kaleshwaram | Shri Ram Sagar Project
విధాత, నిజామాబాద్ ప్రతినిధి: వట్టి పోయిన వర ప్రదాయినిలో గోదావరి నీరు చేరుతుంటే అన్నదాతలు కొండంత అండగా భావిస్తున్నారు. కలలో కూడా ఊహించని అద్బుతం ఆవిష్కృతం అవటంతో ఆ అపురూప దృశ్యాన్ని కళ్ళారా చూసేందుకు రైతులు, ప్రజలు బారులు తీరుతున్నారు… ఇక రెండు పంటలకు కావాల్సిన సాగునీరు అందుబాటులోకి వచ్చిందని పిల్లా పాపలతో కలిసి వచ్చి పండగ జరుపుకుంటున్నారు.
వరద కాలువ ద్వారా ఎదురెక్కి వచ్చిన కాళేశ్వరం జలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కలిసే ముప్కాల్ పంపు హౌజ్ వద్ద ఈ సన్నివేశాలు దర్శన మిస్తున్నాయి. రైతుల సాగు నీటి స్వప్నం నెరవేరింది. కాలం లేకున్నా సాగుకు డోకా ఉండకూడన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పిని నింపే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.
సముద్రంలో వృధాగా కలుస్తున్న నదీ జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా ఎదురెక్కించి వరద కాలువను సజీవ జలధారగా మార్చాలన్న ముఖ్యమంత్రి జల ఆశయం నెరవేరింది. తద్వారా తెలంగాణ వర ప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ జలాశయానికి ఊపిరిచ్చింది. కాళేశ్వర గంగ ఉప్పొంగి శ్రీరాంసాగర్ ను ముద్దాడింది.
నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండలం శ్రీరాంసాగర్ వద్ద ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. స్విచ్చాన్ చేసి నాలుగు మోటర్ల ద్వారా కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్సీలోకి వదిలారు. ఎస్సారెస్సీలోకి జలాలు పరుగులు తీస్తుండగా ప్రత్యేక పూజలు చేశారు.
వరద కాలువ ద్వారా కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు వచ్చి ఎస్సారెస్పీ కి చేరుతున్న యని తెలుసుకున్న రైతులు ముప్కాల్ పంపు హౌజ్ కు బారులు తీరుతున్నారు. ఎత్తి పోతలు ప్రారంభం అయిన నాటి నుండి నిజామాబాద్ జిల్లాతో పాటు అదిలాబాద్, నిర్మల్, ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల రైతాంగానికి లబ్ధి
చేకూరనుంది. దీంతో ఆయా జిల్లాల నుండి రైతులు తరలి వస్తున్నారు. ఈ అద్భుత ఆవిష్కరణను కళ్ళారా చూసి కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతున్నారు. స్థానిక మండలాలైన కమ్మార్ పల్లి, మోర్తాడ్, వేల్పూరు , బాల్కొండ, మేండోర మండలాల రైతుల ఆనందానికి అయితే హద్దులు లేకుండా పోయాయి.
వరదకాలువ ద్వారా ప్రయోజనం లేదంటు ఇన్నాళ్లుగా యావత్తు రైతాంగంలో నిరాశ నెలకొన్న తరుణంలో స్వరాష్ట్రం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కు శ్రీకారం చుట్టాడు. అందులో భాగంగానే కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే కార్యక్రమానికి ప్రణాళికలు రచించారు. వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపేందుకు స్వయంగా ప్రణాళిక రచించారు. ఆ మేరకు శ్రీరాంసాగర్ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. 1,999.56 కోట్లతో చేపట్టిన ఈ పునర్జీవ పథకానికి 2017 ఆగస్టు 10న ముప్కాల్ వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కాళేశ్వర జలాలను ఎస్సారెస్సీ పాదాల వద్దకు తెచ్చి లక్షలాది ఎకరాలకు కచ్చితంగా నీళ్లను ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి సభలో చెబితే.. ప్రతిపక్షాలు మాత్రం ఇది సాధ్యమయ్యేది కాదంటూ విమర్శలు చేశాయి.
కానీ కేసిఆర్ మాత్రం వాటిని లెక్క చేయకుండా నిర్దేశిత లక్ష్యం వరకు పనులు పరుగులు పెట్టించి, తాను చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించడమే కాదు ప్రజల కండ్లముందు ఆవిష్కరింపజేశారు. సహజంగా ప్రాజెక్టులో నీళ్లుంటేనే కాలువ దిగువకు పారుతుంది కానీ, వరద కాలువలో నీళ్లు ఎదురెక్కి జలాశయాన్ని నింపుతున్నాయి. అంతేకాదు, రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని పోవాల్సిన కాలువే.. నేడు 122 కిలో మీటర్ల పొడవునా రిజర్వాయర్లుగా మారి కళ్ల ముందు సాక్షాత్కరించింది.
దిగువకు నీళ్లు ఇవ్వాల్సిన కాలువే.. ఎగువన ఉన్న ప్రాజెక్టుకు నీళ్లు మోసుకెళ్తూ భరోసాను ఇస్తున్నది. ఈ మాటలు వినడానికి ఆశ్చర్యంగా కనిపిస్తున్నా.. అక్షర సత్యం సీఎం స్వయంగా ప్లానింగ్ చేసిన శ్రీరాంసాగర్ పునర్జీవ పథకంతో 122 కిలోమీటర్ల మేర కాళేశ్వరం జలాలతో నిండు కుండలా మారిన వరద కాలువే దీనికి సజీవ సాక్ష్యం.
ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్య మంత్రి కేసీఆర్ దార్శనికతతో వరదకాలువ తన స్వరూపాన్ని మార్చుకొన్నది. కాలం ఉన్నా.. లేకున్నా.. వరద వచ్చినా రాకున్నా.. కాళేశ్వరం జలాలతో భవిష్యత్తు అంతా కళకళ లాడడమే కాదు. లక్షల ఎకరాల పంటచేలను పునరుజ్జీవింప చేయనున్నదనీ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.