Stock market | కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్‌లు.. రూ.13 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై: స్టాక్ మార్కెట్ 13-03-2024న భారీగా పతనమైంది. స్టాక్‌మార్కెట్ చరిత్రలో బ్లాక్ వెన్స్‌డేగా నిలిచిపోయింది. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలపైనే మదుపరులు నష్టపోయారు. మధ్యహ్నం సెషన్ సందర్భంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సెగ్మెంట్లలో భారీ నష్టాలు ఎదురవవడంతో సెన్సెక్స్ 1109 పాయింట్లు పతనమై 72,558కు చేరుకున్నది. నిఫ్టీ కూడా ప్రభావితమైంది. ఉదయం సాధించిన గెయిన్స్ అన్నీ అదృశ్యమైపోయాయి. 422 పాయింట్లు తగ్గి, 21,913 చేరుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోయి.. 72,761.89 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 338 పాయింట్లు తగ్గి.. 21,997.70 వద్ద ముగిసింది. ఇంత భారీగా స్టాక్‌మార్కెట్ పతనం కావడం ఈ మధ్యకాలంలో ఇదే. 250కిపైగా షేర్‌లు 52 వారాల కనిష్ఠానికి చేరాయి. ఎన్ఎస్ఈలోని సుమారు 161 షేర్స్ విలువలు.. 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. ఎన్‌ఎస్‌ఏ డాటా మేరకు.. 17 స్టాక్స్ విలువ మాత్రమే 52 వారాల గరిష్ఠానికి చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో సింధు ట్రేడ్, మార్షల్ మషీన్స్, జీఆర్ఎం ఓవర్సీస్, సెల్లో వరల్డ్, బీజీఆర్ ఎనర్జీ తదితర షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని చవిచూశాయి. సోమీ కన్వేయర్, ఇంటెలిజెన్స్ డిజైన్, మాడ్రన్ థ్రెడ్స్ (ఇండియా) లి. , డైమండ్ పవర్, డాల్ఫిన్ ఆఫ్ షోర్ షేర్ల విలువ 52 వారాల గరిష్ఠానికి చేరాయి. నిఫ్టీ సైతం 338 పాయింట్ల నష్టంతో 21, 997.70 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30లో ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, నెస్లే ఇండియా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టాలు చవిచూశాయి.
రూ.13.5 లక్షల కోట్లు నష్టం
బీఎస్ఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో హిందూస్థాన్ యునిలీవర్, ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్, యూపీఎల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్, పేజ్ ఇండస్ట్రీస్ తదితర 250కి పైగా షేర్లు 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. టీసీఎస్, డెల్టా, ఎన్బీఎల్ షేర్లు 52 వారాల గరిష్ఠానికి చేరగలిగాయి. మొత్తంగా ముందటి సెషన్స్ విలువ 385.64 లక్షల కోట్ల రూపాయలు ఉంటే.. నష్టాల అనంతరం 372.1 లక్షల కోట్ల రూపాయలుగా మిగిలింది. అంటే.. మదుపరులు దీనితో మొత్తంగా 13.5 లక్షల కోట్ల మేర నష్టపోయారు. ప్రధాన బెంచ్ మార్క్ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ 1.5 శాతానికి మించి క్షీణతను చవిచూశాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వీపీ అర్విందర్‌సింగ్ నందా చెప్పారు. ప్రధానంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు గణనీయంగా పతనం కావడం వల్లే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసిందని ఆయన పేర్కొన్నారు. సెబీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ 5 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 4 శాతం చొప్పున నష్టపోయాయి. నగదు లభ్యత అధికంగా ఉండటం కూడా ఒక కారణమై ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌లో మరింత కరెక్షన్ రానున్న రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.