తెలంగాణ అసెంబ్లీ 14వ తేదీకి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14వ తేదీకి వాయిదా. సమావేశాలు ప్రారంభంకాగానే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధిన్ ప్రమాణం చేయించారు.

- 100 మంది ఎమ్మెల్యేల ప్రమాణం..19మంది గైర్హాజర్
విధాత : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14వ తేదీకి వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11గంటలకు శాసన సమావేశాలు ప్రారంభంకాగానే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధిన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, తదుపరి భట్టి విక్రమార్కలు ప్రమాణం చేశారు. అనంతరం వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. మొత్తం 119మంది ఎమ్మెల్యేలకు గాను 100మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేయగా, బీజేపీ ఎమ్మెల్యేలు 8మంది ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధిన్ ఎంపికను నిరసిస్తూ ప్రమాణాన్ని బహిష్కరించారు.
కాగా.. పూర్తి స్థాయి స్పీకర్ ముందు ప్రమాణం చేస్తామని వారు ప్రకటించారు. ఇక సర్జరీ కారణంగా మాజీ సీఎం కేసీఆర్, ఆయనకు ఆసుపత్రిలో సహాయకుడిగా ఉండటంతో మంత్రి కేటీఆర్‌లు ప్రమాణానికి రాలేదు. తండ్రి సర్జరీ కారణంగా తాను ఈ రోజు ప్రమాణానికి రాలేకపోతున్నానని, తనకు ప్రమాణ స్వీకారానికి మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. వారితో పాటు మొత్తం 19మంది ఎమ్మెల్యేలు ప్రమాణ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమం పూర్తికాగానే ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధిన్ సభను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. 14వ తేదీన సభా సమావేశాలు పునఃప్రారంభం కానుండగా, అదే రోజు శాసన సభాపతిని ఎన్నుకుంటారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తర్వాత ఎన్ని రోజులు సభ నిర్వహించాలనేది స్పీకర్ ఎన్నిక అనంతరం జరిగే బీఏసీలో నిర్ణయించనున్నారు. అంతకుముందు శాసన సభ సమావేశాల ప్రారంభానికి ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ప్రొటెం స్పీకర్‌గా ఎంపికైన ఎంఎంఐ చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్ధిన్ ఒవైసీతో ప్రమాణం చేయించారు.