మండిపోతున్న బియ్యం ధరలు.. సామాన్యులు విలవిల!

ధరల పెరుగుదలతో ఎసరు పెట్టకుండానే బియ్యం కుతకుతమంటు ఉడికిపోతున్నాయి. గత నెల రోజులుగా బియ్యం ధర పెరుగుతూ వస్తున్నది.

  • Publish Date - January 3, 2024 / 04:01 AM IST

Rice Price | ధరల పెరుగుదలతో ఎసరు పెట్టకుండానే బియ్యం కుతకుతమంటు ఉడికిపోతున్నాయి. గత నెల రోజులుగా బియ్యం ధర పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా సన్నాలకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో మార్కెట్‌లో ధరలు భగ్గుమంటున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం 25 కిలోల బియ్యం బస్తా రూ.1700పైగా పలుకుతున్నది. క్వింటాల్‌కు రూ.7వేల వరకు చేరింది.


గతేడాది సన్నాలు క్వింటాల్‌కు రూ.3వేల నుంచి రూ.3500 వరకు పలికింది. పాతబియ్యం రూ.4500 వరకు పలికింది. ప్రస్తుతం ధర రూ.7వేల వరకు చేరింది. హెచ్‌ఎంటీ, బీపీటీ, సోనామసూరి తదితర రకాల బియ్యం మొన్నటి వరకు రూ.4500 నుంచి రూ.5వేల వరకు ధరల పలికింది. ప్రస్తుతం ఈ బియ్యం ధరలు రూ.6500 నుంచి రూ.7500 వరకు చేరాయి. ఏకంగా క్వింటాల్‌కు గతంలో కంటే రూ.1000 నుంచి రూ.1500 వరకు పెరిగింది.


ధరల పెరుగుదలకు కారణాలు ఏంటీ


నవంబర్‌ వరకు స్థిరంగా కొనసాగిన బియ్యం ధరలు డిసెంబర్‌ నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా డిసెంబర్‌ ఆఖరి వారం నుంచి బియ్యానికి భారీగా డిమాండ్‌ పెరిగింది. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా రైతులు వానాకాలం సీజన్‌లోనే సన్న రకం వడ్లను సాగు చేస్తుంటారు.


ఈ సీజన్‌లో అయితేనే పంటకు అవసరమైన నీరు ఉండడంతో సన్నాలు సాగు చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. నూక శాతం సైతం వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా సమయాల్లో దొడ్డు రకం ఎక్కువగా సాగు చేస్తుంటారు. గత సీజన్‌లో వరి సాగు చేసినా.. అది దొడ్డు రకాలే ఎక్కువగా సాగు చేశారు. సన్నాల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ఒక్కసారిగా మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.


తెలంగాణలో తగ్గిన సన్నాలు సాగు..


తెలంగాణ సన్నాల సాగు తక్కువగానే ఉంటుంది. ఎక్కువ శాతం రైతులు దొడ్డు రకాలైన 1010, 1001, 1061, ఐఆర్‌-64 తదితర రకాల వడ్లను సాగు చేస్తుంటారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎక్కువగా రైతులు దొడ్డు రకాలనే సాగు చేస్తారు. వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత తదితర కారణాలతో దొడ్డు రకాల సాగుకు మొగ్గు చూపుతుంటారు. సన్నాలు సాగు చేస్తే నీటి కొరత తలెత్తిన సందర్భాల్లో దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.


ఫలితంగా రైతులు సన్నాలపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మంలోనూ దాదాపు ఇదే పరిస్థితి, మిర్యాలగూడ, సూర్యాపేటతో పాటు పలు చోట్ల సన్నాలు పండించినా రైతులు సొంత అవసరాల కోసమే వినియోగించుకుంటారు. వానాకాలం సీజన్‌లో నిజామాబాద్‌ మినహా ఉత్తర తెలంగాణలో రైతులు తమ తిండి అవసరాలు, స్థానిక అవసరాలకు మాత్రమే సన్న రకాలను సాగు చేస్తూ.. మిగతా అంతా దొడ్డు రకాల వైపే మొగ్గు చూపుతారు.


అయితే, నిజామాబాద్‌, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రైతులు సన్నాలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ప్రస్తుతం సన్నాలను రైతులే బియ్యంగా మార్చి విక్రయిస్తుండగా.. మరికొందరు ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ సారి వానాకాలం సీజన్‌లో సాగర్‌ ఆయకట్టు కింద తక్కువ సన్నాల సాగు తగ్గింది. పలుచోట్ల వాతావరణ ప్రతికూల పరిస్థితులతో పంటకు తెగుళ్లు సోకి సైతం దిగుబడిపై ప్రభావం చూపినట్లు తెలుస్తున్నది.


తెలంగాణలో వానాకాలం సీజన్‌లో 99లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం 43 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. గత రబీలో 67 లక్షల మెట్రిక్‌ మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం వచ్చినా అదంతా మిల్లుల్లోనే నిల్వ ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


ఆంధ్రాలోనూ సాగు ఉన్నా.. భారీగా డిమాండ్‌


ఏపీలో రైతులు ఎక్కువగానే సన్నాలను సాగు చేస్తున్నారు. , ఉభయగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, నెల్లూరు తదితర జిల్లాల్లోనూ సన్నాల సాగు భారీగానే ఉంటుంది. సాగు చేసిన సన్నాలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎగుమతి చేస్తున్నారు. పలు దేశాల నుంచి సన్నాలకు డిమాండ్‌ ఉండడంతో ఎగుమతి చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో దిగుబడులు తగ్గడంతో వ్యాపారులు పోటీపడి ధాన్యం కొనుగోలు చేశారు.


ఏపీతో పాటు తెలంగాణ నుంచి బియ్యం ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంటాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని చెబుతున్నా మార్కెట్‌లో ధరలు మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే, కావాలని వ్యాపారులే బియ్యం ధరలు పెంచుకుంటూ పోతున్నారనే విమర్శలున్నాయి. మిల్లర్లు, డీలర్లు కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఇదిలా ఉండగా.. గత ఏడాదిలో దేశంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. మొదట సన్నాలపై నిషేధం విధించింది. ఆ తర్వాత ఉప్పుడు బియ్యం, బాస్మతీ బియ్యంపై ఎగుమతులపై ఆంక్షలు తీసుకువచ్చింది. ఆ తర్వాత ఆంక్షలు సడలించి ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం కల్పించింది.


భారత్‌ రైస్‌ను తీసుకొస్తున్న కేంద్రం..


దేశంలో బియ్యం ధరలు పెరుగుతూ పెరుగుతున్న నేపథ్యం కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలోనే బియ్యం ధరలను తగ్గించేందుకు రాయితీపై రూ.25కే ఇవ్వాలని నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో రూ.25 కే కిలో బియ్యాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే గోధుమ పిండి, ప‌ప్పు ధాన్యాల‌ను భార‌త్ ఆటా, భార‌త్ దాల్ పేరిట పేరుతో కేంద్రం అందిస్తున్నది. ఈ క్రమంలోనే భారత్‌ రైస్‌ పేరుతూ బియ్యం అందించేందుకు నిర్ణయించింది.


ఇందుకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, కేంద్రీయ భండార్ అవుట్‌లెట్ల ద్వారా రూ.25 కే కిలో బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. అయితే, ఈ బియ్యం విక్రయాలు ఎప్పుడు మొదలవుతాయన్నది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్య పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీలైనంత తర్వగా భారత్‌ రైస్‌ను అందుబాటులోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.