TS Politics | పార్టీల సంక్షేమ మంత్రం..జనాకర్షణ పథకాలతో దూకుడు

TS Politics విధాత: తెలంగాణ ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న అధికార BRS, ప్రతిపక్ష కాంగ్రెస్, BJPలు జనాకర్షణ పథకాల ప్రకటనలో పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. అధికార BRS ఇప్పటికే అమలు చేస్తున్న, ప్రకటించిన సంక్షేమ పథకాలకు మరిన్ని మెరుగులు జోడిస్తూ పథకాల లబ్ధిదారుల ఓట్లకు గాలం వేస్తుంది. ప్రతిపక్షాలు సైతం తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికార పక్షం పథకాల కంటే తమ పథకాలు మరింత ఆకర్షణీయంగా ఉండేలా కసరత్తు చేస్తున్నాయి. జనాకర్షణ ఎత్తుగడలలో చాణుక్యడని పేరొందిన CM KCR […]

  • By: krs    latest    Jul 24, 2023 1:15 AM IST
TS Politics | పార్టీల సంక్షేమ మంత్రం..జనాకర్షణ పథకాలతో దూకుడు

TS Politics

విధాత: తెలంగాణ ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న అధికార BRS, ప్రతిపక్ష కాంగ్రెస్, BJPలు జనాకర్షణ పథకాల ప్రకటనలో పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. అధికార BRS ఇప్పటికే అమలు చేస్తున్న, ప్రకటించిన సంక్షేమ పథకాలకు మరిన్ని మెరుగులు జోడిస్తూ పథకాల లబ్ధిదారుల ఓట్లకు గాలం వేస్తుంది. ప్రతిపక్షాలు సైతం తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికార పక్షం పథకాల కంటే తమ పథకాలు మరింత ఆకర్షణీయంగా ఉండేలా కసరత్తు చేస్తున్నాయి. జనాకర్షణ ఎత్తుగడలలో చాణుక్యడని పేరొందిన CM KCR ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పెండింగ్ లో ఉన్న హామీల అమలులో జోరు పెంచారు. ఓట్ల సాధనకు అన్ని వర్గాల వారికి గాలం వేసేలా ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇటీవల బీసీ బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి, పోడు పట్టాల పంపిణీ పథకాలు ఉన్నాయి.

ఇప్పుడు మరికొన్ని వాటికి జోడించారు. తాజాగా ఆరోగ్యశ్రీ పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచారు. దివ్యాంగులకు 3016 రూపాయలు ఉన్న పింఛన్‌ను వేయి పెంచి, 4016గా చేసి 5.20లక్షల దివ్యాంగుల ఓట్లు చేజారి పోకుండా జాగ్రత్త పడ్డారు. దివ్యాంగుల కోసం తన ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 10,310 కోట్లను ఖర్చు చేసినట్లుగా చెప్పుకున్నారు. మైనార్టీల లక్ష సాయం పథకంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకే కాకుండా సిక్కులు బౌద్ధులు జైనులు పార్శీలకు కూడా సాయం చేస్తున్నారు. మైనార్టీలకు గడచిన తొమ్మిదేళ్లలో 8,581 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇదే క్రమంలో ఉద్యోగుల పీఆర్సీని కూడా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ వాటర్ బోర్డులో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం PRCని ప్రకటించి 4,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం కల్పించడం మరో విశేషం. ఈ నిర్ణయంతో 2055 మంది రెవెన్యూ ఉద్యోగులకు మేలు జరగనుంది. ఇంకోవైపు పెండింగ్‌లో ఉన్న VRAల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.

వారిని మున్సిపల్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలలో సర్దుబాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు కల్పించాలని ఆదేశించారు. 61 ఏళ్లు పైబడిన వారి, సర్వీస్ లో మరణించిన వారి వారసులకు కారుణ్య నియామకాల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఎప్పటినుండో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల డైట్ చార్జీలు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. మూడు నుండి ఏడవ తరగతి విద్యార్థుల డైట్ చార్జీలను 950 నుండి 1200 కు, 8 నుండి 10 తరగతి వారికి 1100 నుండి 1400కు, 11 నుండి పీజీ వరకు 1500 నుండి 1875 రూపాయలకు పెంచారు. ఇదే క్రమంలో రైతుబంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, KCR వంటి పథకాలకు పెండింగ్ నిధులు ఇచ్చేందుకు బడ్జెట్ సర్దుబాటుకు సైతం CM KCR కసరత్తు చేస్తున్నారు. అన్నింటికి మించి రైతు రుణమాఫీపై విపక్షాల నుండి ఎదురవుతున్న సవాళ్లను చెక్ పెట్టేందుకు లక్ష రుణమాఫీ హామీ అమలును కూడా ఎన్నికల ముందు పూర్తి చేసే యోచన చేస్తున్నారని పార్టీ వర్గాల అంచనా. సీఎం మది నుండి మునుముందు మరిన్ని కొత్త పథకాలు పుట్టుకరావచ్చని బీఆరెస్ కేడర్ చెబుతుంది.

ప్రతిపక్షాలదీ సంక్షేమ మంత్రమే

ఎన్నికలలో గెలుపు వ్యూహాలలో సంక్షేమ పథకాలదే పెద్ద పాత్ర కావడంతో అధికార BRSకు ధీటుగా కాంగ్రెస్‌, BJPలు కూడా జనాకర్షక పథకాలను సిద్ధం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు వేల పింఛన్ పథకం, పేదల ఇంటికి ఐదులక్షల సాయం, రెండు లక్షల రైతురుణమాఫీ, 500లకు సిలిండర్‌, కౌలు రైతులకు 15వేల పెట్టుబడి సాయం, ఉపాధి హామీ కూలీలకు 12వేల సాయం, తెలంగాణ అమరులకు 25వేల పింఛన్‌, 4వేల నిరుద్యోగ భృతి, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు 10లక్షల వడ్డీ లేని రుణాలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించగా, SC, ST, BC, మైనార్టీ, మహిళా డిక్లరేషన్‌లలో ఆ వర్గాలను ఆకట్టుకునే పథకాలు ప్రకటించనుంది.

BJP మ్యానిఫెస్టో, ఎన్నికల హామీలపై జాప్యం కొనసాగుతుండగా, కేంద్ర ప్రభుత్వ పథకాలకు అనుసంధానంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల విషయమై ఆ పార్టీ తీవ్ర కసరత్తునే సాగిస్తుంది. BRS, కాంగ్రెస్‌కు ధీటుగా తమ ఎన్నికల హామీలుంటాయని కమలనాథులు చెబుతున్నారు. ఏది ఏమైన ఎన్నికలలో ఓట్లు రాబట్టే సాధనాలుగా సంక్షేమ పథకాలు, ఉచిత పథకాల చుట్టే పార్టీలు పరిభ్రమిస్తుండగా, ఎన్నికల నాటికి ఇంకేన్ని కొత్త పథకాలను పార్టీలు తెరపైకి తెస్తాయోనంటు జనం చర్చించుకుంటున్నారు.