Sonia Gandhi | ఆ తొమ్మిది చర్చించాలి.. ప్రధాని మోదీకి సోనియాగాంధీ లేఖ

అందులో మణిపూర్‌, అదానీ అంశాలు Sonia Gandhi | విధాత‌: ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు సాగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో 9 అంశాలపై చర్చించేందుకు సమయం కేటాయించాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు ఒక లేఖ రాశారు. అదానీ గ్రూపు వివాదాస్పద లావాదేవీలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు, మే నెల నుంచి జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్‌లో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థ, […]

  • Publish Date - September 6, 2023 / 12:21 AM IST
  • అందులో మణిపూర్‌, అదానీ అంశాలు

Sonia Gandhi | విధాత‌: ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు సాగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో 9 అంశాలపై చర్చించేందుకు సమయం కేటాయించాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు ఒక లేఖ రాశారు. అదానీ గ్రూపు వివాదాస్పద లావాదేవీలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు, మే నెల నుంచి జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్‌లో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థ, భారతీయ భూభాగాన్ని చైనా ఆక్రమించడం వంటి అంశాలు సోనియా ప్రస్తావించిన అంశాల్లో ఉన్నాయి. రానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశాన్ని నిర్వహించిన మరుసటి రోజు సోనియా ఈ లేఖ రాశారు. ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదించకుండానే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారని సోనియా తన లేఖలో పేర్కొన్నారు.

‘మాలో ఎవరికీ సమావేశాల అజెండా ఏమిటో తెలియదు. ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఐదు రోజులు కేటాయించినట్టు మాకు సమాచారం అందింది’ అని ఆమె తన లేఖలో తెలిపారు. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న, ముఖ్యమైన అంశాలను ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా పాల్గొనాలన్న అభిప్రాయంతో తమ పార్టీ ఉన్నదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటజీ గ్రూప్‌ సమావేశం కూడా మంగళవారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే సోనియాగాంధీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ బుధవారం తెలిపారు.

హర్యానా వంటి రాష్ట్రాల్లో పెరుగుతున్న మత ఉద్రిక్తతలు, మణిపూర్‌ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, అక్కడ రాజ్యాంగ యంత్రాంగం, సామాజిక సామరస్యం కుప్పకూలిన తీరు, లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో భారతీయ భూభాగాన్ని చైనా నిరవధిక ఆక్రమణలతో భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు ఎదురవుతున్న సవాళ్లు, అదానీ గ్రూప్‌ లావాదేవీలపై వస్తున్న ఆరోపణపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు, దేశంలో నానాటికీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగిత, పెరుగుతున్న అసమానతలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సంక్షోభం అంశాలపై చర్చకు సమయం కేటాయించాలని సోనియా తన లేఖలో విజ్ఞప్తి చేశారు. మరో ముఖ్యమైన అంశంగా కుల గణనను ఆమె పేర్కొన్నారు.

అదే సమయంలో క్షీణిస్తున్న కేంద్ర-రాష్ట్ర సంబంధాలపైనా చర్చ జరగాల్సి ఉన్నదని ఆమె అభిప్రాయపడ్డారు. కరువు, వరదల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రకృతి విధ్వంసంపైనా చర్చించాలని కోరారు. మద్దతు ధర విషయంలో రైతులకు, రైతు సంఘాలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీపైనా సభలో చర్చ జరగాలని సోనియా పేర్కొన్నారు.