Sankranthiki Vasthunnam OTT: ఓటీటీకీ వచ్చేసిన.. ‘సంక్రాంతికి వస్తున్నాం’! ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

విధాత: విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనీల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ముచ్చటగా మూడవ సినిమాగా రూపొంది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సొంతం చేసుకున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankranthiki Vasthunnam). దిల్ రాజు (Dil Raju), శిరీష్ ఈ మూవీని నిర్మించగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary), ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి రెండు పెద్ద చిత్రాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధఙంచి విక్టరీ వెంకటశ్ కెరీర్లోనే మరుపురాని చిత్రంగా నిలిచింది.
కథ విషయానికి వస్తే.. పెద్ద పారిశ్రామికవేత్తగా బయటి దేశాల్లో పేరు సంపాదించి టాప్ ప్లేస్లో ఉన్న తెలుగు వాడు సత్య ఆకెళ్లను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ సీఎం కేశవ ఇక్కడికి తీసుకు వస్తాడు. అయితే సత్యను పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. దీంతో విషయం బయట పడితే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని ప్రజలకు తెలిసేలోగా అతన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆ బాధ్యతను ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుని ఆపై డిపార్ట్మెంట్పై కోపంతో ఉద్యోగం వదిలేసి ఓ పల్లెటూరులో భార్య పిల్లలతో కలిసి ఉంటున్న యాదగిరికి అప్పగించాలని చూస్తారు. అందుకోసం యాదగిరిని ఎలా అయినా తీసుకు రావాలని మరో పోలీస్ అధికారి ఒకప్పటి యాదగిరి ప్రేయసి మీనాక్షికి బాధ్యత అప్పజెబ్బుతారు.
దీంతో యాదగిరిని తీసుకు రావడానికి ఊరెల్లిన మీనాక్షికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది. యాదగిరి భాగ్యం పెట్టిన తిరకాసు ఏంటి చివరకు సత్య ఆకెళ్లను పట్టుకున్నారా, అటు పెళ్లాం, ఇటు మాజీ ప్రేయసిల మధ్య యాదగిరి ఎలా నలిగిపోయాడనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా ఆద్యంతం హుషారుగా సాగుతుంది. ఫస్ట్ ఫ్రేం నుంచి చివరి ఫ్రేం వరకు అద్యంత నవ్వులు పూయిస్తుంది. ఇదిలాఉండగా సినిమా విడుదలైన 45 రోజుల తర్వాత ఇప్పుడీ సినిమా జీ5 (Zee 5) ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేయగా అంతకన్నా ముందే వరల్డ్ డిజిటల్ ప్రీమియర్గా జీ తెలుగు (Zee Telugu) శాటిలైట్ ఛానల్లో సైతం టెలికాస్ట్ చేయడం గమనార్హం. ఈ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankranthiki Vasthunnam) సినిమా మంచి కాలక్షేపం.
అయితే సినిమా నిడివి విషయంలో ఓటీటీ ప్రేక్షకుల నుంచి తీత్ర విమర్శలు వస్తున్నాయి. మాములుగా థియేటర్లలో 2 గంటల 24 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన ఈ మూవీకి మరి కొన్ని కామెడీ సీన్లను జత చేసి ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని బాగా ప్రచారం జరిగింది. తీరా ఓటీటీకి వచ్చాక అసలు 2 గంటల 24 నిమిషాల నిడివిలోనూ 6నిమిషాలు కోత విధించి 2 గంటల 18 నిమిషాల సినిమానే విడుదల చేయడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఈ అంశంపై మేకర్స్ ఎలా స్పందిస్తారో.