మూడు రాజధానులే కావాలి.. ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా!
విధాత: అమరావతి రాజధానిగా ఉండాలంటూ ఓ వైపు తెలుగుదేశం, దాని మద్దతుదారులు చేస్తున్న రైతు ఉద్యమం ఒక్కో జిల్లాను దాటుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇక ఉత్తరాంధ్రలోనూ మెల్లగా సెగ రేగుతోంది. తమ అస్థిత్వాన్ని వెక్కిరిస్తూ తమ ప్రాధాన్యాన్ని అపహాస్యం చేస్తూ విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తూ అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని దురాశ పేరాశతో రైతులు ఈ యాత్ర చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆభివృద్ధి మొత్తం అమరావతిలోనే పోగుపడి ఉండాలా.. వేరే ప్రాంతాలు అభివృద్ధి చెందవద్దా […]

విధాత: అమరావతి రాజధానిగా ఉండాలంటూ ఓ వైపు తెలుగుదేశం, దాని మద్దతుదారులు చేస్తున్న రైతు ఉద్యమం ఒక్కో జిల్లాను దాటుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇక ఉత్తరాంధ్రలోనూ మెల్లగా సెగ రేగుతోంది. తమ అస్థిత్వాన్ని వెక్కిరిస్తూ తమ ప్రాధాన్యాన్ని అపహాస్యం చేస్తూ విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తూ అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని దురాశ పేరాశతో రైతులు ఈ యాత్ర చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆభివృద్ధి మొత్తం అమరావతిలోనే పోగుపడి ఉండాలా.. వేరే ప్రాంతాలు అభివృద్ధి చెందవద్దా అనే ప్రశ్నలు లెవనెత్తుతున్నారు. ఈ క్రమంలోనే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఒకడుగు ముందుకు వేసి ఏకంగా తన పదవికి రాజీనామా చేసి నిప్పును రాజేశారు. తాను మూడు రాజధానులకే ఓటు వేస్తానని, అమరావతి మాత్రమే రాజధాని అంటే ఒప్పుకునేది లేదని ఆయన అంటున్నారు.

ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులు.. ఎమ్మెల్యేలకు ఏమాత్రం పౌరుషం, ఆత్మ గౌరవం ఉన్నా తమతో రావాలని, మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామాలు చేయాలని ఆయన రెచ్చగొడుతున్నారు. ఇదిలా ఉండగా మరో సీనియర్ మంత్రి, శ్రీకాకుళానికి చెందిన ధర్మాన ప్రసాదరావు కూడా ఇదేమాట అంటున్నారు.
మూడురాజధానులు ఉండాల్సిందేనని, వికేంద్రీకరణతో మాత్రమే అభివృద్ధి సాధ్యం అని అంటూ ఈ విషయంలో తాను పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు. దీంతో అమరావతి రైతులకు మద్దతు ప్రకటిస్తూ వస్తున్న టీడీపీ నేతలు ఇరుకున పడ్డారు. ఈ ప్రాంత అభివృద్ధి అవసరం లేదని, టీడీపీ అధిష్టానం కనుసన్నల్లో ఉంటే చాలని మీరు అనుకుంటున్నారా అన్న వైఎస్సార్సీపీ నాయకుల ప్రశ్నలకు టీడీపీ నుంచి సమాధానం కరువైంది.