Telangana | తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం.. సమ్మె విరమణ
Telangana | తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లు, పింఛనుదారులకు 7 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో ఇవాళ్టి నుంచి తలపెట్టాల్సిన విద్యుత్ ఉద్యోగుల సమ్మెను విరమించుకున్నారు. ఈ మేరకు విద్యుత్ సంఘాల జేఏసీ నేతలు ప్రకటన విడుదల చేశారు. తాజా ఒప్పందంతో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 70 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. 2022 […]

Telangana | తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లు, పింఛనుదారులకు 7 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో ఇవాళ్టి నుంచి తలపెట్టాల్సిన విద్యుత్ ఉద్యోగుల సమ్మెను విరమించుకున్నారు. ఈ మేరకు విద్యుత్ సంఘాల జేఏసీ నేతలు ప్రకటన విడుదల చేశారు. తాజా ఒప్పందంతో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 70 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
2022 ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీ విషయంలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపారు. పే రివిజన్ కమిటీ 5 శాతం ఫిట్‌మెంట్‌కు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లకు సంబంధించిన ఇతర డిమాండ్లపై కూడా జేఏసీతో ఫిబ్రవరి 1, మార్చి 6,10,13,29 తేదీల్లో యాజమాన్యాలు చర్చించాయి. అవి కొలిక్కి రాకపోవడంతో ఈ నెల 9న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విద్యుత్ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 7 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రతిపాదించారు.
సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డికి ధన్యవాదాలు..
విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం కావడంతో విద్యుత్ సంఘాల నాయకులు శివాజీ, ప్రకాశ్, అంజయ్య, రత్నాకర్ రావు, సాయిబాబు, బీసీ రెడ్డి కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినప్పటికీ తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు మరోసారి జాక్ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. 24 గంటల నిరంతరాయ విద్యుత్తు సరఫరా విజయవంతానికి పునరంకితం అవుతామని చెప్పారు.