విధాత: పాముల పేరు వింటేనే శరీరంలో వణుకు పుడుతోంది. మరి ఆ పాములు మన కళ్ల ముందు ప్రత్యక్షమైతే గుండె ఆగినంత పని అవుతుంది. బిడ్డ లో దుస్తులు దాచి ఉంచిన బాక్సులో ఓ విషపూరిత పాము ప్రత్యక్షం కావడంతో తల్లి షాకైంది. ఐదు అడుగుల పొడవున్న ఈ పాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్‌గా పిలవబడే ఈ పాము ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తోంది.
ఈ పాము ప్రత్యక్షమైంది కూడా ఆస్ట్రేలియాలోనే. స్నేక్ క్యాచర్ మార్క్ పెల్లీ పామును పట్టుకుని అడవిలో వదిలేశాడు. అయితే ఆస్ట్రేలియాలో పాము తరుచూ కనిపిస్తుంటాయి. ఆఫీసులు, నివాస సముదాయాల్లో పాములు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ యూనివర్సిటీలోని వీనం రీసెర్చ్ యూనిట్ ప్రకారం.. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్ అత్యంత విషపూరితమైనది అని తేలింది. ఇది ప్రపంచంలోని విషపూరిత సర్పాల్లో అత్యంత ప్రమాదకరమైన రెండో సర్పంగా గుర్తించారు. దీని విషం గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పాము కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయని తేలింది.