విధాత: అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం నంబర్ వన్‌గా నిలిచిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి పట్టణ కేంద్రంలో 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల ప్రజలతో పాటు తెలంగాణ సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని కోరుతూ బిఆర్ఎస్‌ను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో నిర్ణయాత్మక పాత్ర పోషించి పరిపాలనలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా పురోగమిస్తుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ, దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతుందన్నారు.
కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటి చైర్మెన్ ప్రదీప్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.