‘నమో’కు నాలుగు రాష్ట్రాల టెన్షన్‌

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 1984లో రెండు సీట్లతో మొదలైన ప్రస్థానం 2019 నాటికి 303 కు చేరింది. నరేంద్రమోడీ నేతృత్వంలో గత రికార్డులను తిరగరాయాలని ఆపార్టీ భావిస్తున్నది.

  • By: Somu    latest    Mar 20, 2024 11:47 AM IST
‘నమో’కు నాలుగు రాష్ట్రాల టెన్షన్‌

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 1984లో రెండు సీట్లతో మొదలైన ప్రస్థానం 2019 నాటికి 303 కు చేరింది. నరేంద్రమోడీ నేతృత్వంలో గత రికార్డులను తిరగరాయాలని ఆపార్టీ భావిస్తున్నది. అందుకే 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడానికి ఆపసోపాలు పడుతున్నది. అయితే కాషాయపార్టీ పెద్దలు అనుకుంటున్నట్టు 400 సీట్లు సాధించాలంటే నాలుగు రాష్ట్రాలు (ఉత్తరప్రదేశ్‌ (80, మహారాష్ట్ర (48), బీహార్‌ (40), కర్ణాటక (28)) కీలకం. ఈ రాష్ట్రాల్లో 196 స్థానాలున్నాయి.


ఈ నాలుగు రాష్ట్రాల్లో 2019లో ఎన్డీఏ యూపీలో 62, బీహార్‌లో 39, మహారాష్ట్రలో 41, కర్ణాటకలో 25 సీట్లు దక్కించుకున్నది. మొత్తం 167 స్థానాలు ఎన్డీఏ ఖాతాలో పడ్డాయి. ఇవి తిరిగి దక్కించుకుంటేనే కేంద్రంలో అధికారంతో పాటు 400 సీట్ల మార్కుకు అందుకోవడం సాధ్యమౌతుంది. కానీ ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ఇదే ఆపార్టీని కలవరపెడుతున్నది. అందుకే ఈ నాలుగు రాష్ట్రాల్లో నరేంద్రమోడీ ఛరిష్మానే నమ్ముకోకుండా ప్రాంతీయపార్టీలను ప్రసన్నం చేసుకుని ఎన్డీఏలో చేర్చుకున్నది.


యూపీలో ఎన్డీఏ హిందుత్వ నినాదం ..ఎస్పీ పీడీఏ నినాదం


ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో వేర్వేరు అంశాలు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూపీలో అయోధ్య రామాలయం నిర్మాణం, హిందుత్వవాదం ఓట్లను కురిపిస్తుందని బీజేపీ విశ్వసిస్తున్నది. ఇక్కడ కుల సమీకరణల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. ఇక్కడ అఖిలేశ్‌యాదవ్‌ నేతృత్వంలోని ఎస్పీ+కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది.


అఖిలేశ్‌ బీజేపీకిNDA సవాల్‌ విసిరేలా PDA(Pichade బీసీ,Dalits దళిత్‌, Alpsankhyak మైనార్టీలు) నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 20 శాతం దళిత ఓట్లతోపాటు, మైనార్టీ ఓటర్లు కీలకం. బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆపార్టీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. దీంతో దళిత ఓట్లు, బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్‌ కూటమిలతో పోటీ పడి బీజేపీ దక్కించుకోవాల్సి ఉంటుంది. అది అంత ఈజీ కాదు. మరోవైపు నిరుద్యోగ సమస్య ఈసారి ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి.


ఈ నేపథ్యంలో ఇక్కడ గత ఫలితాను పునావృతం చేయాలంటే ప్రాంతీయపార్టీలను కలుపుకోకుంటే నష్టమే అని ఆర్‌ఎల్‌డీతో పొత్తు కుదుర్చుకున్నది. దీనివల్ల జాట్‌ ఓట్లతో పాటు పశ్చిమ యూపీలో సత్తా చాటాలని అనుకుంటున్నది. అలాగే సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీని కలుపుకోవడం ద్వారా పూర్వాంచల్‌లో పార్టీ బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నది.


మహారాష్ట్రలో కాషాయ పార్టీ కష్టాలు


ఈసారి ఎన్నికల్లో మరాఠా కోటా, రైతుల సమస్యలే ప్రధానం కానున్నాయి. యూపీ తర్వాత అధిక స్థానాలున్నది ఈ రాష్ట్రంలోనే. మహారాష్ట్రలో 34 శాతం ఓబీసీలు, 28 శాతం మరాఠాలు గెలుపోటములు ప్రభావితం చేస్తారు. మరాఠా ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి 10 శాతం కోటాను అమలు చేయడానికి చట్టం చేసింది.


అయితే రాజ్యాంగ సవరణ చేయకుంటే అది న్యాయ సమీక్షకు నిలువదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి ఓబీసీలు, మరాఠాలు కాంగ్రెస్‌, ఎన్సీపీలకు సంప్రదాయ మద్దతుదారులు. శివసేన, ఎన్సీపీలను చీల్చి మహా అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


హిందుత్వవాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. అక్కడ గతంలో 41 సీట్లను గెలుచుకున్న బీజేపీ తిరిగి వాటిని నిలబెట్టుకోవడానికి ఏక్‌నాథ్‌ శిండే, అజిత్‌ పవార్‌లతోనే తన గమ్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల అశోక్‌చవాన్‌, మళింద్‌ దేవర వంటి నేతలను పార్టీలో చేర్చుకున్నది.


ఇక్కడితో ఆగకుండా ఉద్ధవ్‌ నేతృత్వంలో శివసేన ఓట్లను భారీగా చీల్చకుండా వారి కుటుంబసభ్యుడైన రాజ్‌ఠాక్రేను ముందుపెట్టి అడ్డుకోవాలనుకుంటున్నది. అందుకే రాజ్‌ఠాక్రే హుటాహుటిన హస్తినకు పిలిచి ఎన్డీఏలోకి ఆహ్వానించింది.


బీహార్‌లో బీజేపీని కలవరపెడుతున్న తేజస్వీ దూకుడు


40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఏకంగా 39 సీట్లను కాషాయపార్టీ తన ఖాతాలో వేసుకున్నది. తరుచూ కూటములను మార్చే నితీశ్‌, బీజేపీ ఒకవైపు ఆర్జేడీ, కాంగ్రెస్‌ తలపడనున్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రత్యేక హోదా, రామమందిరం, రిజర్వేషన్ల అంశాలు కీలకం కానున్నాయి. అధికారం కోసం తరుచూ కూటములు మారుస్తున్న నితీశ్‌ వల్ల ఎన్డీఏకు నష్టమని అక్కడ 17 చోట్ల బీజేపీ, 16 స్థానాల్లో జేడీయూ, ఎల్జేపీ (రాంవిలాస్‌) 5 , హిందుస్థానీ అవామ్‌ మోర్చా, ఉపేంద్ర కుష్‌యాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మంచ్‌ పార్టీలకు తలో టికెట్‌ కేటాయించింది.


బీజేపీ అవకాశవాద రాజకీయాలు ఎలా ఉంటాయని అనడానికి బీహార్‌ రాష్ట్రంలో సీట్ల పంపకమే పెద్ద ఉదాహరణ. నితీశ్‌కు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో నిలబడిన చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ 6 సీట్లు గెలుచుకున్నది. ఆపార్టీలో చీలిక తెచ్చింది. రాం విలాస్‌ పాశ్వాన్‌ సోదరుడు పశుపతి కుమార్‌ పరాస్‌ రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) పేరుతో 2021లో పార్టీని స్థాపించాడు. 5 గురు ఎంపీలు ఎన్డీఏతో జత కట్టారు. పశుపతికి కేంద్రమంత్రి ఇచ్చింది.


తాజాగా ఆపార్టీకి ప్రాధాన్యం ఇవ్వకుండా చిరాగ్‌ పార్టీ ఎల్జేపీకి 5 సీట్లు కేటాయించడంతో పశుపతి మంత్రిపదవికి రాజీనామా చేశారు. మోడీ, నితీశ్‌లకు చెక్‌ పెట్టి సత్తా చాటడానికి లాలూ రంగంలోకి దిగి వ్యూహ రచన చేస్తున్నారు. కుటుంబ రాజకీయాల గురించి మోడీ మాటలకు లాలు స్ట్రాంగ్‌ కౌంటర్‌లు ఇస్తున్నారు. ఈసారి అక్కడ ఎన్డీఏకు మహాఘట్‌బంధన్‌ (ఆర్జేడీ+కాంగ్రెస్‌ కూటమి) నుంచి గట్టి పోటీ ఎదురుకానున్నది.


కర్ణాటకలో కాంగ్రెస్‌ హవా


2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ ఖంగు తినిపించింది. బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ త్రిముఖ పోరులోనూ 224 సీట్లలో ఏకంగా 135 స్థానాలను గెలుచుకున్నది. ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ జేడీఎస్‌తో జట్టుకట్టింది. 28 స్థానాలున్న ఆ రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిందుత్వవాదం, మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రధాని సహా ఆపార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలకు అక్కడి ప్రజలు తిప్పికొట్టారు.


కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ రాష్ట్రంలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న యడ్యూరప్పను ఆపార్టీ పక్కనపెట్టింది. అలాగే ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి సదానంద గౌడ కూడా పార్టీ వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడ కేవలం మోడీ ఛరిష్మాతో గత సీట్లను నిలబెట్టుకోవడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


కుటుంబ పార్టీలంటూనే.. అవే పార్టీలతో పొత్తు


బీజేపీ ఆశిస్తున్న 400 సీట్లు ఈ నాలుగు రాష్ట్రాల్లో వచ్చే సీట్లపై ఆధారపడి ఉంటుందని స్పష్టమైంది. అలాగే బీజేపీ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న కుటుంబ రాజకీయాల విమర్శలకు ఈ నాలుగు రాష్ట్రాల్లో కుటుంబ పార్టీల నేతృత్వంలోని ప్రాంతీయపార్టీలతోనే పొత్తు పెట్టుకున్నది. అంటే మోడీ చెప్పే మాటలకు ఆచరణకు సంబంధం లేదని తెలుస్తోంది.


యూపీలో జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్‌డీ), కర్ణాటకలో కుమారస్వామి (జేడీఎస్‌), మహారాష్ట్రలో అజిత్‌పవార్‌ (ఎన్సీపీ), రాజ్‌ఠాక్రే (ఎంఎన్‌ఎస్‌), బీహార్‌లో చిరాగ్‌ పాశ్వాన్‌ (ఎల్జేపీ) నేతృత్వాల్లోని పార్టీలన్నీ కుటుంబపార్టీలే. అధికారం కోసం ఎవరితోనైనా, ఏపార్టీతోనైనా బీజేపీ అంటకాగుతుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అందుకే లాలు ప్రసాద్‌ యాదవ్‌ మోడీకి కుటుంబం లేదు కాబట్టి కుటుంబం గురించి మాట్లాడుతారని ఎద్దేవా చేశారు.


ఈ ప్రాంతీయపార్టీలకు ఆయా రాష్ట్రాల్లో ప్రజల ఆదరణ ఉన్నది. వాళ్ల మద్దతుతోనే చట్టసభలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో నరేంద్రమోడీ నాయకత్వంపై నమ్మకం లేకనే బీజేపీని నిలబెట్టుకోవడానికి ఆ పార్టీలతో పొత్తుపెట్టుకుంటున్నదిన్నది స్పష్టమౌతున్నది.