AICCలోకి సీనియర్లు! రేవంత్‌కు లైన్ క్లియర్ అయినట్టేనా?
టీకాంగ్రెస్ నుంచి బైపాస్ చేసేందుకేనా ! రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో తరచూ అసమ్మతి రాగాలతో టీ పీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డికి తలనొప్పులు సృష్టిస్తున్న సీనియర్లను ఏఐసీసీ (AICC) సభ్యులుగా నియమించడం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక ట్విస్టేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విధాత: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఈ నెల 24 నుండి 26 వరకు జరిగే ఏఐసీసీ 85వ ప్లీనరీ (AICC 85th Plenary)లో పాల్గొనేందుకు తెలంగాణ నుండి 33మందిని ఏఐసీసీ సభ్యులుగా […]

టీకాంగ్రెస్ నుంచి బైపాస్ చేసేందుకేనా !
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో తరచూ అసమ్మతి రాగాలతో టీ పీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డికి తలనొప్పులు సృష్టిస్తున్న సీనియర్లను ఏఐసీసీ (AICC) సభ్యులుగా నియమించడం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక ట్విస్టేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
విధాత: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఈ నెల 24 నుండి 26 వరకు జరిగే ఏఐసీసీ 85వ ప్లీనరీ (AICC 85th Plenary)లో పాల్గొనేందుకు తెలంగాణ నుండి 33మందిని ఏఐసీసీ సభ్యులుగా ఎంపిక చేశారు. మరో 14 మందిని కోఆప్ట్ సభ్యులుగా తీసుకొని మొత్తం 47 మందికి ప్లీనరీలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, గీతారెడ్డి, కోదండరెడ్డి, మల్లు రవి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య, సీతక్క, సునీతా రావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, వీ హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, బలరాం నాయక్, చిన్నారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అజారుద్దీన్, వంశీ చందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సంపత్ కుమార్ తదితర సీనియర్ నేతలు 47 మంది ఏఐసీసీ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. నల్లగొండ జిల్లా నుంచి పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు కే జానారెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి ఏఐసీసీ సభ్యులుగా నియమితులయ్యారు.
సగౌరవంగా సీనియర్లను తప్పించారా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా పార్టీని తనదైన శైలిలో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పీడ్ కు సీనియర్లు తరచూ అసమ్మతి స్వరంతో మోకాలడ్డుతుండటం పార్టీకి, రేవంత్‌కు సంకటంగా తయారైంది. ఇటీవల రేవంత్ వేసిన పీసీసీ కమిటీల పట్ల వారంతా బాహాటంగానే తమ వ్యతిరేకత వెల్లడించారు.‘రేవంత్ హఠావో.. కాంగ్రెస్ బచావో’ అంటూ తిరుగుబాటు లేవదీశారు.
సీనియర్ల రచ్చ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ (AICC in charge of Telangana) మార్పునకు దారి తీసింది. బుజ్జగింపుల పర్వంతో టీ కప్పులో తుఫాన్ మాదిరిగా సద్దుమణిగినప్పటికీ సీనియర్లు ఎప్పుడేం మాట్లాడుతారో అన్న ఆందోళన మాత్రం అలానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో సీనియర్ల పాత్రను వారిని పార్టీ పటిష్టత కోసం పనిచేసేలా అధిష్టానానికి దగ్గరగా ఉండేలా వారిని ఏఐసీసీ కమిటీలోకి తీసుకున్నారు.
ఎందుకంటే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలంటే రేవంత్ లాంటి నేతలకు మరింత స్వేచ్ఛను ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. దాన్ని ఓట్ల రూపంలో మలచుకోవాలి అంటే రాష్ట్ర నాయకత్వంలో ఉన్న అసమ్మతికి చెక్ పెట్టి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలనే పార్టీ కోసం కష్టపడుతున్న నేతలను ప్రోత్సహించాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. అందుకే రాష్ర్టంలో ని సీనియర్ల గౌరవం ఇస్తూనే.. రేవంత్‌కు ప్రాధాన్యం పెంచుతున్నది. ఇదంతా అధిష్టానం వ్యూహంలో భాగమే అనే అభిప్రాయం వ్యక్తవుతోంది.
రేవంత్ యాత్రపై గంపెడాశలు
రేవంత్ చేపట్టిన పాదయాత్రకు జనం నుంచి వస్తున్న స్పందన బాగుండటంతో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలపై కాంగ్రెస్ (Congress)వర్గాలు గంపెడాశను పెట్టుకున్నాయి. ఈ తరుణంలోనే సీనియర్లను ప్రమోట్ చేయడం ద్వారా వారి అడ్డును రేవంత్ తొలగించుకున్నారన్న చర్చ జరుగుతున్నది. అటు పాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్లతో పాటు తామంతా ఒక్కటిగానే ఉన్నామని రేవంత్ ప్రకటించడం గమనార్హం.
మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డిలను ఏఐసీసీకి ఎంపిక చేయడం ద్వారా సూర్యాపేట, నల్లగొండ నియోజకవర్గాల్లో వారికి ప్రత్యామ్నాయంగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డిలకు భవిష్యత్తు అవకాశాలపై రేవంత్ కొంత వెసులుబాటు కల్పించినట్లు అయిందన్న చర్చ జరుగుతున్నది.