న్యూఢిల్లీ : యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో కాళ్లు కోల్పోయిన సీఆర్పీఎఫ్ ఆఫీసర్ బిభోర్ కుమార్ సింగ్‌కు అరుదైన గౌరవం లభించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆ ఆఫీసర్‌కు శౌర్య చక్ర అవార్డును ప్రకటించింది.
బిభోర్ కుమార్ సింగ్ 2017లో సీఆర్పీఎఫ్‌లో చేరారు. 205 కోబ్రా బెటాలియన్‌లో అసిస్టెంట్ కమాండంట్ ర్యాంక్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బీహార్‌లో 2022, ఫిబ్రవరి 25వ తేదీన యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. గయా, ఔరంగాబాద్ జిల్లాల సరిహద్దుల్లోని చంక్రబంధ ఫారెస్ట్ ఏరియాలో ఆపరేషన్ కొనసాగుతుండగా, ఐఈడీ పేలింది. దీంతో కుమార్ సింగ్ తీవ్ర గాయాలపాలై తన రెండు కాళ్లను కోల్పోయారు. మొదట గయా జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించి, అక్కడ్నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం కుమార్ సింగ్‌కు రెండు కాళ్లు లేవు. వీల్ చైర్ సహాయంతోనే ఆ అధికారి తన విధులు నిర్వర్తిస్తున్నారు.
యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో కాళ్లు కోల్పోయిన బిభోర్ కుమార్ సింగ్‌కు శౌర్య చక్ర అవార్డును ప్రదానం చేయడంలో జరిగిన జాప్యంపై మాజీ పారామిలటరీ బలగాల సంఘం, విశ్రాంత కేంద్ర పారామిలటరీ బలగాల సంఘం విచారం వ్యక్తం చేసింది. ఇక యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో తన వ్యక్తిగత భద్రతను లెక్క చేయకుండా కీలకంగా వ్యవహరించారు. నక్సల్స్‌ను ఏరివేయాలని తన బృందంతో ముందుకు కదిలిన బిభోర్ కుమార్ సింగ్‌ను ఐఈడీ దెబ్బకొట్టింది. ఐఈడీ పేలడంతో ఆయన రెండు కాళ్లను కోల్పోయారు.