విమానం బాత్రూంలో చిక్కుకుపోయిన వ్యక్తి.. ప్రయాణమంతా అందులోనే!
విమానం బాత్రూం (Flight Loo) లో ఒక ప్రయాణికుడు గంటకు పైగా చిక్కుకుపోయిన ఘటన చోటుచేసుకుంది.

విమానం బాత్రూం (Flight Loo) లో ఒక ప్రయాణికుడు గంటకు పైగా చిక్కుకుపోయిన ఘటన స్పైస్ జెట్ (Spice Jet) విమానంలో చోటుచేసుకుంది. ముంబయి నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. బాత్రూంలోకి వెళ్లాడు. పని ముగించుకుని బయటకు వద్దామని ప్రయత్నించినా దాని తలుపు రాలేదు. విమానంలోని సిబ్బంది ప్రయత్నించినా ఆ తలుపు తెరుచుకోకపోవడంతో సుమారు 100 నిమిషాల పాటు ఆయన అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 2:00 గంటలకు ముంబయి విమానాశ్రయం నుంచి ఎస్‌జీ-268 విమానం గాల్లోకి లేచింది. నిజానికి ఇది సోమవారం రాత్రి 10:55కి బయలుదేరాల్సి ఉన్నప్పటికీ మూడు గంటలు ఆలస్యమైంది. విమానం బెంగళూరుకు దగ్గర్లోకి వచ్చే సమయానికి ఓ వ్యక్తి బాత్రూంకు వెళ్లడం.. అందులో ఇరుక్కుపోవడం జరిగాయి.
సిబ్బంది ఎంత ప్రయత్నించినా తలుపు రాకపోవడంతో ఇది తమ వల్ల అయ్యే పని కాదని.. ఇంజినీర్లు రావాల్సిందేనని భావించారు. అంటే విమానం ల్యాండ్ అయితేనే గానీ ఆ వ్యక్తి బయటకు రారని వారికి అర్థమయింది. ఒక చిన్న గది లాంటి ప్రదేశంలో సుమారు గంటన్నరపాటు ఉండటమంటే అది ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. ల్యాండింగ్ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం అవసరం కాగా.. టాయ్‌లెట్ రూంలో అది ఉండే అవకాశమే లేదు. దీంతో ప్రయాణికుడికి ధైర్యం చెప్పేందుకు సిబ్బంది ఒక లేఖ రాసి.. దానిని తలుపు కింద నుంచి బాత్రూం లోపలకు పంపించారు. అది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ‘సర్.. ఈ తలుపు తీయడానికి మేము అన్ని రకాలుగానూ ప్రయత్నించాం. కానీ ఫలితం లేదు. అయినా మీరు కంగారు పడాల్సిన పని లేదు. మనం మరి కొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవనున్నాం.
ఇంజినీర్లు వచ్చి మిమ్మల్ని బయటకు తెస్తారు. మీరు ప్రశాంతంగా కమోడ్ డోర్ వేసుకుని దాని మీద కూర్చోండి’ అని రాసి ఉంది. ఆఖరికి విమానం 3:42కి బెంగళూరులో ల్యాండ్ అవ్వగానే ఇంజినీర్లు ఆ తలుపును విరగ్గొట్టి ప్రయాణికుణ్ని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన వల్ల ఆయన అత్యంత భయానికి లోనయ్యారని.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన ఇంచుమించుగా ముంబయి నుంచి బెంగళూరు వరకు ఇరుకైన ఒక బాత్రూంలో ప్రయాణించి వచ్చినట్లు అయిందని బెంగళూరు విమానాశ్రయం అధికారి వ్యాఖ్యానించారు.