భార్యాపిల్ల‌ల‌ను తుపాకీతో కాల్చి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న క‌లెక్ట‌ర్ గ‌న్‌మెన్

చిన్న‌కోడూరు మండ‌లం రామునిప‌ట్ల‌లో విషాదం నెల‌కొంది. సిద్దిపేట క‌లెక్ట‌ర్ గ‌న్‌మెన్ ఆకుల న‌రేశ్ త‌న భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తుపాకీతో కాల్చిచంపాడు.

భార్యాపిల్ల‌ల‌ను తుపాకీతో కాల్చి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న క‌లెక్ట‌ర్ గ‌న్‌మెన్

సిద్దిపేట : చిన్న‌కోడూరు మండ‌లం రామునిప‌ట్ల‌లో విషాదం నెల‌కొంది. సిద్దిపేట క‌లెక్ట‌ర్ గ‌న్‌మెన్ ఆకుల న‌రేశ్ త‌న భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తుపాకీతో కాల్చిచంపాడు. అనంత‌రం అదే గ‌న్‌తో న‌రేశ్ కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


ఘ‌ట‌నాస్థ‌లాన్ని సీపీ శ్వేత ప‌రిశీలించారు. ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌పై చిన్న‌కోడూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న న‌రేశ్ కుటుంబాన్ని చూసి అత‌ని కుటుంబ స‌భ్యులు, బంధువులు బోరున విల‌పించారు. మృతుల‌ను ఆకుల న‌రేశ్‌(35) ఏఆర్ కానిస్టేబుల్‌, భార్య చైత‌న్య‌(30), కుమారుడు రేవంత్(6), కూతురు రిషిత‌(5)గా గుర్తించారు. రేవంత్ ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దువుతుండ‌గా, రిషిత యూకేజీ చ‌దువుతోంది.


ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వ‌ల్ల న‌రేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన‌ట్లు స‌మాచారం. అప్పుల విష‌యంలో శుక్ర‌వారం ఉద‌యం భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. గొడ‌వ తీవ్ర‌రూపం దాల్చ‌డంతో న‌రేశ్ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. పాఠ‌శాల‌కు వెళ్లిన పిల్ల‌ల‌ను ఇంటికి తీసుకొచ్చి త‌న వ‌ద్ద ఉన్న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చిచంపాడు. అనంత‌రం భార్య‌ను చంపి, తాను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఘ‌ట‌నాస్థ‌లిలో క్లూస్ టీమ్ ఆధారాలు సేక‌రిస్తోంది.