Maharashtra
ముంబై: మహారాష్ట్రలో ఉభయుల ప్రేమ కాస్తా.. ముక్కోణపు ప్రేమగా మారింది. ఇప్పటి వరకూ బీజేపీ, శివసేన శిండే వర్గం కలిసి అధికారంలో ఉండగా.. తాజాగా వారి మధ్యకు ఎన్సీపీ వచ్చి చేరడంతో కాపురంలో కలహాలు చెలరేగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ చీలిక వెనుక ఒక్క బీజేపీనే ఉన్నదా? లేక శిండే వర్గాన్ని సంప్రదించి ఎన్సీపీ చీలిక గ్రూపును ప్రభుత్వంలో చేర్చుకున్నారా? బలవంతంగా ఒప్పించారా? అన్నది స్పష్టం కావాల్సి ఉన్నది.
అయితే.. ఎన్సీపీ చేరికను శిండే వర్గం జీర్ణించుకోలేక పోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘బీజేపీ, శివసేన, ఎన్సీపీ మధ్య కుదిరిన ఒప్పందం వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. రానున్న రోజల్లో ఘర్షణ వాతావరణం పెరుగుతుందని, ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని కొద్ది నెలల క్రితం ఉన్న అభిప్రాయం’ అని ఓ శివసేన ఎమ్మెల్యే ఒక వార్తా సంస్థకు చెప్పినట్టు తెలుస్తున్నది.
ఎన్సీపీలో చీలిక తెచ్చి, దానిని ప్రభుత్వంలో భాగస్వామిని చేయడం రాష్ట్ర ఓటర్లనే కాదు.. శిండే వర్గంలోనూ నివ్వెర పర్చిందని చెబుతున్నారు. ఇప్పటికే తమ నాయకుడికి అధికారం కొనసాగుతుందా లేదా అన్న సందిగ్ధంలో ఉన్న శిండే వర్గాన్ని ఈ పరిస్థితి మరింత గందరగోళంలో నెట్టిందని అంటున్నారు.
గతేడాది జూన్‌లో శివసేన నుంచి 40 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి.. ఉద్ధవ్ ఠాక్రె నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీకి మద్దతు ఉపసంహరించారు. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఆ రోజు శిండే వర్గం చెప్పిన కారణాల్లో ఒకటి.. శివసేనను రాజకీయంగా అంతమొందించేందుకు ఎన్సీపీ ప్రయత్నిస్తున్నదనేది. రెండో అంశం.. ఇతర పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు అందబోవని అజిత్‌పవార్ బెదిరిస్తున్నారనేది రెండోది.
సహజంగానే అదే అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిక వర్గం ఇప్పుడు వచ్చి తన ప్రభుత్వంలో తిష్ఠవేయడంతో శిండే వర్గం గుర్రుగా ఉన్నదని చెబుతున్నారు. అజిత్‌పవార్ తిరుగుబాటు ఎపిసోడ్ తర్వాత శిండేవర్గం నేతలు నోరు మెదపడం లేదు. చాలా కొద్ది మంది మాత్రమే బయటకు మాట్లాడుతున్నారు.
వారు కూడా అసంతృప్తి ధోరణితోనే కనిపిస్తున్నారు. శిండేవర్గంలో ఈ వాతావరణం పెరుగుతుండటంతో వారిని బుజ్జగించేందుకు అటు శిండేతోపాటు.. బీజేపీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఎన్సీపీ రాకతో తమ గుత్తాధిపత్యం పోతుందని, బీజేపీ మాత్రమే అధికారం చెలాయిస్తుందని శిండే వర్గం అనుమానిస్తున్నదని చెబుతున్నారు. దీనితోపాటు.. మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని గతంలో చీలిక వర్గం నేతలకు శిండే హామీ ఇచ్చి ఉన్నారని, ఇప్పుడు ఎన్సీపీ రాకతో వారికి అవకాశాలు ఉండవేమోనని ఆందోళన చెందుతున్నారు.
తాము శివసేనలో ఉన్నప్పుడు ఎవరితోనైతే ఢీకొన్నామో అదే నేతలను ఇప్పుడు కలుపుకొని పోవాల్సి రావడం కూడా ఇబ్బందికర అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయంలో ముక్కోణ స్నేహం కారణంగా తాము పోటీ చేసే సీట్ల సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళన కూడా శిండే వర్గంలో ఉన్నదని భావిస్తున్నారు.
మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో అడ్డంకులు సృష్టించినట్టే.. ఈ ప్రభుత్వంలోనూ అజిత్‌పవార్ అదే తరహా వ్యవహారాలకు పాల్పడుతారన్న భయం కూడా శిండే వర్గాన్ని వెంటాడుతున్నదని పరిశీలకులు పేర్కొంటున్నారు. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత శిండే వర్గంలోని ఇతర నేతలు పెద్దగా స్పందించకున్నా.. వారి ఆందోళన ఆ పార్టీ సీనియర్ నేత మాటల్లో వెల్లడైంది. తమ పార్టీలో కొందరు ఎమ్మెల్యలు ఈ పరిణామంతో నిరుత్సాహానికి గుయ్యారని సీనియర్ నేత సంజయ్ శిర్షత్ చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వానికి మెజార్టీయే ఉన్నది.ఈ సమయంలో ఎన్సీపీని ఎందుకు ప్రభుత్వంలోకి తీసుకోవాలి? అని ఆయన మీడియా సమావేశంలో ప్రశ్నించడం గమనార్హం. శివసేన, బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు అనుకోకుండా మూడో పక్షం వచ్చి చేరింది.
కొత్తగా ఎవరు వచ్చినా వారికీ వాటా పంచాల్సి ఉంటుంది. ఆ వాటా దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి, ఏక్‌నాథ్ శిండే నుంచే అవుతుంది. మేం ఇప్పటికే కొన్ని మంత్రిత్వ శాఖలు కోల్పోయినందుకు కొందరు ఎమ్మెల్యేలు బాధతో ఉన్నారు. అది సహజం. అందుకే వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు’ అని శిర్షత్ చెప్పారు.
బుధవారం శిండే తన నాగపూర్ పర్యటనను మధ్యలోనే కుదించుకుని, ముంబైకి వచ్చి తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ సమావేశంలో చాలా మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని, కొందరి మధ్య వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నాయని సమాచారం. మరి ఈ ముక్కోణపు ప్రేమతో శిండే సంసారం రానున్న రోజుల్లో ఎలా సాగుతుందనేది వేచి చూడాల్సిందే.