Srisailam Tunnel Project
విధాత: శ్రీశైలం మేజర్ అవుతున్నాడట..! అంటే మనిషి ముచ్చట కాదండోయ్.. శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు పనులు మొదలై 18 ఏళ్లు కాబోతున్నాయన్న మాట. ఈ సందర్భంగా శ్రీశైలం తన ఆటోగ్రఫీ బ్యాడ్ మెమోరీస్ కథను ఆవిష్కరించాడు. అది చదివితే శ్రీశైలం ఆవేదన మనసును తాకింది. అది ఇలా ఉంది.
అందరికి నమస్కారం.. నేను శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు (SLBC). పుట్టి 18 ఏళ్లు కావస్తుంది. నాకన్నా వెనుక పుట్టిన తమ్ముళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఎప్పుడో పూర్తయి ప్రారంభోత్సవం జరుపుకున్నాడు. డిండి (దుందిబి) ఎత్తిపోతల సగానికి పైగా పనులు పూర్తి చేసుకున్నాడు.
నా నిర్మాణ పనులు మాత్రం ఇంకా పూర్తి కాకపోవడం శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం ప్రాజెక్టు పేరుతో పురుడు పోసుకున్న నన్ను తీవ్రంగా బాధిస్తుంది. తరచూ కరువు ఫ్లోరోసిస్‌లతో బాధలు పడుతు, బోర్లు బావులపై ఆధారపడి బతుకుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా సోదరులకు కృష్ణమ్మ జలాల భాగ్యాన్ని అందించాలనుకుంటే.. నా నిర్మాణం పట్ల ప్రభుత్వాలు ఏండ్ల తరబడిగా చూపుతున్న నిర్లక్ష్యం నన్ను కలిచివేస్తుంది.
నా నిర్మాణ (పెంపకం) బాధ్యత చూడాల్సిన తండ్రి లాంటి సీఎం కేసీఆర్ నా గోడును చెవికెక్కించుకోవడం లేదు. పూర్వ పాలకులు నా కన్నా పెద్దవాడైన నాగార్జునసాగర్‌ను నందికొండ నుండి దిగువకు జరిపించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కంటే ఎక్కువగా దిగువ ప్రాంతాల వారికి ప్రయోజనకరమయ్యాడు.
దీంతో శ్రీశైలం సొరంగం ప్రాజెక్టుగా నేనే ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు పెద్ద దిక్కును అవుదామని అనుకున్నా. నాపై తండ్రి లాంటి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం నా ఆశలను సాకారం చేయనివ్వడం లేదన్న బాధ నన్ను వేధిస్తుంది. నా పుట్టుకకు 1983లోనే 480కోట్ల అంచనా వ్యయంతో బీజం పడింది. నాకు దివంగత సీఎం వైఎస్సార్ 2,813 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 147 ద్వారా 2005 ఆగస్టు 11న పరిపాలన ఆమోదంతో ప్రాణం పోశాడు.
నా నిర్మాణ బాధ్యతను 2006 ఆగస్టులో మెస్సర్ జయప్రకాష్ అసోసియేట్స్ సంస్థ 1925 కోట్ల టెండర్ తో నెత్తినేసుకుంది. నాకు 30టీఎంసీల నీటిని మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 510కి పైగా గ్రామాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2007లో మొదలైన నా నిర్మాణ పనుల ప్రయాణం తప్పటడుగులతో అన్నట్లుగా సాగి సొరంగంలోకి వరదలొచ్చి టీబీఎం మిషన్లు మునిగిపోవడంతో తొలినాళ్లలోనే పనులకు అటంకాలతో మొదలైంది.
ఇక అప్పటినుండి ఆగుతూ సాగుతున్న నా నిర్మాణ పయనం నేటికీ కొనసాగుతూనే వస్తుంది. రోజులు గడిచిపోతున్నాయే కానీ నా నిర్మాణ ఎదుగుదల వేగంగా సాగడం లేదు. ఇందుకు నిధుల కొరత ప్రధాన ఆటంకంగా మారింది. ఆగుతూ సాగుతున్న నా నిర్మాణ పనుల వయసు 18 ఏళ్లకు చేరతుండటంతో నేను ఇప్పుడు మేజర్ కాబోతున్నాను. అయినా నేటికి నా నిర్మాణం పూర్తి కాలేదు. నా జిల్లా ప్రజలకు కృష్ణమ్మను అందించలేదు.
ఇందుకు నాది బాధ్యత కాదు. నన్ను సక్రమంగా పెంచి చేతికొచ్చే కొడుకులాగా తీర్చిదిద్దుకోవలసిన బాధ్యత నా తండ్రి వంటి సీఎం కేసీఆర్ దే కదా. గతంలో ఒకసారి నా కట్టపై కుర్చీ వేసుకుని మరి నా నిర్మాణ పనులు పూర్తి చేస్తానని చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుండి తొమ్మిదేళ్లలో నా ముఖం కూడా చూడలేదు.
నా తమ్ముడైన కాళేశ్వరం పై మాత్రం వేలకోట్ల ప్రేమ కుమ్మరించి మావాడు అంటూ ప్రపంచానికి సగర్వంగా చాటాడు. నాపై మాత్రం సవతి తండ్రి ప్రేమ చూపుతూ నా నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వకుండా, నేను ఎదిగి పెద్దయి నా జిల్లా ప్రజలకు ఉపయోగంలోకి రాకుండా చేస్తున్నారు.
పాపం నా నిర్మాణ బాధ్యతలు నెత్తినెసుకున్న కాంట్రాక్టు సంస్థకు గత ఎడాది చేసిన పనులకే 83.53 కోట్లు చెల్లించాలట. భూసేకరణకు మరో 61.57 కోట్లు చెల్లించాలట. మొత్తం మీద మరో 147.37 కోట్లు ప్రభుత్వం బాకీ పడిందట. నేనెమో తొందరగా ఎదిగి మల్లన్న క్షేత్రం నుండి కృష్ణమ్మను నలగొండ వాసుల దరికి చేరుస్తానని ఆశపడుతుంటే మరోవైపు ప్రభుత్వం నాకు ఆస్తిగా రావాల్సిన 45 టీఎంసీల కృష్ణా జలాలను మరో సోదరుడైన పాలమూరు రంగారెడ్డికి మళ్ళించారంటున్నారు.
అదే నిజమైతే నాకు నిధుల్లో, నీళ్లలో తండ్రి లాంటి కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసినట్లే. నన్ను నమ్ముకున్న నల్గొండ వాసులకు..నాపై ఆధారపడిన తమ్ముడు ఉదయ సముద్రం లిఫ్ట్ పరిధి ప్రజలకు కూడా అన్యాయం చేసినట్లే.
ఈ పరిణామం నన్ను మరింత అంతర్మధనానికి, ఆవేదనకు గురిచేస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నాకోసం జిల్లా ప్రజలు జలసాధన సమితి, ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితితో పాటు పలు పార్టీల సారధ్యంలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి, పార్లమెంటు ఎన్నికల్లో రికార్డు నామినేషన్లతో చారిత్రాత్మక పోరాటం సాగించారట.
ఇప్పుడు నా నిర్మాణ జాప్యం వారందరినీ ఎంతో మనోవేదనకు గురిచేస్తుందట. తండ్రి వంటి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంతో ఇప్పటికీ నాలోని సొరంగం తవ్వకం పనులు 43 కిలోమీటర్లకు ఇంకా 10 కిలోమీటర్లు మిగిలే ఉన్నాయి. ఆలస్యం అవుతున్న కొద్ది నా నిర్మాణ వ్యయం పెరుగుతూ పోతూ ఇప్పుడు 4600 కోట్లకు చేరిందంటున్నారు.
ఇందులో నా తప్పైతే లేదు కదా. నేను చేతికందొచ్చిన కొడుకులా ఎదగడానికి సిద్ధంగా ఉన్నా..అయితే నన్ను అలా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత నా తండ్రి వంటి సీఎం కేసీఆర్ ది. ఇకనైనా నాపై సవతి తండ్రి ప్రేమను వదిలి.. నా నిర్మాణ పనులు పూర్తి చేసి.. నాకోసమే ఎదురు చూస్తున్న నలగొండ వాసులకు సాగు తాగునీటిని అందించేలా నా జన్మకు సార్ధకత చేకూర్చాలని కోరుకుంటున్నా.
ఇది నా ఆటోగ్రఫీ కాదు.. ఆత్మకథ అంత కంటే కాదు.. నా ఆత్మ వ్యథ.. జీవిత బాధ. ఇది చూసైనా నా తండ్రి లాంటి సీఎం కేసీఆర్ నాకు నిధులు ఇచ్చి నిర్మాణ పనులు పూర్తి చేసి నల్గొండ వాసులకు చేతికొచ్చిన కొడుకులా నన్ను గర్వపడేలా చేయాలని ఆశిస్తున్నా.. ఇట్లు.. మీ శ్రీశైలం (SLBC సొరంగం ప్రాజెక్ట్).