TS Politics | BRSపై వ్యతిరేకత.. కాంగ్రెస్‌కు కలిసొస్తుందా!

TS Politics సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడ్డుకాలం ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలపై భూదందాల ఆరోపణలు నియోజకవర్గం సమస్యలు పట్టని వైనం స్వంత ప్రయోజనం కోసం ఆరాటం విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆరెస్‌ పార్టీ కి ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారం బలంగా వినిపిస్తుంది. పార్టీ పై వ్యతిరేకత కంటే పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ బీఆరెస్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతనే ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యే ల భూదందాల ఆరోపణలు తీవ్రంగా […]

  • Publish Date - August 6, 2023 / 12:51 AM IST

TS Politics

  • సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడ్డుకాలం
  • ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలపై భూదందాల ఆరోపణలు
  • నియోజకవర్గం సమస్యలు పట్టని వైనం
  • స్వంత ప్రయోజనం కోసం ఆరాటం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆరెస్‌ పార్టీ కి ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారం బలంగా వినిపిస్తుంది. పార్టీ పై వ్యతిరేకత కంటే పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ బీఆరెస్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతనే ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యే ల భూదందాల ఆరోపణలు తీవ్రంగా ఉండడం.. మరి కొందరి నోటిదురుసు.. గ్రామాల్లో ప్రర్యటించక సమస్యలు గాలికి వదిలేయడం..

దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులైన వారికి ఇవ్వక పోవడం.. కాంట్రాక్టు పనులుల్లో కమీషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే చిట్టా బారెడుగా సాగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందివ్వడంలో తమ చేతి వాటం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో కార్యకర్తలను కూడా పట్టించు కోవడం లేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.

ఒక్కో నియోజకవర్గం ఎమ్మెల్యే ల తీరు పరిశీలిస్తే..

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో

ఈ నియోజకవర్గం లో బీఆరెస్‌ పార్టీ బలంగా ఉన్నా నేతల వ్యవహార శైలి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.ఇక్కడి బీఆరెస్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటితో గెలుపొందారు. ఇక్కడి నుంచిపోటీ చేసిన మహాకూటమి అభ్యర్థికి అప్పట్లో నియోజకవర్గంలో నెలకొన్న వ్యతిరేకత మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కలిసిరావడంతో భారీ మెజారిటీ సాధించారు. ప్రస్తుత పరిస్థితి భట్టి చూస్తే శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ కేసు ఒకటయితే, భూదందాల ఆరోపణలు చాలా ఉన్నాయి. గతంలో మైనార్టీ ఓట్ల శాతం అధికంగా బీఆరెస్‌ వైపే ఉండడం శ్రీనివాస్ గౌడ్ కు అ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పడ్డాయి. దీంతో ఆయన భారీ మెజారిటీతో విజయం పొందారు.

ప్రస్తుతం పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న శ్రీనివాస్ గౌడ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళతారో నని ఆ పార్టీ నేతలే అంటున్నారు. మంత్రి పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మార్చుకుంటుందా లేదా గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదం మళ్ళీ చేస్తుందా అన్నది ఆసక్తి రేపుతుంది.

నారాయణ పేట నియోజకవర్గంలో

ఇక్కడి బీఆరెస్‌ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పై స్వంత పార్టీ నాయకులే గుర్రుగా ఉన్నారు. ఆయన నియోజకవర్గం లో పెద్దగా తిరిగిన దాఖలాలు లేవు. కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు నిందలు మూట కట్టుకున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు ఆయనను కలవాలంటే గగనమే. ఎమ్మెల్యే రాజరికం పోకడతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎమ్మెల్యే తీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.

మక్తల్ నియోజకవర్గంలో

ఇక్కడి బీఆరెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ ఆ పార్టీ కార్యకర్తలకే నచ్చడం లేదు .నియోజకవర్గంలో ఈయన నియంత్రత్వ ధోరణితో జనాలకు దూరమయ్యారు. నియోజకవర్గం చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

దేవరకద్ర నియోజకవర్గంలో

ఇక్కడ బీఆరెస్ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు. నియోజకవర్గం లో ఎప్పుడు తిరుగుతూ ప్రజల మధ్యలో ఉంటారు. చిన్న సంఘటన జరిగినా అక్కడకు చేరుకుంటారు. కానీ ఈయన పై కమీషన్ల ఆరోపణలు ఉన్నాయి. పాలమూరు.. రంగారెడ్డి ఎత్తి పోతల పథకం ప్రాజెక్టు లో భాగంగా నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్ నిర్మాణంలో నల్ల మట్టి తరలింపులో ఎమ్మెల్యేకు భారీ గా కమీషన్ లు ముట్టాయనే ఆరోపణలు ఎదుర్కోoటున్నారు.ఇదే అంశం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కు మైనస్ గా మారింది.
.
జడ్చర్ల నియోజకవర్గంలోవ

బీఆరెస్‌ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ఎదురు లేని నేతగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే కు రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా పేరుంది. నియోజకవర్గం లో ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు.ఈ నియోజకవర్గం లో నేటికీ తిరుగు లేని నేతగా బీఆరెస్‌లో ఉన్నారు. ఈయనను ఎదుర్కోవాలంటే ఇతర పార్టీ లకు కొంచం కష్టం అని చెప్పవచ్చు.

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో
బీఆరెస్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈ నియోజకవర్గం లో తిరుగులేని నేత గా ఎదిగారు. నియోజకవర్గంలో స్వచ్చంద కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందారు. ఉచితంగా సామూహిక వివాహాలు చేయించడం వంటి కార్యక్రమాలు ఆయనకు గుర్తింపు ను తెచ్చిపెట్టాయి. ఇక్కడ కాంగ్రెస్ నేతలు నాగం జనార్దన్ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ఒక్కతాటి పైకి వస్తే మర్రి ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

వనపర్తి నియోజకవర్గంలో
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిథ్యo వహిస్తున్నారు. ఇక్కడ కూడా మంత్రి పై భూ ఆరోపణలు ఉన్నాయి. కృష్ణానది ని అనుకుని ఉన్న భూమిని ఆక్రమించారనే ఆరోపణలు తీవ్రoగా ఉన్నాయి. ఈ భూ దందా ఆరోపణలు ఆయన రాజకీయ రంగం పై ప్రభావం చూపబోతోంది.

గద్వాల నియోజకవర్గంలో

ఇక్కడి బీఆరెస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకం ఉంది. అదే పార్టీ నుంచి ఉన్న జడ్పీ చైర్ పర్సన్ సరిత ఇటీవల కాంగ్రెస్ పార్టీ లో చేరింది. ఎమ్మెల్యే తీరును ఆమె ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుంది.

మొదటి నుంచి ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆమె చివరకు పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరింది. దీంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గం లో కొంత పట్టు కోల్పోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు సరిత కృషి చేస్తున్నారు. కృష్ణ మోహన్‌రెడ్డి ఇక్కడ బీజేపీ నేత డీకె అరుణను కూడాఎదుర్కోవాల్సివుంది.

అలంపూర్ నియోజకవర్గంలో
ఈ నియోజకవర్గం బీఆరెస్‌ ఎమ్మెల్యే విఎం అబ్రహం ఉన్నా లేనట్లే అని ఆ పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు. ప్రజలను పట్టించుకోరు, అభివృద్ధి పై దృష్టి పెట్టరు, నియోజకవర్గంలో తిరగరు అనే అపవాదు మూటగట్టుకున్నారు. ఈయనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వచ్చేది కష్టమే అని ఇక్కడి ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో బీఆరెస్‌ కూడా బలమైన నేతకోసం వెతుకుతుంది.

అచ్చంపేట నియోజకవర్గంలో
ఇక్కడి బీఆరెస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై లైంగిక ఆరోపణలు, నోటి దురుసు, అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోకపోవడం, ఎప్పుడూ దురుసుగా వ్యవహరిస్తూ వార్తల్లోకి ఎక్కడం వంటివి మైనస్ అయ్యాయి. ఆయన దురుసుతనం కొన్ని సార్లు పార్టీ కి చెందిన మంత్రికే చికాకు పుట్టిoచింది. గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించిన సమావేశం గువ్వల బాలరాజు రాకముందే ప్రారంభించారు. ఈ సమావేశా నికి ఆలస్యంగా వచ్చిన ఆయన అందరి ముందే మంత్రి పై మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు ఆయనవి నియోజకవర్గం లో కోకొల్లలు.

కల్వకుర్తి నియోజకవర్గంలో

ఇక్కడి బీఆరెస్‌ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై సొంత పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తిరుగుబావుట ఎగురవేశారు. జైపాల్ యాదవ్‌కు సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకం ఉంది. ఎమ్మెల్యే నియోజకవర్గం ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సొంత పార్టీ వారే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ బీఆరెస్ పరిస్థితి అద్వానంగా మారింది. ఇక్కడి బీఆరెస్‌కు వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుంటుందా లేదా అని వేచిచూడాలి.

కొడంగల్ నియోజకవర్గంలో

ఈ నియోజకవర్గం లో బీఆరెస్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ని ఎన్నికల సమయంలో చూశామని ఇక్కడి ప్రజలు అంటున్నారు. తాండూర్ కు చెందిన ఆయన కొడంగల్ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా ఇలా వచ్చి అలా వెళతారని నియోజకవర్గ ప్రజల ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్యే తీరును ప్రజలు ఎండగడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గ్రాఫ్ పూర్తిగా పడిపోయే ప్రమాదo ఉంది. ఇక్కడి నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా బరీ లో ఉండే అవకాశం ఉండడంతో బీఆరెస్‌ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి పై పోటీ పెట్టేందుకు బలమైన నాయకుడి కోసం వెతుకు తున్నారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో

కొల్లాపూర్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన బీరం హరవర్ధన్ రెడ్డి అనంతరం బీఆరెస్‌లో చేరారు. బీఆరెస్‌లో ఉన్న జూపల్లి కృష్ణారావు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఇక్కడ బలమైన నేతగా ఉన్న జూపల్లి పార్టీ వీడటంతో బీఆరెస్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఇక్కడ ప్రస్తుతం బీఆరెస్‌కు గడ్డు పరిస్థితి కనబడుతుంది.