Assembly Meeting | తెలంగాణ శాసన సభ.. నిరవధిక వాయిదా
Assembly Meeting ఆర్టీసీ బిల్లులు సహా పలు బిల్లులకు ఆమోదం ఎన్నికల కోణంలో సీఎం కేసీఆర్ వరాలు విధాత: తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజుల పాటు కొనసాగి ఆదివారం నిరవధిక వాయిదాతో ముగిశాయి. నాలుగు రోజుల సమావేశాల్లో వర్షాలతో పాటు పలు ప్రజాసమస్యలపై చర్చలు సాగాయి. చివరి రోజు ఆదివారం తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కొనసాగింది. ఈ చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిస్తు రానున్న ఎన్నికల దృష్ట్యా పలు వరాలు […]

Assembly Meeting
- ఆర్టీసీ బిల్లులు సహా పలు బిల్లులకు ఆమోదం
- ఎన్నికల కోణంలో సీఎం కేసీఆర్ వరాలు
విధాత: తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజుల పాటు కొనసాగి ఆదివారం నిరవధిక వాయిదాతో ముగిశాయి. నాలుగు రోజుల సమావేశాల్లో వర్షాలతో పాటు పలు ప్రజాసమస్యలపై చర్చలు సాగాయి. చివరి రోజు ఆదివారం తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కొనసాగింది. ఈ చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిస్తు రానున్న ఎన్నికల దృష్ట్యా పలు వరాలు కురిపించారు.
సింగరేణి కార్మికులకు వేయి కోట్ల బోనస్, ఆసరా పింఛన్లను ఖచ్చితంగా పెంచుతామని, అయితే ఒకేసారి పెంచమన్నారు. ఉద్యోగులకు దేశం అశ్చర్యపోయేలా పే స్కేల్ పెంచుతామన్నారు. ఐఆర్ కూడా అతిత్వరలో ప్రకటిస్తామన్నారు. ఆర్ధిక వనరులు సమకూరగానే మళ్లీ ఉద్యోగుల జీతాలు పెంచుతామన్నారు.
ఇటీవలె దివ్యాంగులకు ఐదువేల పింఛన్, విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు, బీసీ, గిరిజన, మైనార్టీ బంధు, గృహలక్ష్మి, రైతు రుణమాఫీ, ఆరోగ్య శ్రీ ఐదులక్షలకు పెంపు వంటి పథకాలు ప్రకటించిన కేసీఆర్ అసెంబ్లీ వేదికగా మరిన్ని వరాలు ప్రకటించి సమావేశాలను ఎన్నికల లబ్ధి కోణంలో సద్వినియోగం చేసుకున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తమకిచ్చిన సమయంలో సాధ్యమైన మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రయత్నం చేశారు.
బిల్లులకు ఆమోదం
సీఎం కేసీఆర్ ప్రసంగం పిదప ఆర్టీసీ బిల్లును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సభలో ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. బాన్సువాడ, ఆలేరు మున్సిపాల్టీలలో పలు గ్రామాలను పంచాయతీరాజ్ శాఖలో కలుపుతు మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఈ శాసన సభ సమావేశాలలో మొత్తం 8 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. వాటిలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బిల్లు, దీ ప్యాక్టరీస్ ఆమెండ్‌మెంట్ బిల్, తెలంగాణ మైనార్టీ కమిషన్ సవరణ బిల్లు, ది తెలంగాణ గూడ్స్ ఆండ్ సర్వీసెస్ టాక్స్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులున్నాయి.
సమావేశాల ముగింపు సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2019జనవరి 18న తాను శాసన సభ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్నానని, ఎనిమిది సెషన్ల అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.