ప్ర‌హ‌రీ గోడ‌పై 6 గంట‌లు హాయిగా నిద్రించిన పెద్ద పులి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

అట‌వీ ప్రాంతాల‌కు స‌మీపంలో ఉండే గ్రామాల్లోకి అడ‌వి జంతువులు రావ‌డం స‌హ‌జ‌మే. ఆ మాదిరిగానే ఓ పెద్ద పులి ఓ గ్రామంలోకి ప్ర‌వేశించింది.

ప్ర‌హ‌రీ గోడ‌పై 6 గంట‌లు హాయిగా నిద్రించిన పెద్ద పులి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

ల‌క్నో : అట‌వీ ప్రాంతాల‌కు స‌మీపంలో ఉండే గ్రామాల్లోకి అడ‌వి జంతువులు రావ‌డం స‌హ‌జ‌మే. ఆ మాదిరిగానే ఓ పెద్ద పులి ఓ గ్రామంలోకి ప్ర‌వేశించింది. ఆ గ్రామంలోకి ఎవ‌రికి హానీ క‌లిగించ‌కుండా, అక్క‌డున్న ఓ ప్ర‌హ‌రీ గోడ‌పై ఆరు గంట‌ల పాటు హాయిగా నిద్రించింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో సోమ‌వారం రాత్రి చోటు చేసుకోగా, దానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

యూపీలో ఫిలిబిత్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టుకు 20 కిలోమీట‌ర్ల దూరంలో అత్‌కోనా అనే గ్రామం ఉంది. టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టులోని ఓ పెద్ద పులి.. అత్‌కోనా గ్రామంలోకి సోమ‌వారం అర్ధ‌రాత్రి ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత ఓ ఇటుక గోడ ఎక్కి.. ఆ రాత్రంతా ఆరు గంట‌ల పాటు హాయిగా నిద్రించింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున పులిని గ‌మ‌నించిన స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. అట‌వీశాఖ అధికారులు అత్‌కోనా గ్రామానికి చేరుకునే లోపే జ‌నాలు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. పులిని చూసేందుకు ఎగ‌బ‌డ్డారు.

అట‌వీ శాఖ అధికారులు ఆ ఇటుక గోడ చుట్టూ భారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అనంత‌రం ఆ పులికి మ‌త్తు ఇచ్చారు. అది స్పృహ కోల్పోగానే, బంధించి టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌కు త‌ర‌లించారు. పెద్ద పులి అరుపుల‌కు స్థానికులు భ‌య‌ప‌డ్డారు.