Shraddha Walkar | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో మరో విషయం వెలుగు చూసింది. ఆఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా గొంతు కోసి చంపేసి, శరీర భాగాలను 35 ముక్కలుగా చేసి ఢిల్లీ సమీప అడవుల్లో విసిరేసిన సంగతి తెలిసిందే. అయితే 2020లోనే శ్రద్ధాను చంపేందుకు ఆఫ్తాబ్ ప్రయత్నించినట్లు ఆమె గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తాజాగా వెలుగు చూసింది.
2020, నవంబర్ 23వ తేదీన మహారాష్ట్రలోని వసాయ్ పోలీసులకు శ్రద్ధా ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే.. ఇవాళ నాకు ఊపిరాడకుండా చేసి చంపేందుకు ఆఫ్తాబ్ యత్నించాడు. చంపేస్తానని భయపెట్టిస్తున్నాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి విసిరేస్తానని బెదిరిస్తున్నాడు. అతను నన్ను కొట్టి ఆరు నెలలైంది. కానీ నాకు ఫిర్యాదు చేసే ధైర్యం లేదు. ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నట్లు ఆమె ఫిర్యాదు పేర్కొంది.
ఆఫ్తాబ్ ప్రవర్తన గురించి కూడా శ్రద్ధా అతని తల్లిదండ్రులకు తెలిపింది. అతని ప్రవర్తన పేరెంట్స్‌కు ముందే తెలుసు. అయితే వారి వివాహానికి శ్రద్ధా తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినప్పటికీ, ఆఫ్తాబ్ పేరెంట్స్ అంగీకరించారు అని చెప్పిన ఆమె.. అతనితో కలిసి జీవించేందుకు ఇష్టం లేదని శ్రద్ధా చెప్పింది. అయినా కూడా రెండేండ్ల పాటు అతనితో కలిసి జీవించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసాయ్ పోలీసులకు చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.
అయితే శ్రద్ధా కొన్నాళ్లకే మరో లేఖ పోలీసులకు రాసినట్లు తెలుస్తోంది. ఆఫ్తాబ్ తల్లిదండ్రులతో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని లేఖలో కోరినట్లు స్థానిక పోలీసులు తెలిపినట్లు తెలుస్తోంది. మొత్తానికి శ్రద్ధా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది.