Skanda Movie Review | ‘స్కంద’ రివ్యూ.. ఇది రామ్‌ సినిమా కాదు.. బోయపాటి ఊచకోత

Skanda Movie Review | ‘స్కంద’ రివ్యూ.. ఇది రామ్‌ సినిమా కాదు.. బోయపాటి ఊచకోత

మూవీ పేరు: ‘స్కంద’

విడుదల తేదీ: 28 సెప్టెంబర్, 2023

నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, దగ్గుబాటి రాజా, ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, ప్రభాకర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే

ఎడిటింగ్: తమ్మిరాజు

సంగీతం: ఎస్. ఎస్. థమన్

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, పవన్ కుమార్

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను

బోయపాటి అనగానే అందరికీ బాలయ్యే గుర్తొస్తాడు. ఎందుకంటే, బాలయ్య- బోయపాటి కాంబినేషన్ అలాంటిది. వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఒకదానిని మించి మరొకటి బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే బాలయ్య మినహా.. బోయపాటి ఏ హీరోతో చేసినా.. ఆ సినిమా యావరేజ్, యభౌ యావరేజ్ సినిమాలుగానే నిలుస్తున్నాయి తప్ప.. బ్లాక్‌బస్టర్స్‌గా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయి.. బ్లాక్‌బస్టర్ పేరుని సంపాదించుకోలేకపోతున్నాయి. ఇప్పుడా ఆపవాదుని బోయపాటి చెరిపేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే.. ఇప్పుడంతా పాన్ ఇండియా నడుస్తుంది. అలాంటప్పుడు అందరి హీరోలతో ఆయన మంచి హిట్స్ ఇవ్వాలి. బోయపాటి సంగతి ఇలా ఉంటే.. రామ్ ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు.



‘ఇస్మార్ట్ శంకర్’తో దాదాపు మాస్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు కూడా. ఇప్పుడు మాస్ అనే పేరుని చేతిలో పట్టుకుని తిరిగే బోయపాటి వంటి దర్శకుడితో సినిమా అంటే.. అది ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టైటిల్ ‘స్కంద’ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి.. వీరి కాంబినేషన్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి. టీజర్, ట్రైలర్స్ అయితే.. బోయపాటి మార్క్ అడుగడుగునా కనిపించేలా చేశాయి. దీంతో మరో ఊరమాస్ సినిమాని ప్రేక్షకులు చూడబోతున్నారనే హింట్ కూడా వచ్చేసింది. అలాగే టాలీవుడ్ క్రష్ శ్రీలీల మాంచి ఊపు మీదుంది. ఆమె కూడా ఈ సినిమాకు జత కట్టడంతో.. సినిమా రేంజే మారిపోయింది. మరి ఆ రేంజ్.. సక్సెస్‌గా మారిందా? అసలు ‘స్కంద’ పరిస్థితి ఏంటో మన రివ్యూలో తెలుసుకుందాం.


ముందుగా కథలోకి వెళితే.. కథలోకి వెళ్లే ముందు, ముందుగా రెండు ముక్కలు చెప్పుకుందాం. బోయపాటి సినిమా అంటే లాజిక్స్ ఉండవు. సినిమాటిక్ లిబర్టీని కావాల్సినంతగా వాడుకుంటాడు. జనానికి నచ్చినా, నచ్చకపోయినా.. నేనింతే.. నా సినిమాలు ఇంతే అనేలా ఉంటాయి కాబట్టి.. కథ చదివే ముందు, చదివిన తర్వాత కంగారు పడొద్దు. కథలోకి వస్తే.. ముఖ్యమంత్రి కుమార్తె వివాహం అంటే ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో.. అలాంటి హంగామాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (అజయ్ పుర్కర్) కుమార్తె వివాహానికి అంతా సిద్ధమవుతుంది. అదే టైమ్‌లో సీఎం కుమార్తెని.. తెలంగాణ ముఖ్యమంత్రి (శరత్ లోహితాశ్వ) కుమారుడు తీసుకెళ్లిపోతాడు. ఏంటి షాకయ్యారా? అందుకే రెండు ముక్కలు ముందు మాట్లాడుకుందాం అంది.



సరే.. కథలోకి వస్తే.. ఈ ఘటనతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య శత్రుత్వం నెలకొంటుంది. పీటల మీద పెళ్లి కావాల్సిన కుమార్తెను లేపుకెళ్లిపోవడంతో.. పరువు పోయినట్లుగా భావించిన ఏపీ సీఎం.. మళ్లీ తన కుమార్తెను తీసుకురావాలని ఓ కత్తిలాంటి యువకుడు (రామ్)ని నియమిస్తాడు. బోయపాటి హీరో ఎలా ఉంటాడో తెలియంది కాదు కాబట్టి.. తెలంగాణ సీఎం ఇంట్లోకి సరాసరి వెళ్లిపోవడం.. అక్కడ ఉన్న ఏపీ, తెలంగాణ సీఎంల కుమార్తెలను కిడ్నాప్ చేయడం జరిగిపోతుంది? అదేంటి ఏపీ సీఎం కుమార్తెను కదా.. హీరో తీసుకురావాల్సింది.. తెలంగాణ సీఎం కుమార్తెను కూడా ఎందుకు తీసుకొచ్చాడు? అంటే అదే ట్విస్ట్. హీరో కిడ్నాప్ చేసిన ఆ ఇద్దరిని రుద్రరాజపురం అనే గ్రామానికి తీసుకుపోతాడు. అసలు అక్కడికి ఎందుకు తీసుకువెళ్లాడు? ఆ ఊరితో ఇద్దరు సీఎంలకు ఉన్న లింకేంటి? క్రౌన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన రామకృష్ణంరాజు (శ్రీకాంత్)కి, ఈ కథకి సంబంధం ఏమిటి? చివరికి ఈ కథ ఎలా మలుపు తిరిగింది? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.


 నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:


ముందుగా నటీనటుల గురించి చెప్పుకుంటే.. బోయపాటి సినిమా అంటే చాలు కట్టకట్టలు, గుట్టగుట్టలుగా నటీనటులు ఉంటారు. ఇది ఆయన తీసిన ప్రతి సినిమాలో ఉండేదే కాబట్టి.. అందరి గురించి కాకపోయినా.. మెయిన్ పాత్రల గురించి చెప్పుకుంటే.. ముందుగా హీరో గురించే చెప్పుకోవాలి. రామ్ ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా.. రెండింటిలో దున్నేయగల నటుడు రామ్. ఈ సినిమాలో కూడా రామ్‌కి అలాంటి పాత్రలే లభించాయి. రెండు రకాల పాత్రలలో రామ్ చెలరేగిపోయాడని చెప్పుకోవాలి. రామ్ బాడీ బిల్డ్ చేసిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక డ్యాన్స్, డైలాగ్స్.. తెలంగాణ, రాయలసీమ స్లాంగ్‌లో చెప్పే డైలాగ్స్.. ఒక్కటేమిటి.. తన పరంగా పూర్తిగా బోయపాటికి లొంగిపోయాడు. బోయపాటి ఎలా వాడుకోవాలో అలా వాడేశాడు రామ్‌ని. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులకు రామ్ మరింత దగ్గరవుతాడు. నటుడిగా ఇంకాస్త తన ఇమేజ్‌ని పైకి లేపే చిత్రమిది.



శ్రీలీల‌ని అంతగా ఈ సినిమాలో వాడుకోలేదనిపిస్తుంది. పాటలు, కొన్ని సీన్లకే పరిమితం చేశారు. ఉన్నంతలో తన బ్యూటీని, టాలెంట్‌ని శ్రీలీల ప్రదర్శించింది. మరో హీరోయిన్ సయీ మంజ్రేకర్ కనిపించేది తక్కువే అయినా.. కథలో కీలక మలుపుకి కారణమవుతుంది. గత సినిమాలతో పోలిస్తే.. నటన, చూపుల పరంగా కాస్త పరవాలేదనే చెప్పుకోవాలి. రామ్ తండ్రిగా చేసిన దగ్గుబాటి రాజాకి కొన్ని మంచి సీన్లు పడ్డాయి. ఆయన రీ ఎంట్రీకి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. రామకృష్ణంరాజు పాత్రలో శ్రీకాంత్ హుందాగా కనిపించాడు. అతని పాత్ర కూడా ఈ సినిమాకు చాలా కీలకం. ఇంకా ముఖ్యమంత్రుల పాత్రలలో నటించిన వారు, గౌతమి, ఇంద్రజ, ప్రభాకర్.. ఇలా భారీ తారాగణమే సినిమాలో ఉంది. ఊర్వశి రౌతేలా ఓ పాటలో మెరిసింది. రౌడీలు అయితే.. కుప్పలు కుప్పులుగా వస్తూనే ఉంటారు. ఇలా అందరూ బోయపాటి సూచించినట్లుగా చేసుకుపోయారు.



 

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. నిర్మాణ విలువల గురించి మాట్లాడుకోవాలి. పాన్ ఇండియా సినిమా కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనే విషయం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్ డిటాకే సినిమాకు ఏమేం మూడ్ కావాలో.. దాన్ని చక్కగా రాబట్టగలిగాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆయన చిత్రీకరించిన తీరు చాలా బాగుంది. ఎడిటింగ్ పరంగా కత్తెర పడాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. కానీ బోయపాటి మాటని కాదనలేకపోయి ఉండొచ్చు. కొన్ని రొటీన్ సీన్లు కనిపిస్తాయి. అలాంటి వాటిపై కాస్త జాగ్రత్త వహించాల్సింది.



ఇక థమన్ కొట్టుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాటలు ఏదో వెళ్లిపోయాయిలే అనుకుంటే.. ఫైట్స్‌లో థమన్ డామినేషన్ కనిపించింది. ఫలితంగా కొంత గజిబిజిగా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ‘అఖండ’ కంటే గొప్పగా పేరు కొట్టేయాలని చూశాడు కానీ.. శృతి మించినట్లుగా అనిపిస్తుంది. సెటైరికల్‌గా రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు ఈ ఊర మాస్ ప్రాజెక్ట్‌కి తమ పనితనం కనబరిచారు. బోయపాటి ఈ సినిమాకు రాసుకున్న కథ.. అసలు కన్విన్సెంగ్‌గా అనిపించదు. అలాగనీ వదిలేయాలని కూడా అనిపించదు. అదే బోయపాటి మ్యాజిక్. తనకే సాధ్యమైన మాస్ ఎలిమెంట్స్‌తో.. తనని నమ్ముకున్న మాస్ ఆడియెన్స్‌కి మంచి ట్రీట్ ఇచ్చాడనే చెప్పుకోవాలి.


విశ్లేషణ:


ఇది రామ్ సినిమా కాదు.. బోయపాటి సినిమా.. అంతే. బోయపాటి సినిమా అనగానే ముందు విమర్శలు రావడం సహజమే. ‘అఖండ’ సినిమాకు కూడా మొదటి రోజు దారుణమైన టాక్ వచ్చింది. ఆ తర్వాతే అందుకుంది. అలాగే ఈ సినిమాకు కూడా అలాంటి భవిష్యత్తే ఉండే అవకాశం లేకపోలేదు. అయితే హీరో రామ్ కదా.. అని బోయపాటి ఏం కామ్‌గా ఉండలేదు. బాలయ్య‌తో ఎలా అయితే పొలిటికల్ సెటైర్స్ వేయిస్తాడో.. ఇందులో రామ్‌తోనూ తన మార్క్ పొలిటికల్ సెటైర్లను పేల్చాడు. అలాగే ఓ మెసేజ్ కూడా ఇందులో ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే.. తెరపై మరోసారి మాస్ జాతర మోత మోగించాడు. ఊహకు అందే కథలతో ఊహించని రిజల్ట్స్ రాబట్టడం బోయపాటికి కొత్తేం కాదు. ఈ సినిమాకు కూడా లాజిక్ లేని కథని ఎంచుకున్నాడు. కానీ దర్శకుడిగా తన పవర్‌ని ప్రతి సన్నివేశానికి జోడించి.. టార్గెటెడ్ ఆడియెన్స్‌ని సంతృప్తి పరిచాడనే చెప్పుకోవాలి.



ముఖ్యమంత్రులతో మొదలెట్టి.. నిదానంగా హీరోని కథలోకి తీసుకొచ్చిన బోయపాటి.. హీరో ఎనర్జీని ఎలా కావాలంటే అలా వాడేశాడు. అసలు రామ్ నరుకుతుంటే.. థియేటర్లలో ఉన్నామా.. లేదంటే ఏదైనా యుద్ధంలో ఉన్నామా అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఆ రేంజ్ మాస్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమని.. దాదాపు ఒక ఊరుతోనే పంచెలు కట్టించేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫస్టాఫ్‌ని కాస్త జాలీగా నడిపించి, ఇంటర్వెల్‌తో ఊచకోత కోసి.. సెకండాఫ్‌లో వెనక్కి తీసుకెళ్లి.. క్లైమాక్స్‌కి ట్విస్ట్‌తో ముగించాడు.



అన్నట్లు బోయపాటికి కూడా యూనివర్స్‌పై మోజు కలిగినట్లుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉన్నట్లుగా ముగించాడు. మొత్తంగా అయితే.. బోయపాటి నుంచి మాస్ ప్రేక్షకులు కోరుకునే మాస్ మోత, జాతర ఇదని చెప్పుకోవచ్చు. ఏ సెంటర్ ప్రేక్షకులు కూడా కత్తి కోతని చూడాలనుకుంటే మాత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగడం ఖాయం. సెలవులు కూడా కలిసొచ్చాయి కాబట్టి.. ‘స్కంద’ సేఫ్ ప్రాజెక్ట్, ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. క్లాస్ ఆడియెన్స్ రిసీవ్ చేసుకునే దానిని బట్టి.. ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మాస్‌కి అయితే మోతే.



ట్యాగ్‌లైన్: బాబోయ్.. మాస్ మోత మోగిపోయింది

రేటింగ్: 2.5/5