ఇండియా కూటమికి ప్రధాని లేరా..? 1977 నాటి ఉదాహరణ ఇచ్చిన శరద్ పవార్
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విపక్షాలు ఏకమైన సంగతి తెలిసిందే

న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విపక్షాలు ఏకమైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిగా ఏర్పడ్డ విపక్ష పార్టీలు.. మోదీపై పోరాటానికి దిగాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు.
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే పేరును టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రపోజ్ చేసిన విషయం విదితమే. అయితే ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు.
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను నిన్న పుణెలో విలేకరులు ప్రశ్నించారు. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి లేరా? అని ప్రశ్నించగా, శరద్ పవార్ ఇలా సమాధానం ఇచ్చారు. 1977 లోక్‌సభ ఎన్నికలను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీని ఓడగొట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
1977 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి పేరు ప్రతిపాదించకుండానే జనతా పార్టీ ఎన్నికల బరిలో దిగింది. ఎవరూ ఊహించని విధంగా జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని, మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారని తెలిపారు. మొరార్జీ దేశాయ్ ప్రధాని క్యాండిడేట్ అని ఎన్నికల ముందు ఎక్కడా కూడా ప్రచారం చేయలేదని పవార్ గుర్తు చేశారు. ప్రజల మూడ్ చేంజ్ అయితే.. వారే కొత్త వారికి అధికారం ఇస్తారని శరద్ పవార్ పేర్కొన్నారు.
1977లో ఏం జరిగిందంటే..?
1971 ఎన్నికల సమయంలో ఇందిరా గాంధీ గరీబీ హఠావో(పేదరికం తొలగించడం) నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ నినాదం ప్రజల్లోకి వెళ్లడంతో.. కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ తర్వాత 1977 వరకు ఇందిరా ప్రధానిగా కొనసాగారు. 1977 ఎన్నికలప్పుడు ఇందిరాగాంధీని ఓడగొట్టేందుకు ప్రతిపక్షాలు ఒకేతాటిపైకి వచ్చాయి. ఇందిరా హఠావో అనే నినాదాన్ని ఎత్తుకున్నాయి.
ఇక ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కొంది. అధిక ద్రవ్యోల్బణం ఏర్పడటం, కొన్ని ప్రాంతాల్లో కరువు కరాళ నృత్యం చేయడం, చమురు సంక్షోభం సంభవించాయి. బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇందిరాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ ఆమె ఓటమికి కారణమయ్యాయి. మొత్తంగా 1977లో జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది.