పాలేరు: షర్మిలపై BRS వదిలే బాణం తుమ్మల?
విధాత: ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలలో ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు జనరల్ స్థానాలు. వీటిలో పాలేరు నియోజకవర్గానికి ఎక్కువగా పోటీ ఉన్నది. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని బీఆర్‌ఎస్ దక్కించుకున్నది. నిజానికి ఆ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది. అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో […]

విధాత: ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలలో ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు జనరల్ స్థానాలు. వీటిలో పాలేరు నియోజకవర్గానికి ఎక్కువగా పోటీ ఉన్నది. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని బీఆర్‌ఎస్ దక్కించుకున్నది. నిజానికి ఆ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది. అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో అక్కడ ఈ నాలుగేళ్ల కాలంలో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి.
ఇదిలాఉండగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో రాష్ట్రమంతటా ఆ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొన్నది. పైగా ఈ మధ్య ఖమ్మం జిల్లాలో ముఖ్య నాయకుల స్వరం మారుతున్నది. పొంగులేటితో పాటు తుమ్మలకు కూడా బీఆర్‌ఎస్‌లో సరైన ప్రాధాన్యం దక్కలేదనేది బహిరంగ రహస్యం. ఇటీవల టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి వెళ్లగా తుమ్మల నాగేశ్వరరావును గెలిపించే బాధ్యత తమదేనని వాళ్లు ప్రకటించారు. అంతేగాక తుమ్మల కేసీఆర్‌తో ఉన్న దశాబ్దాల అనుబంధం దృష్ట్యా ఆయనపై విమర్శలు చేయకుండా మంత్రి అజయ్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల వివిధ వేదికలపై బీఆర్‌ఎస్ పై విమర్శలు చేస్తూ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఇన్ని పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ దిద్దుబాటు చర్యలు వేగంగా చేపట్టారు. ఖమ్మం పార్లమెంటు స్థానంతో పాటు పది అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సీట్లు బీఆర్‌ఎస్ ఖాతాలో వేయడానికి కేసీఆర్ ఇప్పటికే వ్యూహ రచన చేశారు. ఈ నెల 18న అక్కడే బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నది. దీంతో ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఈ క్రమంలో మొన్న బీఆర్‌ఎస్ ఆవిర్బావ సభ ఏర్పాట్లపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం జరిపిన సమీక్షలో తుమ్మల పాల్గొనడం కొత్త చర్చలకు దారి తీసింది. సిట్టింగులకు తిరిగి సీట్లు ఇస్తామని సీఎం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ సీటు ఆశిస్తున్న ఆయనకు కేసీఆర్ నుంచి హామీ ఎమైనా లభించిందా? అనే చర్చ జరుగుతున్నది.
కానీ ఖమ్మం జిల్లాలో టీడీపీ , వైఎస్‌ఆర్‌టీపీ, కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే తుమ్మల లాంటి సీనియర్ నేత అయితేనే బాగుంటుందనే అబిప్రాయం పార్టీ అధినేతకు కలిగి ఉండొచ్చు. ఎందుకంటే కమ్యూనిస్టు ప్రాబల్యం కూడా ఉంటుంది. ఇటు టీడీపీ, అటు కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలతో తుమ్మలకు సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అవకాశం. ఆ స్థానంలో షర్మిలపై తుమ్మలను బరిలోకి దించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరు కూడా ఆ స్థానం నుంచి వినిపించినా తుమ్మలకు ఉండే సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
గత ఉప ఎన్నిక సమయంలో అక్కడ తుమ్మల గెలుపు బాధ్యతను మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కూడా తుమ్మలకే జై కొడితే ఇక అక్కడ ఆయన పోటీ ఖాయమవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డిపై ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ, ఈ సారి అవకాశం దక్కకపోతే వేరే విధంగా ఆయనకు బీఆర్‌ఎస్ అధినేత హామీ ఇస్తే దానికి ఆయన అంగీకరిస్తే తుమ్మలకు మార్గం సుగమం అవుతుంది. అప్పుడు షర్మిల వర్సెస్ తుమ్మల పోటీ అవుతుంది. అక్కడ టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే ఆయనను గెలిపించుకుంటామన్నారు. కమ్యూనిస్టులతో కేసీఆర్ అవగాహనకు వస్తే వాళ్ల ఓటు బ్యాంకు కూడా బీఆర్ఎస్‌కు పడుతుంది. వీళ్లందరినీ సమన్వయం తుమ్మల చేసుకుంటారని అంటున్నారు. ఈ నెల 18 తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాలపై మరింత స్పష్టత రానున్నది.