మరో డిపాజిట్‌ పథకాన్ని తీసుకువచ్చిన ఎస్‌బీఐ..!

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐకి మరో కొత్త డిపాజిట్‌ పథకాన్ని తీసుకువచ్చింది

  • Publish Date - January 18, 2024 / 04:40 AM IST

SBI Deposit Scheme | ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐకి మరో కొత్త డిపాజిట్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ఇప్పటికే బ్యాంకు తీసుకువచ్చిన డిపాజిట్‌ పథకాలు విజయవంతమయ్యాయి. ఈ క్రమంలో ప్రత్యేకంగా గ్రీన్‌ రూపీ టర్మ్‌ డిపాజిట్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సొత్తును పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో తిరిగి పెట్టుబడి పెట్టనున్నది. దేశంలో గ్రీన్ ఫైనాన్స్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ స్కీమ్‌ను తీసుకువచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.


ఈ పథకంలో భారతదేశ పౌరులతో పాటు ఎన్నారైలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. జీఆర్‌టీడీ పెట్టుబడిదారులకు మూడు టర్మ్‌లను ఎంచుకునేందుకు వీలు కల్పించింది. ఇందులో 1,111 రోజులు.. 1,777 రోజులు.. 2,222 రోజుల టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకం బ్రాంచ్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే యోనోతో పాటు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

ఏంటీ గ్రీన్‌ డిపాజిట్‌ పథకం..?


గ్రీన్ డిపాజిట్‌ పథకం అనేది పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల్లో మిగులు నగదు నిల్వలను పెట్టుబడిగా పెట్టాలనుకునే వ్యక్తులకు స్థిరకాల డిపాజిట్ పథకం ఇది. ఇందులో పెట్టడం ద్వారా 2070 నాటికి దేశాన్ని నికర కార్బన్ జీరోగా మార్చాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకుసాగుతుంది. గ్రీన్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం సాధారణ టర్మ్ డిపాజిట్‌ల మాదిరిగానే పనిచేస్తుంది. పెట్టుబడిదారులు ముందుగా ఎంచుకున్న ప్లాన్‌ ప్రాకంర స్థిరమైన వడ్డీ రేటు అందుతుంది. అయితే, గ్రీన్ డిపాజిట్ల కింద సేకరించిన నిధుల వినియోగంలో కొన్ని బేధాలుంటాయి. సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్ల తరహాలో కాకుండా.. ఇందులో పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపే ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఉంటుంది.


గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా నిధులు సమకూర్చే ప్రాజెక్ట్‌ల పరిధి చాలా విస్తారంగా ఉన్నది. సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లు, విండ్ ఫామ్‌లకు ఫైనాన్సింగ్ చేయడం నుంచి సేంద్రీయ వ్యవసాయం, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతు ఇచ్చేందుకు అనేక రంగాల్లోకి పెట్టుబడుల పరిధిని విస్తరిస్తున్నది. అయితే, గ్రీన్ డిపాజిట్ల వెనుక ఉద్దేశం మంచిదే అయినా.. పథకంలో పెట్టుబడి పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర పథకాల తరహాలోనే గ్రీన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రిస్క్‌ ఉంటుందని చెబుతున్నారు.