ప్రజా స్పందన ఓర్వలేకనే బీఆరెస్ కుట్రలు: షబ్బీర్ అలీ

ప్రజా స్పందన చూసి ఓర్వలేక.. బీఆర్ఎస్ నేతలు 420 బుక్ లెట్ పేరుతో కాంగ్రెస్ ను బద్నాం చేసే కుట్రలు పన్నుతున్నారుని షబ్బీర్ అలీ అన్నారు

  • Publish Date - January 5, 2024 / 09:20 AM IST

విధాత, నిజామాబాద్: ‘ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన వస్తోంది. ప్రజా స్పందన చూసి ఓర్వలేక.. బీఆర్ఎస్ నేతలు 420 బుక్ లెట్ పేరుతో కాంగ్రెస్ ను బద్నాం చేసే కుట్రలు పన్నుతున్నారు’ అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలో పలు కాలనీల్లో ప్రజా పాలన దరఖాస్తుల పనితీరును పరిశీలించారు. దరఖాస్తు కేంద్రాల్లో అధికారులు చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చిందో ప్రజలకు చెప్పాలని నిలదీశారు.


గ‌త 10 ఏళ్లలో 100కు పైగా హామీలను నెరవేర్చకుండా, బుద్ది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించిన ఆయన, గడువులోపు అమలు చేయకపోతే అప్పడు అడగండి అంటూ బీఆరెస్ కు హితవుపలికారు. రాష్ట్రంలో గడీలపాలన అంతమైంది.. ప్రజా పాలన కొనసాగుతున్నదన్నారు. అధికారం కోల్పోయామని దొరలకు నిద్రపట్టడం లేదు.. ఆ ప్రస్టేషన్ లో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని బీఆరెస్ ను విమర్శించారు.