విధాత: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్న 32 ఫామ్ హౌజ్‌లపై ఏకకాలంలో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే నాలుగు ఫామ్ హౌజ్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
శివార్లలో ఉన్న ఫామ్ హౌజ్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అందిన సమాచారంతో సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ఎస్‌వోటీ డీసీపీ రషీద్ పర్యవేక్షణలో సైబరాబాద్ పోలీసులు ఆది, సోమవారాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
మొయినాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని బిగ్‌బాస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ, శంషాబాద్ పీఎస్ పరిధిలోని రిపుల్జ్, మేడ్చల్ పీఎస్ పరిధిలోని గోవర్ధన్ రెడ్డి ఫామ్ హౌజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
రిఫుల్జ్ ఫామ్ హౌజ్‌లో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. గోవర్ధన్ రెడ్డి ఫామ్ హౌజ్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నాలుగింట్లో మొత్తం 25 మంది అరెస్టు అయ్యారు. వీరి నుంచి రూ. 1,03,030ల నగదు, ఏడు సెల్‌ఫోన్లు, 10 హుక్కా పాకెట్స్‌తో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.