BJP | అసమ్మతి చల్లారేనా? రాష్ట్ర బీజీపీలో పంచాయతీలు ఆగేనా?

నాయకత్వ మార్పుతో ఒక గ్రూపు పైచేయి మరో గ్రూపు మౌనంగానే ఉంటుందా? నాయకత్వ మార్పు తగాదాను పెంచిందా? బీఆరెస్‌తో అవగాహన మేరకే ‘మార్పు’! అగ్రెసివ్‌ నాయకుడిగా పేర్గాంచిన బండి పార్టీలో సౌమ్యుడిగా పేరున్న కిషన్‌రెడ్డి బీజేపీ, బీఆరెస్‌ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ బలపడకుండా చూడాలనే ప్లాన్‌! అందుకే రాష్ట్ర పార్టీ నాయకత్వ మార్పు అధిష్ఠానం పన్నిన వ్యూహాలు అర్థం కాక మరింత అయోమయంలో కార్యకర్తలు పార్టీ ఇలా ముంచుతుంద‌నుకోలేదు.. స‌న్నిహితుల‌తో వాపోయిన సంజ‌య్‌ పార్టీలో మునుపెన్నడూ […]

  • Publish Date - July 6, 2023 / 12:30 AM IST
  • నాయకత్వ మార్పుతో ఒక గ్రూపు పైచేయి
  • మరో గ్రూపు మౌనంగానే ఉంటుందా?
  • నాయకత్వ మార్పు తగాదాను పెంచిందా?
  • బీఆరెస్‌తో అవగాహన మేరకే ‘మార్పు’!
  • అగ్రెసివ్‌ నాయకుడిగా పేర్గాంచిన బండి
  • పార్టీలో సౌమ్యుడిగా పేరున్న కిషన్‌రెడ్డి
  • బీజేపీ, బీఆరెస్‌ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌
  • కాంగ్రెస్‌ బలపడకుండా చూడాలనే ప్లాన్‌!
  • అందుకే రాష్ట్ర పార్టీ నాయకత్వ మార్పు
  • అధిష్ఠానం పన్నిన వ్యూహాలు అర్థం కాక మరింత అయోమయంలో కార్యకర్తలు
  • పార్టీ ఇలా ముంచుతుంద‌నుకోలేదు..
  • స‌న్నిహితుల‌తో వాపోయిన సంజ‌య్‌

పార్టీలో మునుపెన్నడూ లేనంత స్థాయిలో వీధికెక్కిన గ్రూపు తగాదాలను నివారించేందుకు బీజేపీ అధిష్ఠానం చేసిన నాయకత్వ మార్పుతో సమస్య ముగిసేనా? రాష్ట్ర బీజేపీలో అసమ్మతి చల్లారేనా? లేక రానున్న కాలంలో మరింత బలంగా గ్రూపు రాజకీయాలు ముందుకు వస్తాయా? హార్డ్‌కోర్‌ నాయకుడిగా పేరున్న బండి సంజయ్‌ స్థానంలో సౌమ్యుడైన కిషన్‌ రెడ్డిని తీసుకురావడంలో మతలబేంటి? ఇటు పార్టీ అంతర్గత పరిస్థితిని, అటు బయట రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని.. మధ్యేమార్గంగా కిషన్‌రెడ్డిని నియమించారా? ఈ విషయాల్లో రాజకీయ పరిశీలకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (విధాత, ప్రత్యేక ప్రతినిధి)

నాయకత్వ మార్పుతో రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతానికి అసమ్మతి స్వరాలు నెమ్మదించినా.. రానున్న కాలంలో మరింత బలంగా తలెత్తే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రెండు వర్గాల మధ్య పోరులో బండి సంజయ్‌ను మార్చి.. వైరి వర్గం సమ్మతి ఉన్న కిషన్‌ రెడ్డికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు.

ఇంత వరకూ బాగానే ఉన్నది. తమ మాట నెగ్గలేదని భావిస్తున్న రెండో వర్గం ఊరికే ఉంటుందా? రానున్న రోజల్లో మళ్లీ అసమ్మతి స్వరాలు పెరిగే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర పార్టీ పగ్గాలు తప్పించినందుకు ప్రతిగా కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే బండి వర్గానికి కొత్త శక్తి తోడైనట్టు అవుతుందని, తన గ్రూపును బలోపేతం చేసుకునేందుకు బండికి అవకాశం దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి.

కిషన్‌ మంత్రం ఫలించేనా?

కొంతకాలంగా బీజేపీలో గ్రూపు రాజ‌కీయాలు బాగా ముదిరిపోయాయి. బండి సంజ‌య్ నాయ‌క‌త్వంపై ఈట‌ల రాజేంద‌ర్, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు కూడా బాహాటంగానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిస్థితుల్లో కిష‌న్‌రెడ్డిని ఎంపిక చేయ‌డం బీజేపీకి ఏమాత్రం క‌లిసొచ్చే విష‌యం కాదంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

‘అధిష్ఠానం నిర్ణ‌యం వ‌ల్ల క్యాడ‌ర్‌లో అదే గందరగోళం కొన‌సాగుతున్నది, వ‌ర్గ‌పోరు చ‌ల్లార‌క‌పోగా మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. స‌గ‌టు బీజేపీ కార్య‌క‌ర్త‌ల్లో బీజేపీని న‌మ్ముకోవ‌డం క‌రెక్టు కాదేమో అన్న సందిగ్ధ‌త‌కు బీజం వేసింది’ అని ఒక రాజ‌కీయ ప‌రిశీల‌కుడు అభిప్రాయ‌ప‌డ్డారు. ‘బీజీపీ- బీఆరెస్ మ‌ధ్య వ్యూహాత్మ‌క ఒప్పందం ఉందేమో అన్న అనుమానాలు మాకూ బ‌ల‌ప‌డుతున్నాయి.

ఈ విష‌యంలో పార్టీ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చాయ‌ని బండి సంజ‌య్ స్వ‌యంగా అనుచరుల‌తో చెప్పిన‌ట్లు తెలిసింది. బండి బాధ‌ను కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం వ‌ల్ల కొంత చ‌ల్లార్చేందుకు అధిష్ఠానం చూస్తున్నది. మొత్తంగా తెలంగాణ‌లో బీఆరెస్ మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికి బీజేపీ త‌న‌ను తానే చంపుకున్న‌ట్లు అయింది’ అంటూ బీజేపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈటల‌, కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌ మ‌ధ్య ఇప్ప‌ట్లో స‌ఖ్య‌త వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని, ఇది స‌గ‌టు కార్య‌క‌ర్త‌కు ఆ పార్టీ మీద ఉన్న అభిమానం త‌గ్గిపోవ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు.
అంతిమంగా బీఆరెస్‌కే ఉపయోగం! బీజేపీ – బీఆరెస్ మ‌ధ్య వ్యూహాత్మ‌క ఒప్పందంలో భాగంగానే అధ్య‌క్షుడి మార్పు జరిగిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇది అంతిమంగా బీఆరెస్‌కే లబ్ధి చేకూర్చుతుందని విశ్లేషిస్తున్నారు.

ఇది తెలియ‌క ఆరాట‌ప‌డిన బండి సంజ‌య్‌.. ఇప్పుడు అనుచ‌రుల వ‌ద్ద గోడు వెల్ల‌బోసుకుంటున్నార‌ని చెబుతున్నారు. ‘పార్టీ ఇలా ముంచుతుంద‌నుకోలేదు’ అంటూ ఆయ‌న ఆవేద‌న చెందార‌ట‌. బీఆరెస్‌ ఓటమికి ప్రతినబూనిన ఈటల వంటివారికి కూడా ఈ పరిణామం ఇప్పుడప్పుడే జీర్ణమయ్యేలా లేదు. ఈటల పార్టీ నుంచి బయటకు వెళ్లిపోకుండా చూసేందుకే ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ గిరీ ఇచ్చారని అంటున్నారు. అంటే పదవి ఇచ్చి బలవంతంగా పార్టీలో కొనసాగేటట్టు చూస్తున్నారని చెబుతున్నారు.

రాష్ట్రంలో బీఆరెస్ తిరిగి అధికారంలో రావ‌డానికి బీజేపీ స‌హ‌క‌రిస్తే, కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావ‌డానికి అవ‌స‌ర‌మైన ఎంపీల మ‌ద్ద‌తు బీఆరెస్ ఇచ్చేలా ఒప్పందం జ‌రిగింద‌నే ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయాన్ని ఇటీవల ఖమ్మం సభలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. బీజేపీకి ‘బీ’ టీంగా బీఆరెస్‌ పనిచేస్తున్నదని, అందుకే ఆ పార్టీని ప్రతిపక్షాల కూటమి సమావేశానికి ఆహ్వానించడాన్ని తాము వ్యతిరేకించామని పేర్కొన్నారు.

ఈ పరిస్థితిలో ఈటల వంటివారు ఎలా వ్యవహరిస్తారన్నది రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనున్నదని పరిశీలకులు అంటున్నారు. ‘రెండు పార్టీల ఉమ్మ‌డి శ‌త్రువు ఇప్పుడు కాంగ్రెస్‌. కాంగ్రెస్ బ‌ల‌హీన‌ప‌డేందుకు ఎన్ని వ్యూహాలు అమ‌లు చేయాలో అన్నీ చేసి, అంతిమంగా రెండు పార్టీలు ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నాయి’ అని కాంగ్రెస్ పార్టీ సానుభూతిప‌రుడు ఒక‌రు చెప్పారు.

‘సామాన్య జ‌నాన్ని మోసం చేసేందుకు పైకి మాత్రం రెండు పార్టీలూ శత్రువుల్లా పోట్లాడుకుంటాయి. వీరు డ్రామాల్లో ఆరితేరిపోయారు. అవ‌స‌ర‌మైతే రేపు ఎప్పుడో లిక్క‌ర్ కేసులో క‌విత‌ను కూడా అరెస్టు చేసి మ‌ళ్లీ విడిచిపెడ‌తారు జ‌నాన్ని న‌మ్మించ‌డానికి’ అని రాజకీయ విశ్లేషకుడు ఒక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఫైర్‌ బ్రాండ్‌ ‘బండి’

నిజానికి బండి సంజ‌య్ చేతికి పార్టీ ప‌గ్గాలు ఇచ్చాక‌, తెలంగాణ‌లో బీజేపీలో ఒక ఊపు వ‌చ్చింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో బీఆరెస్‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌డ‌మేకాదు, గ‌తంలో ఎప్పుడూ గెల‌వ‌న‌న్ని కార్పోరేట‌ర్ల‌ను బీజేపీ గెలుచుకుంది. నిత్యం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో బండి సంజ‌య్ బీజేపీని, కార్య‌క‌ర్త‌లు, మ‌ద్ద‌తుదారులను లైవ్‌లో ఉంచుతూ వ‌చ్చారు.

పాత‌బ‌స్తీపై స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తామ‌న‌డం, లిక్క‌ర్ క‌విత‌ను అరెస్టు చేయ‌క ముద్దు పెట్టుకుంటారా? అని కామెంట్ చేయ‌డం, కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్మించిన స‌చివాల‌యంపై ఉన్న డోమ్స్ ఇస్లాం శైలిని త‌ల‌పిస్తున్నాయ‌ని, తాము అధికారంలోకి రాగానే కూల‌గొడ‌తామ‌ని.. మాటల తూటాలు పేల్చేవారు.

కానీ.. బండి నాయకత్వాన్ని వ్యతిరేకించే వారు సైతం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయారు. సీనియ‌ర్ల‌ను పట్టించుకోడ‌ని, ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నాడ‌ని, సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఈట‌ల రాజేంద‌ర్‌, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ వంటి నేత‌లు ఏకంగా అధిష్ఠానానికే ఫిర్యాదు చేశారు.

మరోవైపు బీఆరెస్‌తో తెరచాటు రహస్య బంధాలు కొనసాగించాలనుకుంటున్న బీజేపీ నాయకత్వానికి ఇంతటి ఫైర్‌బ్రాండ్‌ నాయకుడు ఉన్నా కూడా కష్టమే. అందుకే పార్టీలో గ్రూపుల పంచాయతీని, అటు బీఆరెస్‌కు సాఫ్ట్‌కార్నర్‌ ఉండే వ్యక్తిని ఎంచుకునే క్రమంలోనే కిషన్‌రెడ్డిని రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా నియమించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.