Visakha Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగులో ‘సింగరేణి’

ప్లాంట్ సందర్శనలో సింగరేణి అధికారులు విధాత‌: మొన్నటి నుంచీ అనుకున్నదే.. విశాఖ ఉక్కును (Visakha Steel Plant) అమ్మేయాలని, లేదా ప్రయివేటీకరిం చాలని కేంద్రం భావిస్తుండగా దాన్ని తాము కొనుగోలు చేసి ఆపరేట్ చేస్తాం అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సంస్థనుంచి లాభాలు తీసుకోవడం కోసమో, ఆంధ్రలోని ఓ పెద్ద పరిశ్రమను టేకోవర్ చేయడం ద్వారా ఇక్కడ భారత రాష్ట్ర సమితిని బలోపేత చేయడమో.. ఏమో దాని వెనుక కేసీఆర్ ఉద్దేశ్యం ఏమిటో కానీ మొత్తానికి విశాఖ […]

  • Publish Date - April 11, 2023 / 10:37 AM IST
  • ప్లాంట్ సందర్శనలో సింగరేణి అధికారులు

విధాత‌: మొన్నటి నుంచీ అనుకున్నదే.. విశాఖ ఉక్కును (Visakha Steel Plant) అమ్మేయాలని, లేదా ప్రయివేటీకరిం చాలని కేంద్రం భావిస్తుండగా దాన్ని తాము కొనుగోలు చేసి ఆపరేట్ చేస్తాం అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సంస్థనుంచి లాభాలు తీసుకోవడం కోసమో, ఆంధ్రలోని ఓ పెద్ద పరిశ్రమను టేకోవర్ చేయడం ద్వారా ఇక్కడ భారత రాష్ట్ర సమితిని బలోపేత చేయడమో.. ఏమో దాని వెనుక కేసీఆర్ ఉద్దేశ్యం ఏమిటో కానీ మొత్తానికి విశాఖ ఉక్కును కొనుగోలు చేయాలనీ డిసైడ్ అయ్యారు.

అందులో భాగంగా ఈరోజు సింగరేణి (Singareni collieries limited) సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లు, ఇంకో ఇద్దరు జనరల్ మేనేజర్లు కలిసి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించి అక్కడి పరిస్థితులు, కంపెనీ నడుస్తున్న విధానాన్ని గమనించారు. వాస్తవానికి ఈ ఉక్కు కంపెనీని విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో యువత, విద్యావంతులు ఉద్యమం చేసి సాధించారు.

అంతేకాకుండా దానికి విశాఖలోని గాజువాక, లంకెల పాలెం, పరవాడ తదితర గ్రామాలకు చెందిన రైతులు భూములు అప్పగించారు. వారిలో కొందరికి సంస్థలో ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఉక్కు ఫ్యాక్టరీ రాకతో విశాఖ పట్నం స్వరూపమే మారిపోయింది. గాజువాక గ్రామం ఇప్పుడు నగరమైంది. వేలకొద్దీ ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు.. కంపెనీ మీద ఆధారపడి మరెన్నో చిన్న కర్మాగారాలు, హోటళ్లు, రవాణా, రియల్ ఎస్టేట్, ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థ స్వరూపం మారింది.

అరవై మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ సంస్థకు దాదాపుగా 13 వేల హెక్టార్ల భూములున్నాయి. ఏటా దాదాపు పదిహేను వేల కోట్ల టర్న్ ఓవర్ సాధించే విశాఖ ఉక్కు పరిశ్రమకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏదైతేనేం దీన్ని అమ్మేయాలని కేంద్రం నిర్ణయించుకున్నాక ఎవరూ ఆపే పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా దీనిలో కొంత వాటాను దాదాపు రూ.5000 కోట్లకు విక్రయించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే దీన్ని చేజిక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది సాకారం అయితే స్టీల్ ప్లాంట్ కు ఇక నుంచి సింగరేణి నుంచి బొగ్గు సరఫరా అవుతుంది. ఇదిలా ఉండగా ఈనెల 15 తేదీ వరకూ బిడ్లను ఆహ్వానించనున్నట్లు స్టీల్ ప్లాంట్ ను నడుపుతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ప్రకటించింది.