కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. విజేతలెవరో తేలేది నేడే

  • By: Somu    latest    Dec 02, 2023 11:51 AM IST
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. విజేతలెవరో తేలేది నేడే
  • ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ


విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు నిర్వహించే ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది. ఆదివారం ఉదయం తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 5గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది చేరుకోనున్నారు. లెక్కింపునకు ముందు గంటపాటు ఉద్యోగులకు, ఏజెంట్లకు కౌంటింగ్‌ మార్గదర్శకాలు వివరిస్తారు.


ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తారు. 8.30నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపడుతారు. పోస్టల్‌ బ్యాలెట్‌లకు 131, ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు 1776 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి కౌంటింగ్‌ కేంద్రంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 500 పోస్టల్ ఓట్లకు ఒక టేబుల్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1.80 లక్షల పోస్టల్‌ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10గంటల లోపునే తొలి రౌండ్‌ ఫలితాలు వెల్లడి కానున్నాయి.


రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌, మహేశ్వరం, కూకట్‌పల్లి, మేడ్చల్‌ 500కు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఉండటంతో ఆ నియోజకవర్గాల్లో 28 చొప్పున టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్‌, ఒక కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లు కౌంటింగ్‌ పర్యవేక్షిస్తారు. ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ ఫలితం వెలువడనుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేయడం జరిగింది.


ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగిం ది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం మద్యం దుకాణాలు బంద్ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా 119నియోజకవర్గాల్లో పోటీ పడిన 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం నేడు తేలనుంది. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు కాంగ్రెస్‌కు మెజార్టీ రావచ్చని అంచనా వేశాయి. బీఆరెస్‌ తమకే మెజార్టీ రాబోతుందని ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ గట్టిపోటీ నిచ్చిన నేపధ్యంలో కాంగ్రెస్‌, బీఆరెస్‌లలో మెజార్టీ ఏ పార్టీకి దక్కనుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కౌంటింగ్‌ ఏర్పాట్లపై ఒకవైపు సీఈవో వికాస్‌ రాజ్‌ అధికార యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా, మరోవైపు డీజీపీ అంజనీ కుమార్‌లు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సీపీలు, ఎస్పీలతో నిన్న సమీక్షించారు.