విధాత: నిన్నటిదాకా కుడి భుజంగా ఉన్నవాడు నేడు ఎదురు తిరిగి ప్రత్యర్థి వర్గంలో చేరితే! ఎదుటి పక్షంలో చేరటమే కాక ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ పడితే! పోటీ పడడమే కాదు.. ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిస్తే… వారి మధ్య సంబంధం ఎలా ఉంటుంది. పచ్చగడ్డి వేస్తే మండుతుంది. ఎలాంటి సందర్భంలోనైనా ఎదురెదురు పడటానికీ, ముఖం చూడటానికే ఇష్టపడరు. కానీ బెంగాల్‌లో దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. ఆ సన్నివేశం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది. బెంగాల్‌లోనే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది.
తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పార్టీలో, ప్రభుత్వంలో కుడిభుజంగా సువేందు అధికారి ఉండేవారు. మమత తర్వాత అతనే నెంబర్ టూగా చెలామణి అయ్యాడు. 2020 చివరలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఏం జరిగిందో ఏమో ఉన్నపలంగా సువేందు అధికారి మమతా బెనర్జీపై తిరుగుబాటు జెండా ఎగుర వేశాడు. ప్రత్యర్థి పార్టీ బీజేపీలో చేరాడు. మమతను సవాల్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో అగ్రభాగాన నిలవటమే కాదు, నందిగ్రాంలో మమతపైనే పోటీకి దిగాడు.
సువేందు తిరుగుబాటును ఎదుర్కోవటానికి మమతా బెనర్జీ తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. నష్ట నివారణకు మమత ఎంత శ్రమించినా చివరకు తీవ్ర నష్టమే జరిగింది. నందిగ్రాంలో సర్వశక్తులు ఒడ్డి పోరాడినా సువేందు చేతిలో మమతా బెనర్జీ ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా సువేందు ప్రభావాన్ని తగ్గించి పార్టీని గెలిపించటానికి చేసిన ప్రయత్నం ఫలించినా, స్వంత నియోజకవర్గం నందిగ్రాంలో మమతకు పరాభవమే మిగిలింది. సువేందు అధికారి బీజేపీ పక్షాన గెలిచి విపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టాడు.
ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతల మధ్య ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ దానికి భిన్నంగా మొన్న గత శుక్రవారం సీఎం చాంబర్‌లో సువేందు అధికారితో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. తేనీటి విందుకు తనను ఆహ్వానించినా తాను టీ తాగలేదని సువేందు చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఉన్నది. దాడులు, ప్రతిదాడులతో బెంగాల్ దద్దరిల్లుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది.
రాబోయే 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే మమతా బెనర్జీ, సువేందు ఒకటయ్యారని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నది. అంతే మరి… రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే మాట ఉట్టిగనే పుట్టలేదు కదా.