భూ హ‌క్కుల చిక్కులు వీడాలి..అప్పుడే తెలంగాణ అభివృద్ధి

లీఫ్ సంస్థ‌, గ్రామీణ న్యాయ పీఠం సంస్థ‌లు సంయుక్తంగా తెలంగాణ ప్ర‌జ‌ల భూమి మ్యానిఫెస్టో -2023ని విడుద‌ల చేశాయి

భూ హ‌క్కుల చిక్కులు వీడాలి..అప్పుడే తెలంగాణ అభివృద్ధి
  • తెలంగాణ ప్రజల భూమి మ్యానిఫెస్టో -2023
  • లీఫ్‌తో క‌లిసి విడుద‌ల చేసిన‌
  • గ్రామీణ న్యాయ పీఠం సంస్థ‌లు

విధాత‌: లీఫ్ సంస్థ‌, గ్రామీణ న్యాయ పీఠం సంస్థ‌లు సంయుక్తంగా తెలంగాణ ప్ర‌జ‌ల భూమి మ్యానిఫెస్టో -2023ని విడుద‌ల చేశాయి. గ‌డిచిన 5 ఏళ్లుగా న్యాయ‌గంట‌, భూ న్యాయ‌శిబిరాలు, భూమి కార‌వాన్ కార్య‌క్ర‌మాల ద్వారా రాష్ట్రంలో రైతుల నుంచి వ‌చ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ మ్యానిఫెస్టో విడుద‌ల చేసిన‌ట్లు ప్ర‌ముఖ న్యాయవాది, న‌ల్సార్ లా యూనివ‌ర్సిటీ అసోసియేట్ ప్రొఫెస‌ర్ భూమి సునీల్ తెలిపారు. ఈ మ్యానిఫెస్టోను రాజ‌కీయ పార్టీలు స్వీక‌రించి, అధికారంలోకి వ‌చ్చాక రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

తెలంగాణ ప్రజల భూమి మ్యానిఫెస్టో -2023 య‌థాత‌థంగా..

భూ హక్కుల చిక్కులు లేని తెలంగాణ సాకారం అయితేనే అభివృద్ధి చెందిన తెలంగాణ సాధ్య‌మౌతుంది. రైతు జీవితం మెరుగు పడుతుంది. కాబట్టి, భూమి హక్కుల కల్పన, వాటి రక్షణ, మెరుగైన భూపరిపాలన, భూమి రికార్డుల‌ నిర్వహణ ఏ ప్రభుత్వానికైనా ప్రధానమైన అంశాలు కావాలి. భూమి హక్కు ఒక రాజ్యాంగ హక్కు. ఐక్య రాజ్య సమితి గుర్తించిన మానవ హక్కు. సమతుల అభివృద్ధి లక్ష్యాలలో కూడా భూమి హక్కు కీలకం.

మానవ మనుగడ భూమితో ముడిపడి ఉంది. భూమి ఉంటేనే జీవితం. భూమితోనే అభివృద్ధి. దేశ స్థూల జాతీయ ఆదాయం పెరగాలన్న, న్యాయ స్థానాలలో వివాదాలు, నేరాలు తగ్గాలన్నా, రైతుల ఆదాయం పెరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా భూమి సమస్యను పరిష్కరించుకోవడం తప్పనిసరి. భూమి హద్దులు స్పష్టంగా, హక్కులు భద్రంగా ఉంచే వ్యవస్థను తేవడం అవసరం.

ప్రతి తెలంగాణ పల్లెలో వందల్లో భూమి సమస్యలు ఉన్నాయి. భూమి హద్దులకు స్పష్టత, హక్కులకు భద్రత లేదు. 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లక్షల ఎకరాల పట్టా భూమి నిషేధిత జాబితాలో తప్పుగా చేరింది. 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై ఎన్నో సమస్యలు. భూముల సర్వే జరిగి 80 ఏళ్ళైనా రీ సర్వే జరగలేదు. పట్టాదారు పాసుపుస్తకానికి ప్రభుత్వ హామీ లేదు. 10 లక్షల కు పైగా ఉన్న కౌలు దారులకు గుర్తింపు లేక రైతుగా ఏ సాయము పొందలేక పోతున్నారు. పోడు భూములకు పట్టాలు రాని గిరిజనులు వేల సంఖ్యలో ఉన్నారు.

తెలంగాణ లో భూమి సమస్యలు పరిష్కారం కావాలంటే –

1. భూదార్: భూములను రీ సర్వే చేసి, ప్రతి కమతానికి ‘భూదార్’ కార్డ్ ఇవ్వాలి. ఆ భూకమతానికి సంబంధించిన‌ సమగ్ర సమాచారం ఆ కార్డులో ఉండాలి.

2. ఒకే భూమి చట్టం: ఇప్పుడు అమలులో ఉన్న అన్ని భూమి చట్టాలను కలిపి ఒకే చట్టంగా చెయ్యాలి.

3. టైటిల్ గ్యారెంటీ: భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ తేవాలి.

4. సాదా బైనామా: ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని సవరించి, పెండింగులో ఉన్న సాదాబైనామా ద‌రఖాస్తులను పరిష్కరించి, పట్టాలు ఇవ్వాలి.

5. అసైన్డ్ భూములు: పి.ఓ.టి. చట్టాన్ని సవరించి అసైన్డ్ భూముల పై పేదలకు పూర్తి హక్కులు కల్పించాలి.

6. పోడు భూములు: పోడు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలు అందించాలి.

7. పేదలకు భూమి: భూమిలేని వ్యవసాయ ఆధారిత పేద కుటుంబాలకు భూమిని పంచడానికి పథ‌కాన్ని రూపొందించాలి. ఇంటి స్థలం లేని గ్రామీణ పేద కుటుంబాలకు నాలుగు గుంటల హోంస్టెడ్ ను ఇచ్చే పథ‌కాన్ని అమలు చెయ్యాలి. సీలింగ్ చట్టాన్ని అమలు చేసి, మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ పేద కుటుంబాలకు పునఃపంపిణీ చెయ్యాలి.

8. రెవెన్యూ ట్రిబ్యునల్: భూ వివాదాల పరిష్కారానికి జిల్లాకు ఒక భూమి ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలి. భూమి సమస్యలు ఉన్న పేద కుటుంబాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి. అందుకోసం పారాలీగల్ పథ‌కాన్ని అమలు చెయ్యాలి.

9. ధరణి: ధరణిలో ఉన్న తప్పులను గ్రామ స్థాయిలో రెవిన్యూ కోర్టులు నిర్వహించి సత్వరం పరిష్కరించాలి. కంప్యూటర్ల‌లో ఉన్న భూమి రికార్డుల వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలి. రికార్డులలో తప్పులు ఉంటే సత్వరమే సవరించే మార్గం ఉండాలి. కంప్యూటర్లో ఉన్న రికార్డుకు భద్రత ఉండాలి.

10. 22ఏ జాబితా: నిషేధిత ఆస్తుల జాబితాలో తప్పుగా నమోదైన పట్టా భూములను గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించి వెంటనే ఆ జాబితా నుండి తొల‌గించాలి.

11. భూ పరిపాలన: గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు భూపరిపాలన యంత్రాంగాన్ని పటిష్టపరచాలి. మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. అందుకోసం భూమి అకాడమీని ఏర్పాటు చెయ్యాలి.

12. భూమి కమిషన్: భూ పరిపాలన, భూమి చట్టాలు, విధానాల అధ్యయనం, మారుతున్న కాలమాన పరిస్థితులలో చెయ్యాల్సిన మార్పుచేర్పులను సూచించడానికి నిపుణులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కూడిన భూమి కమిషన్ ఏర్పాటు చెయ్యాలి.

13. భూ విధానాలు: భూమి విధానం, భూమి వినియోగ విధానాన్ని రూపొందించాలి.

14. భూసేకరణ: 2014 లో చేసిన భూసేకరణ చట్టాన్ని య‌థాత‌థంగా అమలు చెయ్యాలి.

15. కౌలు రైతులు: కౌలుదార్లను సాగుదార్లుగా గుర్తించి, వారికి రైతులుగా అందాల్సిన అన్ని మేళ్లు అందించాలి. అందుకోసం కొత్త కౌలు చట్టం రూపొందించాలి.