Train accident | మంటల్లో ఫలక్‌నుమా.. ఏడు బోగీలు దగ్ధం

Train accident | ప్రయాణికులందరూ సురక్షితం పగిడిపల్లి-బొమ్మాయి పల్లి మధ్య ఘటన షార్ట్‌ సర్యూట్‌తో చెలరేగిన మంటలు చార్జింగ్‌ పెట్టడం వల్లనా? సెగరెట్‌ వల్లనా? విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌- నడికుడి మార్గంలో పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బోగీలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణపాయానికి గురికాకుండా సురక్షితంగా బయపడటం అందరికీ ఊరటనిచ్చింది. ఓ ప్రయాణికుడు చార్జింగ్ పాయింట్ వద్ద సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి బోగీలకు వ్యాపించాయని […]

  • Publish Date - July 7, 2023 / 10:14 AM IST

Train accident |

  • ప్రయాణికులందరూ సురక్షితం
  • పగిడిపల్లి-బొమ్మాయి పల్లి మధ్య ఘటన
  • షార్ట్‌ సర్యూట్‌తో చెలరేగిన మంటలు
  • చార్జింగ్‌ పెట్టడం వల్లనా? సెగరెట్‌ వల్లనా?

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌- నడికుడి మార్గంలో పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బోగీలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణపాయానికి గురికాకుండా సురక్షితంగా బయపడటం అందరికీ ఊరటనిచ్చింది. ఓ ప్రయాణికుడు చార్జింగ్ పాయింట్ వద్ద సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి బోగీలకు వ్యాపించాయని కొందరు, సెల్‌ఫోన్ చార్జింగ్ సమయంలో షార్ట్ సర్కూట్‌తో మంటలు చెలరేగాయని మరికొందరు చెబుతున్నారు.

ఎస్‌ 4లో చెలరేగిన మంటలు

ముందుగా ఎస్ 4బోగీలో మంటలు చెలరేగి, ఎస్ 2, 3, 4, 5, 6, 7 బోగీలకు వ్యాపించడంతో ఆయా బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. మంటలు అంటుకోగానే పలాసకు చెందిన ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో ప్రయాణీకులంతా సురక్షితంగా రైలు బోగీల నుండి బయటపడ్డారు. పగటి పూట ప్రమాదం జరుగడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ప్రయాణికులు మరో గంటలోపునే గమ్యస్థానానికి చేరుకోనుండగా ఘటన చోసుకుంది.

పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఘటన

ఫలక్నుమా ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి సికింద్రాబాద్‌కు వెళుతుండగా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి గ్రామాల మధ్య ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మంటల తీవ్రతకు ఐదు బోగీలు పూర్తిగా, రెండు పాక్షికంగా దగ్ధమయ్యాయి. బోగీలు దగ్ధమైన పరిస్థితి చూస్తే పెద్ద ప్రమాదం నుండి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడిన విషయం అవగతమవుతుంది.

చైన్ లాగడంతోనే రైలులో వ్యాపించిన మంటల నుంచి ప్రయాణికులు క్షేమంగా బయపడ్డారని ప్రత్యక్ష సాక్షుల తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే, అగ్నిమాపక శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అగ్నిమాపక సిబ్బంంది ఫైర్ ఇంజన్ల సహాయంతో రెండున్నర గంటల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటన స్థలాన్ని రైల్వే జీఎం సహా ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, రైల్వే పోలీసు, యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పత్తి సహా జిల్లా యంత్రాంగం చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫలక్‌నామా ఫ్రయాణికులను అదే రైలు మిగిలిన బోగీలలో , ఆర్టీసీ బస్సులలో మరికొందరిని తమ గమ్యస్థానాలకు చేర్చారు.

ప్రమాదమా.. విద్రోహమా

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ప్రమావశాత్తు జరిగిందా లేక విద్రోహ కుట్ర కారణామా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ 4 బోగీలో మంటలు చెలరేగడానికి సిగరెట్ కాల్చడమా లేక సెల్ ఫోన్ చార్జింగ్‌తో షార్ట్‌సర్క్యూట్‌ అయిందా? అన్నదానపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చార్జింగ్‌ పాయింట్ వద్ద సిగరెట్ కాల్చిన వ్యక్తిని తోటి ప్రయాణికులు వారించినా వినిపించుకోలేదని చెబుతున్నారు.

విచారణకు ఆదేశం: ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జీఎం

రైలు ప్ర‌మాదంపై ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జీఎం ఏకే జైన్ స్పందించారు. విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌యాణికుల‌ను సికింద్రాబాద్ స్టేష‌న్‌కు త‌ర‌లిస్తున్నామ‌ని చెప్పారు. ట్రాక్ పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంద‌ని తెలిపారు.

ప్ర‌యాణికులు ఆందోళ‌న‌

ఈ ప్ర‌మాదం నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. త‌మ సామాగ్రి అంతా కాలి బూడిదైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉద్యోగం కోసం హైద‌రాబాద్‌కు వెళ్తున్నాన‌ని, త‌న స‌ర్టిఫికెట్ల‌న్నీ రైల్లోని ఉన్నాయ‌ని, అవి కాలిపోయాయ‌ని ఓ యువ‌తి క‌న్నీరుమున్నీరైంది. ప్ర‌యాణికులంద‌రినీ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ఆరు బస్సుల్లో సికింద్రాబాద్‌కు త‌ర‌లించారు. మ‌రికొంత మంది ప్ర‌యాణికుల‌ను లోక‌మాన్య తిల‌క్ రైలు ద్వారా త‌ర‌లిస్తున్నారు.

రెండు రైళ్లు ర‌ద్దు.. నాలుగు దారి మ‌ళ్లింపు

ఈ ప్ర‌మాదం కార‌ణంగా సికింద్రాబాద్ – రేప‌ల్లె, సికింద్రాబాద్ – మ‌న్మాడ్ రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారులు వెల్ల‌డించారు. సికింద్రాబాద్‌ – తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్‌(వయా కాజీపేట, విజయవాడ), సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (వయా కాజీపేట, విజయవాడ) గుంటూరు వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా మళ్లించారు.

ఈ ప్ర‌మాదానికి, ఇటీవ‌ల వ‌చ్చిన లేఖ‌కు సంబంధం ఉందా..?

ఫ‌ల‌క్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంట‌ల ఘ‌ట‌న‌పై సీపీఆర్‌వో రాకేశ్ స్పందించారు. పూర్తి స్థాయి అనంత‌ర‌మే ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను చెప్ప‌గ‌ల‌మ‌ని తెలిపారు. తాజా ప్ర‌మాదానికి, ఇటీవ‌ల వ‌చ్చిన బెదిరింపు లేఖ‌కు సంబంధం లేద‌ని తెలిపారు. అయితే బెదిరింపు లేఖ‌పై విచార‌ణ కొన‌సాగుతుంద‌న్నారు.

మ‌రో వారం రోజుల్లో ఒడిశా త‌ర‌హా ఘోర రైలు ప్ర‌మాదం జ‌ర‌గ‌బోతోందంటూ బీహెచ్ఈఎల్‌కు చెందిన‌ వ్య‌క్తి సౌత్ సెంట్ర‌ల్ రైల్వేకు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. అత‌న్ని గోపాల‌పురం పోలీసులు అరెస్టు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. హైద‌రాబాద్ – ఢిల్లీ మార్గంలోనే ఈ ఘ‌ట‌న జ‌రుగుతుంద‌ని స‌ద‌రు వ్య‌క్తి ఆ లేఖ‌లో పేర్కొన్న విష‌యం విదిత‌మే