హాఫ్ సెంచరీ తర్వాత గ్రౌండ్‌లో షర్ట్ పైకెత్తిన తెలుగు తేజం.. కారణం చెప్పి మనసులు గెలిచిన తెలుగోడు

టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ ప్రస్తుతం ఆసియా గేమ్స్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ టూర్‌లో టీ20 ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన తిలక్ వర్మ ఆ తర్వాత ఆసియా కప్‌లో అవకాశం దక్కించుకున్నాడు. అయితే తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఏషియన్ గేమ్స్‌లో ఇండియా తరపున ఆడుతున్నాడు.
ఏషియన్ గేమ్స్‌లో నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 10 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేసి అభిమానులని తీవ్రంగా నిరాశపరచిన తిలక్ బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా నాకౌట్ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీ బాదిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
అయితే అర్ధ సెంచరీ పూర్తైన తర్వాత తిలక్ వర్మ తన టీషర్ట్ పైకెత్తి ఒంటిపై ఉన్న టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. తిలక్ వర్మ చేసుకున్న ఈ సంబరాలు ప్రేక్షకులతో పాటు కామెంటేటర్లు, సహచర ఆటగాళ్లని కూడా ఆశ్చర్యపరచాయి. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై తిలక్ వర్మను వివరణ కోరగా.. తన తల్లికి ఇచ్చిన మాట కోసం అలా సంబరాలు చేసుకున్నానంటూ తెలియజేశాడు.
తాజాగా చేసిన ఈ అర్ధ సెంచరీని తన తల్లితో పాటు రోహిత్ శర్మ కూతురు సమైరాకు అంకితమిచ్చానని తెలిపాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో నేను ఆశించిన రీతిలో రాణించలేకపోవడంతో చాలా కష్టంగా కనిపించింది. అయితే ఈ సారి అర్ధ సెంచరీ చేసిన, జట్టుకి కావలసిన పరుగులు చేసిన కూడా శరీరంపై ఉన్న టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకుంటానని అమ్మకి మాట ఇచ్చానని అన్నాడు తిలక్.
ఇక నేను చేసిన అర్ధ సెంచరీ ..మా అమ్మతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ సమైరాకు అంకితం అంటూ ఈ హైదరాబాదీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తిలక్ వర్మ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. అయితే తిలక్ వర్మ తన పక్కటెముకల భాగంలో తల్లిదండ్రుల ఫొటోలను టాటుగా వేయించుకోవడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.
ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు చేయగా, భారత్ 9.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 97 పరగులు చేసి ఘన విజయం సాధించింది.