత నెలలో రిజర్వ్ చేసింది.