విధాత: బంగాళాఖాతంలో రెండురోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి శనివారం ఉదయం వరకు తీవ్ర అల్పపీడనంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు మిచౌంగ్‌గా నామకరణం చేశారు. తుఫాను ప్రభావం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ క్రమంలో భారతీయ రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. దాదాపు 142 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నెల 2 నుంచి 6 వరకు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇందులో సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నర్సాపూర్, కాకినాడతో పాటు వివిధ పట్టణాల నుంచి నడిచే రైళ్లు సైతం ఉన్నాయి.
విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-గూడూర్, లింగంపల్లి-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి, కాకినాడ-బెంగళూరు, విశాఖపట్నం – చెన్నై, ఆదిలాబాద్ -తిరుపతి, కాకినాడ పోర్ట్ – చెంగల్‌పట్టు, సికింద్రాబాద్-కొల్లం, హైదరాబాద్-చెన్నైతో పాటు వివిధ రూట్లలో నడిచే రైళ్లను తుఫాను నేపథ్యంలో రద్దు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. మరో వైపు తుఫాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ వర్షాలు కురుస్తున్నాయి