ఏక‌కాలంలో ఒకే కథతో రెండు సినిమాలు..?

తెలుగు సినీ పరిశ్రమకు ఇదేమి దౌర్భాగ్యం! విధాత‌: పాతకాలంలో ఒకే కథతో రెండు చిత్రాలు వచ్చాయి అంటే దానికో అర్థం ఉండేది. నాడు మీడియా విస్తృతంగా లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పెద్దగా లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ చిత్రం లాగా ఉందే అనుకోవాల్సిందే గాని చేయగలిగిందేమీ లేదు. కానీ నేడు అలా కాదు…. మీడియా, సోషల్ మీడియా బాగా విస్తరించింది. కమ్యూనికేషన్ వ్యవస్థ, సినిమాల ట్రైలర్లు, టీజర్లు, గింప్స్‌… ఇలా చాలా వచ్చేశాయి. […]

ఏక‌కాలంలో ఒకే కథతో రెండు సినిమాలు..?
  • తెలుగు సినీ పరిశ్రమకు ఇదేమి దౌర్భాగ్యం!

విధాత‌: పాతకాలంలో ఒకే కథతో రెండు చిత్రాలు వచ్చాయి అంటే దానికో అర్థం ఉండేది. నాడు మీడియా విస్తృతంగా లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పెద్దగా లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ చిత్రం లాగా ఉందే అనుకోవాల్సిందే గాని చేయగలిగిందేమీ లేదు.

కానీ నేడు అలా కాదు…. మీడియా, సోషల్ మీడియా బాగా విస్తరించింది. కమ్యూనికేషన్ వ్యవస్థ, సినిమాల ట్రైలర్లు, టీజర్లు, గింప్స్‌… ఇలా చాలా వచ్చేశాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకే సమయంలో ఒకే భాషలో రెండు చిత్రాలు ఏక‌కాలంలో రూపొందుతున్నాయి అంటే అది మన దౌర్భాగ్యం అనే చెప్పాలి.

ఒకవైపు కొత్త కొత్త రచయితలు, దర్శకులు కొత్త కొత్త ఐడియాలతో వచ్చి తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఆస్కార్ లెవల్లో ఎగరవేయాలని పరితపిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్‌….ఇలా అన్ని టాలీవుడ్ వైపు చూస్తున్నాయి.

కానీ మనం మాత్రం కొన్ని ఘోరమైన తప్పులు చేస్తున్నాం. అద్భుతమైన టాలెంట్ ఉన్నవారి కథలను పక్కనపెట్టి వారి కథలను అసలు వినకుండా తెలిసిన వారి కథలతోనే ఆహా ఓహో అనుకుంటూ కోట్లు ఖర్చు పెడుతున్నాం.

ఇటీవల నాని హీరోగా ‘అంటే సుందరానికీ’ అనే మూవీ, నాగశౌర్య హీరోగా ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రాలు వచ్చాయి.. అదేమి చిత్రమో గాని ఈ రెండు చిత్రాల మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కృష్ణ వ్రింద విహారి చిత్రానికి రచయిత, దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ. అదే సమయంలో అంటే సుందరానికి చిత్రానికి ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌.

వీటిలో ముందుగా విడుదల కావడం వలన ‘అంటే సుంద‌రానికీ’ మూవీకి ప్రయోజనం కలిగింది. ఆలస్యంగా విడుదలైన కృష్ణ వ్రింద‌ విహారి చిత్రం నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి సీన్ మరోటి రిపీట్ కానుంది. అదేమిటంటే మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ‘ధమాకా’, మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన ‘దాస్ కి ధ‌మ్కీ’ చిత్రాలు ఒకే క‌థ‌తో రూపొందుతున్న‌ట్లు స‌మాచారం.

లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ర‌వితేజ ‘ధమాకా’ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి సందడి ఫేమ్‌ శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈనెల 23న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్ ఇప్పటికే లాంచ్ అయింది.

ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఏక‌ కాలంలో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలు, టీజర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఇదే సమయంలో ఇదే తరహా కథతో రూపొందిన మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన దాస్ కి దమ్కీ రూపొందుతోంది. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు విశ్వక్సేన్ స్వ‌యంగా హీరోగా నటిస్తున్నాడు.

అసలు అనుమానం ఏమిటంటే ఈ రెండు చిత్రాలకు బెజవాడ ప్రసన్నకుమార్ కథను అందించారు. ఒకే కథని రెండు వెర్షన్లుగా మార్చి బెజవాడ ప్రసన్నకుమార్ ఇద్దరి హీరోలకు హ్యాపీగా అమ్మివేసినట్టు అర్థమవుతుంది. ఈ విషయం ట్రైలర్లను చూసిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది.

రెండు సినిమాల్లోనూ హీరో క్యారెక్టర్ డ్యూయల్ రోల్. ప్రతి విషయంలోనూ రెండు సినిమాలకి దగ్గర పోలిక కనిపిస్తుండడంతో అంతా విస్తు పోతున్నారు. ఒకే కథని అలా ఎలా అమ్మేశాడో అర్థం కావడం లేదని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. ఈ రెండు చిత్రాలు ఒక నెల గ్యాప్‌లో విడుదల కానున్నాయి.

ఈనెల 23న ధమాకా రానుంది. ఆలస్యంగా వచ్చే దాస్ కా దమ్కీ చిత్రం పై ఈ ప్రభావం బాగానే పడనుంది. ట్రైలర్ విడుదల తర్వాత ఈ రెండు చిత్రాలను పోలుస్తూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మ‌రి ఈ విషయంపై ధమాకా హీరో రవితేజ గానీ.. హీరో విశ్వక్సేన్ గాని క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఎందుకంటే కథ ఇచ్చిన బెజవాడ ప్రసన్నకుమార్ మాత్రం సీన్లోకి వచ్చే అవకాశాలు తక్కువ. మొత్తానికి కోట్లు పెట్టి ఇలా ఇద్దరు దర్శక నిర్మాతలను మోసం చేసి ఇలా ప‌బ్బం గడుపుకునే ప్రయత్నం మంచిది కాదంటూ కొందరు విమర్శకులు సైతం మాట్లాడుకుంటుండటం విశేషం. మరి ఏ విషయం తెలియాలంటే మాత్రం రెండు సినిమాలు విడుదలయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.