Supreme Court । రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జి పదోన్నతికి సుప్రీం బ్రేక్‌

68 మంది జడ్జీల పదోన్నతులపై స్టే విధాత: రాహుల్‌ గాంధీకి శిక్ష విధించిన న్యాయమూర్తి సహా 68 మంది న్యాయాధికారులకు జిల్లా జడ్జీలుగా పదోన్నతులు కల్పిస్తూ గుజరాత్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు (Supreme Court) స్టే విధించింది. మోదీ ఇంటిపేరు విషయంలో చేసిన వ్యాఖ్యలపై నడిచిన కేసులో హరీశ్‌ హస్ముఖ్‌భాయ్‌ శిక్ష విధించడంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. పదోన్నతి ఉత్తర్వుల అంశం చట్టబద్ధత కోర్టు పరిధిలో ఉన్న సమయంలో […]

  • Publish Date - May 12, 2023 / 09:30 AM IST
  • 68 మంది జడ్జీల పదోన్నతులపై స్టే

విధాత: రాహుల్‌ గాంధీకి శిక్ష విధించిన న్యాయమూర్తి సహా 68 మంది న్యాయాధికారులకు జిల్లా జడ్జీలుగా పదోన్నతులు కల్పిస్తూ గుజరాత్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు (Supreme Court) స్టే విధించింది. మోదీ ఇంటిపేరు విషయంలో చేసిన వ్యాఖ్యలపై నడిచిన కేసులో హరీశ్‌ హస్ముఖ్‌భాయ్‌ శిక్ష విధించడంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.

పదోన్నతి ఉత్తర్వుల అంశం చట్టబద్ధత కోర్టు పరిధిలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయడంపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించి, పై ఆదేశాలు జారీ చేసింది.

పదోన్నతులు కల్పించిన వారిని తిరిగి పాత స్థానాలకు పంపాలని తన ఆదేశాల్లో సుప్రీం కోర్టు పేర్కొన్నది. అనుభవం, నైపుణ్యత అనే సూత్రాలపై పదోన్నతులు జరగాలని, సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉన్నదని ఆదేశాలు జారీ చేస్తూ జస్టిస్‌ షా అన్నారు.

హైకోర్టు ఉత్తర్వులు, దానికి అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే.. ఇవి మధ్యంతర ఉత్తర్వులు. జస్టిస్‌ షా మే 15 తేదీన పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి బెంచ్‌కు ఈ కేసును రిఫర్‌ చేయనున్నారు.